– సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గని శెట్టి డిమాండ్
పరవాడ: మండలంలో ఉపాధి హామీ కార్మికులకు 12వారాలు బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ బుధవారం సిఐటియు ఆధ్వర్యంలో బొద్ధపువానిపాలెం గ్రామంలో పని ప్రదేశంలో ఉపాధి హామీ కార్మికులతో ఆందోళన జరిగింది.
ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గని శెట్టి. సత్యనారాయణ మాట్లాడుతూ ఉపాధి హామీ కార్మికులకు 12వారాల నుండి వేతనాలు చెల్లించకపోవడం వలన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వేతనాలు వెంటనేచెల్లించాలని డిమాండ్ చేశారు. బకాయి పడ్డ 12 వారాల వేతనాలు వెంటనే చెల్లించాలని గని శెట్టి డిమాండ్ చేశారు.
ఉపాధి హామీ కార్మికులు అర్దాకులతో జీవిస్తున్నారని 12వారాల నుండి వేతనాలు బకాయి పెట్టడం అన్యాయం అన్నారు. ఉపాధి హామీ పని చేస్తున్న కార్మికులకు మంచినీరు మజ్జిగ వంటివి సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. పారకి తట్టకి గుంపాంకి డబ్బులు చెల్లించాలని, వేసవి వేతనం కూడా కలిపి 40% అదనంగా చెల్లించాలని డిమాండ్ చేశారు.
కేంద్ర బిజెపి ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రలను ఉపసంహరించుకోవాలని అన్నారు. ఉపాధి హామీ కార్మికులకు సంవత్సరానికి 200 రోజులు పని కల్పించాలని, రోజుకి 600 రూపాయలు వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. కొలతలతో సంబంధం లేకుండా ప్రభుత్వం ప్రకటించిన జీవో ప్రకారంగా 309 రూపాయలు వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఉపాధి హామీ కార్మికులందరికీ మండలంలో అన్ని గ్రామాల్లోనూ పని కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం లైవ్ ఆడిట్ పేరుతో ఉపాధి హామీ కార్మికులను వేధింపులకు గురి చేసే విధానం మానుకోవాలని కార్మికుల రక్షణకు సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ప్రతి వారం వేతనాలు చెల్లించాలని లేనిపక్షంలో ఆందోళన చేపడుతామని గని శెట్టి ప్రభుత్వాలను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ కార్మికులు పాల్గొన్నారు.