– దేశాభివృద్ధికి పాటుపడండి
– ప్రజలకు కేంద్ర మంత్రి బండి సంజయ్ పిలుపు
– స్వరాజ్ ట్రాక్టర్లను పంపిణీ చేసిన కేంద్ర మంత్రి
– జీఎస్టీ సంస్కరణలతో ఒక్కో ట్రాక్టర్ పై రూ.40 నుండి 800 వేలదాకా ఆదా అవుతోందని రైతుల సంతోషం
– జీఎస్టీతో సేల్స్ బాగా పెరిగాయంటున్న డీలర్స్ అసోసియేషన్
స్వదేశీ వస్తువులనే వాడాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. మన దేశంలో తయారు చేసిన వస్తువులు కొనుగోలు చేయడం ద్వారా స్థానిక కంపెనీలు, చిన్నతరహా వ్యాపారాలు బలపడతాయని, ఉద్యోగావకాశాలు పెరుగుతాయని తెలిపారు. స్థానిక ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని, డబ్బు దేశంలోనే చలామణి అవుతుందని పేర్కొన్నారు. స్వయం సమృద్ధి చెందిన దేశంగా (ఆత్మ నిర్భర భారత్) అభివ్రుద్ధి చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేపడుతున్న కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ సంపూర్ణ మద్దతివ్వాలని కోరారు.
జీఎస్టీ సంస్కరణల ఫలితంగా ‘స్వరాజ్ సంస్థ’ ట్రాక్టర్ ధర రూ.40 వేల నుండి రూ.80 వేల వరకు తగ్గిన నేపథ్యంలో పలువురు రైతులు వాటిని కొనుగోలు చేశారు. స్వరాజ్ ట్రాక్టర్స్ డీలర్స్ అసోసియేషన్ నాయకులు ఆయా ట్రాక్టర్లను కేంద్ర మంత్రి చేతుల మీదుగా రైతులకు అందజేశారు.
ఈ సందర్భంగా బండి సంజయ్ ఆయా రైతులతో, డీలర్స్ తో మాట్లాడి ఒక్కో ట్రాక్టర్ పై ఎంత ధర తగ్గిందని ఆరా తీశారు. జీఎస్టీ సంస్కరణలవల్ల తాను కొన్న ట్రాక్టర్ ధర రూ.10 లక్షల 50 వేలు ఉండగా, ప్రస్తుతం రూ. 9 లక్షల 80 వేలకే వచ్చిందని తద్వారా రూ.70 వేలు ఆదా అయ్యాయని మక్కపల్లికి చెందిన రైతు అఖిల్ చెప్పారు.
మానకొండూరు మండలం లింగాపూర్ కు చెందిన అనిల్ కుమార్ అనే రైతు మాట్లాడుతూ జీఎస్టీ వల్ల తనకు రూ.50 వేలు ఆదా అయ్యిందన్నారు. నుస్తులాపూర్ కు చెందిన వెంకటేశ్ యాదవ్ మాట్లాడుతూ తాను ట్రాక్టర్ కొనడంవల్ల రూ.50 వేలు ఆదా అయ్యిందన్నారు. స్వరాజ్ ట్రాక్టర్ డీలర్ వెంకట్ మాట్లాడుతూ జీఎస్టీ తగ్గింపుతో స్వరాజ్ కు చెందిన వివిధ రకాల ట్రాక్టర్లు ఒక్కో దానిపై సగటున రూ.40 నుండి రూ.80 వేలదాకా తగ్గింపు జరిగిందన్నారు. తద్వారా ట్రాక్టర్స్ సేల్స్ బాగా పెరిగాయని, రైతులు కూడా చాలా సంతోషంగా ఉన్నారని తెలిపారు.
ఈ సందర్భంగా వారంతా కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ జీఎస్టీవల్ల కలుగుతున్న ప్రయోజనాలను మీ చుట్టుపక్కలనున్న వారందరికీ వివరించాలని వారిని కోరారు.