– రైతుల కన్నీటి గోడు కూటమి సర్కార్‌కు కనిపించడం లేదా?
– వైయస్ఆర్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి సూటి ప్రశ్న
కర్నూలు: కర్నూలు జిల్లాలో ఉల్లి, టమాటా పంటలను కొనుగోలు చేసేవారు లేక, రైతులు పండించిన పంటను కన్నీటితో రోడ్ల పక్కన పారేసి వెళ్ళిపోతున్నా కూటమి ప్రభుత్వంలో చలనం లేదని వైయస్ఆర్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి మండిపడ్డారు. కర్నూలు జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రైతులను ఆదుకోవడంలో ఘోరంగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వమని మండిపడ్డారు. పంటలకు ధర లేక, వ్యవసాయానికి యూరియా దొరక్క రైతులు అల్లాడుతుంటే, సిగ్గులేకుండా విజయోత్సవాలు చేసుకుంటున్నారని ఆక్షేపించారు. ఇంకా ఆయనేమన్నారంటే…
కర్నూలు జిల్లాలో ఉల్లి, టమాటా రైతుల గోడు కూటమి ప్రభుత్వం చెవికి సోకడం లేదు. రైతులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం మొద్దు నిద్రపోతోంది. ప్యాపిలి మండలంలో రైతులు పండించిన టమాటాను కేజీ కనీసం రూపాయి కూడా కొనేవారు లేక రోడ్డుపక్కన పారబోసి వెళ్లిపోయారు. కర్నూలులో ఉల్లి పంటకు రేటు లేక మార్కెట్ యార్డ్ నుంచి బళ్ళారి చౌరస్తా వరకు పంటతో కూడిన ట్రాక్టర్లు క్యూలో పెట్టుకుని వేచి ఉండాల్సిన పరిస్థితి. వర్షాల వల్ల ట్రాక్టర్లలో ఉల్లి తడిచిపోయి, కొనేవారు లేక రైతులు ఆవేదన చెందుతున్నారు.
చివరికి ఉల్లి కొనేవారు లేకపోవడం, ట్రాక్టర్లలో తెచ్చిన ఉల్లి తడిచిపోవడంతో చేసేది లేక రైతులు మునగాలపాడు సమ్మర్ స్టోరేజీ ట్యాంక్ వద్ద రోడ్డు పక్కన ఉల్లి పంటను బస్తాలతో సహా పడేసి వెళ్ళిపోయారు. తిరిగి ఆ పంటను ఇంటికి తీసుకువెళ్ళాలంటే దానికి కూడా రవాణా చార్జీలు చెల్లించాల్సి ఉండటంతో, విధిలేని పరిస్థితుల్లో ఉల్లిని రోడ్డు పక్కన పడేసి, కన్నీటితో వెళ్ళిపోయారు. రోడ్డు పక్కన పడేసిన ఉల్లిని స్థానికులు ఎలా తీసుకువెడుతున్నారో దానికి సంబంధించిన వీడియోలు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ మీడియా సమావేశం ద్వారా ఆ వీడియోలను కూడా ప్రదర్శిస్తున్నాం.