ఎంసెట్ 3వ విడత కౌన్సెలింగ్ వెంటనే నిర్వహించాలంటూ రాష్ట ఉన్నత విద్యా కార్యాలయం వద్ద నిరసన
జోన్-3 పరిధిలోని పార్లమెంట్ టీఎన్‌ఎస్‌ఎఫ్ అధ్యక్షుల ఆధ్వర్యంలో నిరసన
అమరావతి, అక్టోబర్ 18: రాష్ట్రంలో ఎంసెట్ 3వ విడత కౌన్సెలింగ్ నిర్వహణపై ప్రభుత్వ ఉదాసీన వైఖరిని నిరసిస్తూ జోన్-3 పరిధిలోని పార్లమెంట్ టీఎన్‌ఎస్‌ఎఫ్ అధ్యక్షులు బుధవారం నాడు మంగళగిరిలోని ఉన్నత విద్యా చైర్మన్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఎంసెట్ -3వ విడుత కౌన్సిలింగ్‌ను తక్షణమే చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నత విద్యా చైర్మన్ హేమచంద్ర రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంజినీరింగ్ ప్రవేశాలకు సంబంధించి రాష్ట్రం నుంచి ఏటా లక్షలాది మంది ఎంసెట్ రాస్తుంటారని గుర్తు చేశారు. ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం 3 విడతల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తుండగా ఈ ఏడాది అర్ధాంతరంగా రెండు కౌన్సెలింగ్ లకే పరిమితం చేయడం బాధాకరమన్నారు.
ఈ విషయంపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి లేఖ కూడా రాశారని గుర్తు చేశారు. పద్ధతిగా జరగాల్సిన 3వ విడత కౌన్సెలింగ్ రద్దుచేసి విద్యార్థులకి తీరని ద్రోహం చేశారని మండిపడ్డారు. మీకు ఇద్దరు పిల్లలున్నారు. రాష్ట్రంలో ఉన్న పిల్లలందరికీ మేనమామనంటావు. కనీసం తండ్రి మనసుతో ఆలోచించినా మంచి బ్రాంచిలో ఇంజనీరింగ్ చేయాలనే కల్లలైన కలలు పిల్లలు చేతులు కోసుకుంటూ, రక్తాలతో రాస్తున్న లేఖలు చూసైనా మనసు కరగదా? అని సీఎంను ప్రశ్నించారు.
లి విడతల్లో దూరప్రాంత కాలేజీలో సీట్లు వచ్చిన విద్యార్థులు 3వ విడత కౌన్సెలింగ్ కోసం నిరీక్షిస్తుంటే..స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహించడం తీరని అన్యాయం చేయడమే అని వ్యాఖ్యనించారు. మంత్రి బొత్స సత్యనారాయణ కౌన్సెలింగ్ డేట్ ఇస్తామని విద్యార్థులకి హామీ ఇచ్చి మోసగించారని ఆగ్రహాం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు ప్రతీ ఏటా మూడు విడతల కౌన్సెలింగ్ నిర్వహిస్తుండగా.. ఈ ఏడాది రెండు విడతలకే పరిమితం చేయడం వెనుక ఆంతర్యం ఏంటో ప్రభుత్వం వేలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
స్పాట్ అడ్మిషన్లు అయితే ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించక్కర్లేదని, కౌన్సెలింగ్ సీట్లయితే చెల్లించాల్సి వస్తుందనే కుతంత్రంతోనే ఏకంగా 3వ విడత కౌన్సెలింగ్ రద్దు చేయడం అన్యాయమన్నారు. స్పాట్ అడ్మిషన్లు, కన్వీనర్ కోటాలో సీఎస్ఈ సీట్లన్నీ అమ్ముకునేందుకు సర్కారు విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటోందని ఎద్దెవా చేశారు. 3వ విడత కౌన్సెలింగ్ కోసం ఎదురుచూస్తున్న 13 వేలమంది విద్యార్థులు ప్రభుత్వానికి, విద్యామంత్రికి, ఉన్నత విద్యామండలి అధికారులకి చేసుకున్న వినతులు కనీసం పరిగణనలోకి ఎందుకు తీసుకోవడంలేదో అర్థంకావడం లేదన్నారు.
అక్రమ కేసులో మమ్మల్ని అరెస్టు చేసేందుకు పెట్టిన శ్రద్ధలో ఒకటో వంతు రాష్ట్ర సమస్యలపై పెట్టి ఉంటే వ్యవస్థలు ఇంత అస్తవ్యస్తంగా తయారయ్యేవి కావన్నారు. సీఎం వైఎస్ జగన్ ఇప్పటికైనా స్పందించి, వెంటనే ఎంసెట్ 3వ కౌన్సెలింగ్ తేదీలు ప్రకటించి, విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో జోన్ -3 కి సంబందించిన టీఎన్‌ఎస్‌ఎఫ్ పార్లమెంట్ అధ్యక్షులు ఎం.వంశీ కృష్ణ, కే. హనుమంత రావు, శరత్ బాబు, వినోద్ కుమార్, చరణ్ యాదవ్, జీవన్ కుమార్, విజయ్ కుమార్, మరియు రాష్ట్ర, పార్లమెంట్, అసెంబ్లీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.