Suryaa.co.in

Andhra Pradesh

వైసీపీ హయాంలో రాష్ట్ర‌ ప్ర‌జ‌ల‌పై రూ.20 వేల కోట్ల భారం

– గత ప్రభుత్వంలో ఏడెనిమిది వేల మెగా వాట్ల సోలార్, విండ్ విద్యుత్ ఉత్ప‌త్తి నిలిపివేత
– విద్యుత్ కొనుగోళ్లు పేరుతో అనుయాయుల‌కు వేల కోట్లు దోచి పెట్టారు
– గ‌త ఐదేళ్ల‌లో 9 సార్లు విద్యుత్ చార్జీల‌ను పెంచిన ఘ‌న‌త వైసీపీ ప్రభుత్వానిదే.
– వ్య‌వ‌సాయ రంగానికి పగటిపూట 9 గంట‌ల నిరంతరాయ విద్యుత్ అందించ‌డ‌మే ల‌క్ష్యం
– సీఎం చంద్ర‌బాబు నాయుడుపై న‌మ్మ‌కంతో… విద్యుత్ రంగంలో రూ.10 ల‌క్ష‌ల కోట్లు పెట్టుబ‌డులు
– శాస‌న మండ‌లిలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్

అమరావతి : 2019 వ‌ర‌కు మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉంద‌ని, అనంత‌రం అధికారం చేప‌ట్టిన వైసీపీ ప్రభుత్వం విధ్వంస‌క‌ర నిర్ణ‌యాల‌తో విద్యుత్ రంగాన్ని వేల కోట్ల రూపాయిల న‌ష్టాల్లోకి నెట్టేసింద‌ని మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ పేర్కొన్నారు. శాస‌న మండ‌లిలో బుధ‌వారం స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు ఆయ‌న స‌మాధానం చెబుతూ… రాష్ట్రంలో ప్ర‌స్తుతం విద్యుత్ రంగం ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను వివ‌రించారు.

వైసీపీ ప్ర‌భుత్వం.. ట్రూ అప్ చార్జీల‌ను వేసి ఈఆర్సీకి పంపి… రెండు సంవ‌త్స‌రాలు అలాగే ఉంచేశార‌ని పేర్కొన్నారు. కేవ‌లం వ్య‌క్తిగ‌త క‌క్ష‌ల‌తో ఏడెనిమిది వేల మెగావాట్ యూనిట్ల‌ సోలార్, విండ్ విద్యుత్ ఉత్ప‌త్తిని నిలిపి వేశార‌ని వెల్ల‌డించారు. రాష్ట్రంలో ఈ విధంగా విద్యుత్ ఉత్ప‌త్తిని నిలిపి చేయ‌డ‌మే కాకుండా… మ‌రోప‌క్క‌ ప‌వ‌ర్ ప‌ర్చేజ్ ల పేరుతో…. వైసీపీ ప్ర‌భుత్వ పెద్ద‌ల అనుయాయుల‌కు వేల కోట్ల రూపాయిలు దోచి పెట్టార‌ని మంత్రి మండిప‌డ్డారు.

విద్యుత్ రంగం విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో ఉన్న నేప‌ధ్యంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుపై ఉన్న న‌మ్మ‌కంతో… విద్యుత్ రంగంలో రూ.10 ల‌క్ష‌ల కోట్లు పెట్టుబ‌డులు పెట్ట‌డానికి పారిశ్రామిక‌వేత్త‌లు ముందుకు వ‌చ్చిన‌ట్లు ఆయ‌న ఈ సంద‌ర్భంగా స్ప‌ష్టం చేశారు.

కోర్టుల‌నూ త‌ప్పుదోవ ప‌ట్టించే విధంగా….
ప‌వ‌ర్ ప‌ర్చేజ్ ల పేరుతో ప్ర‌జ‌ల నెత్తిన భారం వేసిన వైసీపీ ప్ర‌భుత్వం… కోర్టుల‌ను కూడా త‌ప్పుదోవ ప‌ట్టించే విధంగా చ‌ర్య‌లు చేప‌ట్టింద‌ని మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ విమ‌ర్శించారు. బీపీఎల్ ఎందుకు అమ‌లు చేయాలేద‌ని కోర్టు ప్ర‌శ్నించినా, కోర్టు వ్యాఖ్య‌ల‌ను గౌర‌విస్తున్న‌ట్లు నటిస్తూనే… లైన్ల‌ను బిజీ పెట్టి ఉత్ప‌త్తి అయ్యే ప‌వ‌ర్ ని కూడా తీసుకోకుండా విద్యుత్ రంగానికి న‌ష్టాన్ని చేశార‌ని మంత్రి వెల్ల‌డించారు. ఇటువంటి వైసీపీ ప్ర‌భుత్వ చ‌ర్య‌ల‌తో… పెట్టుబ‌డిదారులు రాష్ట్రానికి రావాలంటేనే భ‌య‌ప‌డే ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

వీటీపీఎస్, క్రుష్ణ‌ప‌ట్నం, పోల‌వ‌రం వంటి వాటి ద్వారా ఎంతో విద్యుత్ ఉత్ప‌త్తికి అవ‌కాశం ఉన్నా… గ‌త వైసీపీ ప్రభుత్వంలోని సీఎం చ‌ర్య‌ల‌తో ప్ర‌జ‌లు తీవ్రంగా న‌ష్ట‌పోయార‌ని వివ‌రించారు. వైసీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో 9 సార్లు విద్యుత్ చార్జీల‌ను పెంచిన విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ గుర్తు చేశారు. గ‌త సీఎం అనాలోచిన నిర్ణ‌యాల‌తోనే ప్ర‌జ‌ల‌పై సుమారు రూ.20 వేల కోట్ల‌కుపైగా విద్యుత్ భారం ప‌డింద‌ని వాపోయారు.

24 గంట‌లూ నాణ్య‌మైన విద్యుత్….
రాబోయే రోజుల్లో ప్ర‌జ‌ల‌పై భారం ప‌డ‌కుండా కూట‌మి ప్ర‌భుత్వం అన్ని చ‌ర్య‌లూ తీసుకుంటున్న‌ట్లు మంత్రి గొట్టిపాటి వివ‌రించారు. ఫీడ‌ర్ లెవ‌ల్లో న‌ష్టాలు రాకుండా ఉండేందుకు కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ సంయుక్త భాగ‌స్వామ్య ప‌థ‌కం ద్వారా ప్ర‌జ‌ల‌కు 24 గంట‌లు, వ్య‌వ‌సాయానికి 9 గంట‌లు నాణ్య‌మైన విద్యుత్ ను అందించ‌డానికి అన్ని చ‌ర్య‌లు చేప‌ట్టామ‌ని తెలిపారు. డిస్క్ంలలో మ‌రింత మెరుగైన ప‌ద్ధ‌తిలో విద్యుత్ ఉత్ప‌త్తిని చేయిస్తామ‌ని చెప్పారు. అదే విధంగా ఏపీ జెన్ కో ద్వారా… రెండు పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల‌తో 2,300 మెగావాట్ల విద్యుత్ ఉత్ప‌త్తి ల‌క్ష్యంగా ముందుకెళ్తున్నామ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. రాబోయే రోజుల్లో పెరిగే విద్యుత్ వినియోగానికి అనుగుణంగా… పీఎస్పీలు, సోలార్, విండ్, హైడ్ర‌ల్ వంటి విద్యుత్ ఉత్ప‌త్తి ప్రాజెక్టుల‌ను ఏర్పాటు చేస్తున్న‌ట్లు మంత్రి గొట్టిపాటి వెల్ల‌డించారు.

రూ.15 వేల కోట్ల‌తో స‌బ్ స్టేష‌న్లు, ట్రాన్స్ ఫార్మర్లు, ట్రాన్స్ మిష‌న్ లైన్లు…
అంత‌రాయం లేని నాణ్య‌మైన విద్యుత్ ను నిరంత‌రాయంగా అందించ‌డానికి రూ.15 వేల కోట్ల‌తో 71 స‌బ్ స్టేష‌న్లు, ట్రాన్స్ ఫార్మ‌ర్లు, ట్రాన్స్ మిష‌న్ లైన్లు ఏర్పాటు చేస్తున్న‌ట్లు మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ వివ‌రించారు. విద్యుత్ వినియోగం పెరిగినా ఇబ్బందులు లేకుండా ఇటువంటి ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌లు చేప‌డుతున్నామ‌ని తెలిపారు. అదే విధంగా కొత్త‌గా పెట్టుబ‌డులు పేట్టే వారిని ఆహ్వానిస్తున్నామ‌ని, రాష్ట్ర అభివృద్ధిలో పాలుపంచుకునే అంద‌రినీ ప్రోత్స‌హిస్తామ‌ని మంత్రి గొట్టిపాటి ఈ సంద‌ర్భంగా పేర్కొన్నారు.

LEAVE A RESPONSE