- సబ్సిడీలకు కోత – కార్పొరేట్లకు నజరానా
- అభివృద్ధికి కీలకమైన ఆర్థిక కార్యకలాపాల విస్తరణ ఏది?
- ఉద్యోగుల, ఆఫీసర్ల, పెన్షనర్ల జాతీయ నేత వి. కృష్ణ మోహన్
కనీవినీ ఎరుగని స్థాయికి చేరుకున్న నిరుద్యోగం, అధిక ఆహార ద్రవ్యోల్బణం రేటు, అసాధారణమైన రీతిలో పెరుగుతున్న అసమానతలు, మందగించిన ప్రయివేట్ పెట్టుబడులు వంటి ఆర్థిక వాస్తవికతల నేపథ్యంలో కేంద్ర బడ్జెట్ ఆర్థిక కార్యకలాపాలను విస్తరించడంపై ప్రధానంగా దృష్టి పెట్టాల్సిఉందని, అందుకు భిన్నంగా ప్రస్తుత బడ్జెట్‌లో చేసిన ప్రతిపాదనలు వాటిని కుదించేలా, తిరోగమన ధోరణిలో వున్నాయని ఉద్యోగుల, ఆఫీసర్ల, పెన్షనర్ల జాతీయ నేత వి. కృష్ణ మోహన్ పేర్కొన్నారు.
ప్రజలపై మరింత భారాలు మోపేలానే ఈ ప్రతిపాదనలు వున్నాయని, పెట్టుబడులు ఉపాధి కల్పన స్థాయిలను దిగజార్చేలా వున్నాయని తెలిపారు. ప్రభుత్వ రెవిన్యూ ఆదాయాలు 14.5 శాతం మేరకు పెరగగా, వ్యయం మాత్రం కేవలం 5.94 శాతమే పెరిగినట్లు బడ్జెట్ గణాంకాలు తెలియచేస్తున్నాయి. ఈ రెవిన్యూలను ఆర్థిక కార్యకలాపాల విస్తరణకు ఉపయోగించడానికి బదులుగా, జిడిపిలో ఆర్థిక లోటును 5.8 శాతం నుంచి 4.9 శాతానికి తగ్గించడం ద్వారా అంతర్జాతీయ ఫైనాన్స్ పెట్టుబడిదారులను బుజ్జగించడానికి ఉపయోగించారని వాపోయారు.
బడ్జెట్‌లో అంచనా వేసిన జిడిపి గణాంకాలు సమాచారాన్ని తప్పుగా చూపించడం (డేటా ఫడ్జింగ్) లో మరో ప్రక్రియ అని తెలిపారు. నామమాత్రపు జీడీపీ వృద్ధి 10.5 శాతమని అంచనా వేశారు, కానీ కీలకమైన ద్రవ్యోల్బణ రేటు 3 శాతాన్ని మినహాయించడం ద్వారా వాస్తవిక జీడీపీ 6.5 నుండి 7 శాతం మేరకు వృద్ధి చెందుతుందని అంచనా వేశారు.
కీలక ద్రవ్యోల్బణం రేటులో కూడా అధిక ఆహార ద్రవ్యోల్బణం 9.4 శాతాన్ని మినహాయించారు. ఆ రకంగా వాస్తవిక జిడిపి వృద్ధిని ఎక్కువ చేసి చూపించారని విమర్శించారు. ప్రభుత్వ వ్యయాన్ని మరింతగా కుదించారు. సబ్సిడీల్లో గణనీయంగా కోత విధించారు. ఎరువుల సబ్సిడీని రూ.24,894 కోట్ల మేరకు కోత విధించారు.
ఆహార సబ్సిడీని రూ.7,082 కోట్ల మేరకు కోత పెట్టారు. విద్య, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి రంగాలపై వ్యయాలను జిడిపిలో శాతంగా గనక చూసినట్లైతే పెద్దగా మార్పేమీ లేదు.
మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్) ను మరింతగా నిర్లక్ష్యం చేస్తూనే వచ్చారు. బడ్జెట్ కేటాయింపులు రూ.86 వేల కోట్లు వున్నా ఇవి 2023 ఆర్థిక సంవత్సరంలో ఖర్చు పెట్టిందానికన్నా తక్కువే.
ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి నాలుగు మాసాల్లో ఇప్పటికే రూ.41,500 కోట్లు ఖర్చు పెట్టగా, మిగిలిన 8 మాసాల కాలంలో కేవలం రూ.44,500 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టడానికి వున్నాయి. గ్రామీణ భారతంలో తీవ్రంగా నెలకొన్న నిరుద్యోగ సంక్షోభాన్ని ఎదుర్కొనడానికి ఇవి ఎంత మాత్రమూ సరిపోవనేది స్పష్టమవుతోందని పేర్కొన్నారు.
నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తామనే పేరుతో, బడ్జెట్ అనేక జిమ్మిక్కులకు పాల్పడింది. ఎంప్లాయిమెంట్ లింక్డ్ ఇన్సెంటివ్‌గా తీసుకువచ్చిన కొత్త పథకం కింద సాధికార రంగంలో కొత్తగా చేరి రూ.లక్ష కన్నా తక్కువ సంపాదిస్తున్న వారికి ఒక నెల వేతనాన్ని ఇస్తామని ప్రకటించింది. అర్హులైన వర్కర్లు గరిష్టంగా రూ.5 వేలను మూడు నెలవారీ వాయిదాల్లో పొందుతారని, అయితే, దీనివల్ల యజమానులు ఎక్కువగా లబ్ది పొందుతారని వివరించారు.
రెండేళ్లలో సృష్టించిన ప్రతి అదనపు ఉద్యోగానికి రూ.లక్ష వరకు నెల జీతం వున్న ప్రతి ఒక్క కొత్త ఉద్యోగి వల్ల రూ.72 వేలు చొప్పున, 24 నెలవారీ వాయిదాల్లో యజమానులు లబ్ధి పొందుతారు. ఇటువంటి జిమ్మిక్కుల వల్ల ఉపాధి కల్పన జరగబోదు. గత సంవత్సరాల్లో కార్పొరేట్ రంగం సంపాదించిన భారీ లాభాలు భారీ యంత్రాలు, ఉత్పత్తి రంగాల్లో పెట్టుబడుల రూపంలో కనిపించడం లేదు. ఆర్థిక వ్యవస్థలో నిలకడగా డిమాండ్ లేకపోవడమే ఇందుకు కారణంగా వుంది. దీనివల్ల ప్రజల్లో కొనుగోలు శక్తి బాగా క్షీణించిందని పేర్కొన్నారు.
యువతలో నైపుణ్యాలను పెంపొందించే పథకాలను బడ్జెట్‌లో బాగా ప్రముఖంగా ప్రస్తావించినప్పటికీ వీటివల్ల కూడా తీవ్రంగా వున్న నిరుద్యోగ సమస్య పరిష్కారం కాదు. 2016-2022 ల్లో కేవలం 18 శాతం మంది యువత మాత్రమే నైపుణ్యాల అభివృద్ధి పథకాల ద్వారా శిక్షణ పొంది ఉద్యోగాలు సంపాదించుకున్నారు. మరోసారి ఇక్కడ సుస్పష్టం చేయాల్సిన అంశమేమంటే ఆర్థిక కార్యకలాపాలు విస్తరించకపోతే వృద్ధి చెందలేం.
‘సహకార సమాఖ్యవాదం’ గురించి చెప్పినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఇబ్బందులు పడుతున్నాయి. రాష్ట్రాలకు ఆర్థిక సంఘం మంజూరు చేసే నిధులు (పన్నుల ద్వారా వచ్చేది కాకుండా) 2022-23లో రూ.1,72,760 కోట్లు వుండగా, 2023-24 కి వచ్చేసరికి రూ.1,40,429 కోట్లకు పడిపోయాయి. ఈ బడ్జెట్ ఈసారి ఇంకా కుదించబడి, 1,32,378 కోట్లకు చేరుకుంది.
మొత్తమ్మీద చూసినట్లైతే, ఈ బడ్జెట్ సంపన్నులను మరింత సంపన్నులుగా చేయడానికి, పేదలను మరింత దుర్భర దారిద్య్రంలోకి నెట్టడానికి ఉద్దేశించబడింది. దేశంలోని సూపర్ సంపన్నులపై సంపద పన్ను లేదా వారసత్వపు పన్ను విధింపు ప్రతిపాదనను పరిశీలించేందుకు కూడా తిరస్కరించింది. ప్రజలపై పడే పరోక్ష పన్ను భారానికి ఉపశమనం కూడా ఈ బడ్జెట్‌లో లేదు.
దేశ ప్రజలు, ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరించడంలో విఫలమైనందున ఈ బడ్జెట్ ప్రతిపాదనలను మార్చి ప్రజా అనుకూల విధానాలను అమలు చేయాలని వి. కృష్ణ మోహన్ ఆర్థిక మంత్రికి విజ్ఞప్తి చేశారు.