Suryaa.co.in

Andhra Pradesh

ఒంగోలు-బెస్తవారిపేట మధ్య 4 లైన్ల రహదారి నిర్మించండి

– కేంద్ర మంత్రి నితిన్ గడ్కరికి మాజీ ఎంపి, టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి వినతి
– సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి

రోజు రోజుకు పెరుగుతున్న వాహనాల రద్దీ, ప్రజావసరాలను దృష్టిలో ఉంచుకుని ఒంగోలు – బెస్తవారిపేట మధ్య 4 లైన్ల రహదారి నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని మాజీ ఎంపి, టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరికి విజ్ఞప్తి చేశారు.

సుబ్బారెడ్డి ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరిని కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. తాను ఒంగోలు ఎంపి గా 2018 లో ఈ మేరకు ప్రతిపాదనలు సమర్పించానని ఆయన మంత్రి దృష్టికి తెచ్చారు. దీనిపై అప్పట్లో సర్వే చేసి, నోటిఫికేషన్ కూడా జారీ చేశారని చెప్పారు. ఆ తరువాత ఈ ప్రతిపాదనలు పెండింగులో ఉంచారని ఆయన వివరించారు.

ఇదే విషయం పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రహదారులు భవనాల శాఖ ద్వారా 2019 జనవరి లోను, ఆ తరువాత 2021 మార్చి లోను ఇదే అంశంపై ప్రతిపాదనలు పంపించామని సుబ్బారెడ్డి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరికి వివరించారు. భారత మాల పరియోజన పథకం కింద ఒంగోలు – బెస్తవారిపేట రోడ్డును 4 లైన్ల రహదారిగా విస్తరించడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతోపాటు ఈ మార్గంలోని ఒంగోలు, చీమకుర్తి, పొదిలి, ఉప్పలపాడు, బెస్తవారిపేట వద్ద అవసరమైన చోట బైపాస్ లేదా రింగ్ రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని సుబ్బారెడ్డి కోరారు. ఈ ప్రతిపాదనలపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి సానుకూలంగా స్పందించారు.

LEAVE A RESPONSE