Suryaa.co.in

Andhra Pradesh

జీవో 1ని కొట్టివేయడం ద్వారా చెప్పు తీసుకొని కొట్టినంత పని చేసిన న్యాయస్థానం

-రాక్షసత్వంలో జగన్మోహన్ రెడ్డిని మించిన వారు లేరు
-త్వరలో రాష్ట్రంలో ఏర్పడేది ప్రజా ప్రభుత్వమే
-పవన్ కళ్యాణ్ ప్రజా నాయకుడు… కాపు నాయకుడు కాదు
-పొత్తులపై ఎవరికి ఎటువంటి అనుమానాలు లేకుండా స్పష్టతనిచ్చిన పవన్ కళ్యాణ్
-అందుకే ప్రధాన ప్రతిపక్షాలు ఏకం కావాలని నిర్ణయించాయి
-డిసెంబర్ లో మారనున్న ప్రభుత్వం… తన వద్దనున్న కస్టోడియల్ టార్చర్ పూర్తి వివరాలు
-కాంగ్రెస్ కు ఘన విజయాన్ని చేకూర్చిన జగన్మోహన్ రెడ్డి
-బీజేపీ నాయకత్వం ఇప్పటికైనా దుష్టులకు దూరంగా ఉంటే మంచిది
-నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు

త్వరలో రాష్ట్రంలో ఏర్పడేది ప్రజా ప్రభుత్వమే. తెలుగుదేశం, జనసేన పార్టీలో మధ్య కచ్చితంగా పొత్తు ఉంటుంది. మూడవ పార్టీ తో కూడా పొత్తు ఉంటుందా? అన్నది ప్రస్తుతానికి ప్రశ్నార్థకమే. అయితే మూడవ పార్టీతోను పొత్తు ఉండాలనేది అందరి అభిమతం. పొత్తు వారికి కావాలి సమ్మతమని నరసాపురం ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు వ్యాఖ్యానించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజా నాయకుడు. ఒక కులానికి ఆయన నాయకుడు కాదు. తాను ఈ విషయాన్ని అనేకమార్లు చెప్పుకొచ్చాను. పవన్ కళ్యాణ్ అంటే అభిమానం ఉందని చెబుతూనే, పవన్ కళ్యాణ్ ను పవన్ కళ్యాణ్ గా చూడలేని వారు, ఒక కుల నాయకుడిగా చూసేవారు తమకు అవసరం లేదని ఆయనే చెప్పారు. ఒక కులానికి, మతానికి ప్రాతినిధ్యం వహించేవారు మహా అంటే ఒక్కసారి నాయకుడు అవుతారేమో కానీ, జీవిత కాలం నాయకుడు కాలేరు. రాజకీయాల్లోకి సేవా భావంతో వచ్చిన పవన్ కళ్యాణ్ ను , జగన్మోహన్ రెడ్డి వేసే చిల్లర మెతుకులకు ఆశపడే వ్యక్తులు, సంకుచిత స్వభావంతో పవన్ కళ్యాణ్ ను అప్రతిష్ట పాలు చేసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా వృధా ప్రయాసే అవుతుందని ఆయన విమర్శించారు.

ఏ కులాన్నయితే అడ్డుపెట్టుకొని పవన్ కళ్యాణ్ పై రాజకీయం చేయాలని కొందరు అనుకుంటున్నారో ఆ ప్రజలే రేపు వారిని చెప్పులు, రాళ్లతో కొట్టడం ఖాయం. ఒకటి రెండు చానల్స్ ని అడ్డం పెట్టుకుని పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అంటూ తప్పుడు ప్రచారాన్ని చేసేవారు. ముఖ్యమంత్రి పదవి విషయంలో పవన్ కళ్యాణ్ స్పష్టతను ఇచ్చాక వారు వణికి పోతున్నారు. శనివారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… రానున్న ఎన్నికల్లో పొత్తులపై ఎవరికి ఎటువంటి అనుమానాలు లేకుండా పవన్ కళ్యాణ్ స్పష్టతను ఇచ్చారన్నారు.

పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతో జనసేన ముసుగులో తమ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్న వారు, పవన్ కళ్యాణ్ సామాజిక వర్గమని చెప్పుకునే వారు అవాకులు చవాకులు పేలుతున్నారు. మంత్రులు అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్ తో పాటు మరి కొంతమంది చేస్తున్న విమర్శలు అర్థరహితము. రాష్ట్రంలో కొనసాగుతున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాకూడదన్నది పవన్ కళ్యాణ్ దృఢ నిశ్చయంగా కనిపిస్తోంది. జనసేనకు ప్రజాబలం ఉన్నప్పటికీ, ఎన్నికల్లో పోటీ చేసి అన్ని స్థానాలలో గెలిచే బలం లేదని పవన్ కళ్యాణే స్పష్టంగా చెప్పారు. రాష్ట్రంలో అధికారంలో కొనసాగుతున్న వారి అరాచకాలు సహించేది లేదని, అలాగే తన పార్టీ తరపున పోటీ చేసే వారిని బలి చేయాలనుకోవడం లేదని ఆయన తేల్చి చెప్పారు. ఎన్ని స్థానాలకు పోటీ చేశామన్నది కాదు. ఎన్ని స్థానాలలో నెగ్గా మన్నది ముఖ్యం. ఇద్దరు రైతులు కలిసి వ్యవసాయం చేస్తున్నప్పుడు పొలాలకు తెగులు వస్తే, తెగులును నిర్మూలించాకే పంటను పంచుకోవాలి. లేకపోతే ఆ తెగులు పంట పొలాన్ని నాశనం చేస్తుంది. రాష్ట్రానికి ఇప్పుడు తెగులు పట్టింది. రాష్ట్రానికి పట్టిన తెగులు నిర్మూలించడానికి రెండు ప్రధాన ప్రతిపక్షాలు ఏకమయ్యాయి.

కేంద్రంలో బలంగా ఉన్న పార్టీ కూడా కలిస్తే మంచిదే. కాకపోతే ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం అటు ఇటుగా ఆలోచిస్తున్నట్టు ఉంది. అయినా, ఆ పార్టీ జాతీయ నాయకత్వాన్ని ఒప్పిస్తానని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. బిజెపి లోని రాష్ట్ర నాయకులు కొందరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి కన్ఫ్యూజన్లో ఉన్నారు , కానీ పవన్ కళ్యాణ్ మాత్రం స్పష్టతతో ఉన్నారని రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు. ఒక్కొక్కరు వచ్చి తనతో దెబ్బలాడాలని జగన్మోహన్ రెడ్డి పేర్కొనడం హాస్యాస్పదంగా ఉంది. మీరందరూ కలిసి రావద్దని ఆయన చెబుతున్న తీరు అంతకంటే విడ్డూరంగా ఉంది , బ్రహ్మ రాక్షసుడిని అంతమొందించడానికి ఇద్దరు దేవతలు కలిసినట్లుగానే, రాష్ట్రంలో అరాచక పాలన తుద ముట్టించడానికి రెండు ప్రధాన ప్రతిపక్షాలు కలిశాయి. బ్రహ్మ రాక్షసుడికి దేవతలు వరం ఇచ్చినట్లుగానే, జగన్మోహన్ రెడ్డికి ప్రజలు కొన్ని వరాలను ఇచ్చారు. ప్రజలిచ్చిన వరాలను పుచ్చుకున్న జగన్మోహన్ రెడ్డి విర్రవీగుతున్నారు.

రాక్షసత్వంలో జగన్మోహన్ రెడ్డిని మించిన వారు మరొకరు లేరని తనకు తానే నిరూపించుకున్నారు. బ్రహ్మ రాక్షసుడికి వరమిచ్చిన దేవతలు కూడా విడివిడిగా అతనిపై పోరాటం చేయలేమని కలిసిపోయినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. విడివిడిగా పోటీ చేస్తే, రాష్ట్రంలో కొనసాగుతున్న అరాచక పాలనను అంతమొందించలేమన్న అనుమానం ప్రధాన ప్రతిపక్షాలకు వచ్చింది. రాష్ట్రంలోని అరాచక పాలన ను అంతమొందించాలన్న ఏకైక లక్ష్యంతో తెలుగుదేశం, జనసేన పార్టీలు రానున్న ఎన్నికల్లో పొత్తు పెట్టుకుని పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి. పొత్తులపై పవన్ కళ్యాణ్ స్పష్టతనిచ్చారో లేదో, కాపు కులం పేరుతో జగన్మోహన్ రెడ్డికి తొత్తులుగా పనిచేసే కొందరు తమ మనోభావాలు దెబ్బతిన్నాయని అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసింది జనసేన పార్టీ… కాపు సేన కాదన్నది సదరు వ్యక్తులు గుర్తించాలని రఘు రామ కృష్ణంరాజు సూచించారు. రాష్ట్రంలో గత రెండు, మూడు రోజులుగా జరిగిన సంఘటనలను చూస్తే పవన్ కళ్యాణ్ జల్సా సినిమాలోని గాలిలో తేలినట్టు ఉందే అన్న పాటలాగా మనసంతా ఆనందంతో గాలిలో తేలిపోతుందన్నారు.

జీవో నెంబర్ 1 కొట్టివేస్తారని ముందే చెప్పా…
జీవో నెంబర్ 1 పై న్యాయస్థానం తీర్పు అంటూ ఇస్తే కొట్టివేయడం ఖాయమని తాను ఎప్పటి నుంచో చెబుతూనే ఉన్నానని రఘు రామకృష్ణంరాజు గుర్తు చేశారు . ఇదే విషయాన్ని తాను పలుసార్లు రచ్చబండ కార్యక్రమంలో కూడా ప్రస్తావించానని పేర్కొన్నారు. తీర్పు ఆలస్యం చేయగలరు కానీ, తీర్పు మరొక రకంగా ఉండదని చెప్పాను . రాజ్యాంగం చదువుకున్నవారు ఎవరు కూడా జీవో నెంబర్ 1 ని సమర్ధించే అవకాశమే లేదు. జీవో నెంబర్ 1 రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కులకు పూర్తి భిన్నంగా ఉంది. ప్రజల ఓర్పును పరీక్షిస్తూ, ఐదు నెలల తర్వాత తీర్పు ఎట్టకేలకు వెలువరించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కృతజ్ఞతలు. జీవో నెంబర్ 1 ప్రజాస్వామ్యానికి, ప్రాథమిక హక్కులకు పూర్తి వ్యతిరేకం. ఈ జీవోను జారీ చేసిన వారిని న్యాయస్థానానికి పిలిచి చెప్పుతో కొట్ట లేదంతే. కానీ, న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ద్వారా చెప్పుతో కొట్టినంత పని చేశారు.

జీవో నెంబర్ 1ని న్యాయస్థానం కొట్టివేసినప్పటికీ, సాక్షి దినపత్రికలో మాత్రం చట్ట ప్రకారం మార్గదర్శకాలను రూపొందించుకోవచ్చునని వార్త కథనం రాయడం హాస్యాస్పదం. కోర్టు చేయని వ్యాఖ్యలు కూడా, చేసినట్లుగా సాక్షి దినపత్రిక వార్తా కథనం రాయడం పరిశీలిస్తే ఇదేమి జర్నలిజం అన్న అనుమానం రాక మానదు. జీవో నెంబర్ 1పై రాష్ట్ర హైకోర్టులో తీర్పు ఆలస్యం కాగా, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు త్వరగా తీర్పు వెలువరించాలని మార్గదర్శకాలు జారీ చేసిన 20 రోజుల తర్వాత రాష్ట్ర హైకోర్టు తీర్పును వెలువరించింది. న్యాయస్థానాలు ఉన్నది ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికే. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిపోతున్న తరుణంలో న్యాయస్థానాలు తీర్పును వెలువరించడం ఆలస్యం చేయడం సరికాదు. ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యం లేక అలమటిస్తున్న ప్రజలకు రాష్ట్ర హైకోర్టు తీర్పు, ఎడారిలో ఓయాసిస్ వంటిదే. న్యాయస్థానాలపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లుతున్న సమయంలో వెలువడిన ఈ తీర్పు ముదహం. జీవో నెంబర్ 1 పై రాష్ట్ర హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే… ఇటువంటి జీవోను జారీ చేసిన ప్రభుత్వాన్ని బర్తరాఫ్ చేయాలని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించే అవకాశాలు లేక పోలేదన్నది తన భావన అని రఘు రామకృష్ణంరాజు తెలియజేశారు.

ప్రజాస్వామ్యాన్ని ఇంతలా పరిహసించే చెత్త నాయకులు ఉండరు. అటువంటి నాయకుల పార్టీలో ఉన్నందుకు ఒక్కొక్కసారి తన మీద తనకే అసహ్యం వేస్తుంది. పదవి ఉన్నప్పుడే రక్షణ లేదని, తక్షకుల నుంచి రక్షణ కోసమే తాను మరి కొంతకాలం ఈ పార్టీలో ఉండాల్సి వస్తున్నందుకు బాధపడుతున్నానని తెలిపారు . ఋషికొండపై హైకోర్టు తీర్పు ఆలస్యం అవుతోంది. వేసవికాలం సెలవుల అనంతరం కూడా తీర్పును వెలువరించకపోతే, తాను సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని రఘురామకృష్ణం రాజు తెలియజేశారు.

గూగుల్ టేక్ అవుట్ ద్వారా హత్య కేసులో నిందితులు దొరికినట్టే… కస్టోడియల్ టార్చర్ కేసులోనూ దొరికిపోతారు
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు లో నిందితులు గూగుల్ టేక్ అవుట్ ద్వారా దొరికిపోయినట్లుగానే, తనని హింసించిన వారు, హింసించాలని ఆదేశాలు జారీ చేసినవారు కస్టోడియల్ టార్చర్ కేసులోనూ దొరికిపోవడం ఖాయమని రఘు రామకృష్ణంరాజు తెలియజేశారు. తనని నిర్బంధించి లాకప్ లో చిత్రహింసలకు గురిచేసిన ఘటన ఆదివారంతో రెండేళ్లు పూర్తి అవుతుంది. మిలిటరీ ఆసుపత్రి నివేదికతో పాటు, పూర్తి వైద్య నివేదికలు ఉన్నప్పటికీ తనని హింసించిన వారిపై ఇప్పటికి చర్యలు తీసుకోలేదు. కోడి కత్తి కేసు లో ఎటువంటి గాయం కాకపోయినాప్పటికీ, గాయమైనట్లుగా కుట్లు వేసిన ఇద్దరు వైద్యులకు అధికారంలోకి రాగానే ఉన్నత పదవులు కట్టబెట్టారు. అలాగే తమ పార్టీలో పని చేస్తున్న ఒక వ్యక్తి సతీమణి అయిన ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ ప్రభావతి ఇచ్చిన తప్పుడు నివేదిక ఆధారంగా గతంలో సిఐడి చీఫ్ గా పనిచేసిన సునీల్ కుమార్ కేసు తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారు.

తాను దాఖలు చేసిన కస్టోడియల్ పిటిషన్ పై ఎట్టకేలకు రాష్ట్ర హైకోర్టు స్పందించి అంబటి రాంబాబు, అప్పి రెడ్డి అనే ఇద్దరు తమ పార్టీ వ్యక్తులకు చెందిన సెల్ ఫోన్లు ఏ టవర్ రేంజ్ లో ఉన్నాయో డేటా సేకరించాలని ఆదేశించింది. అలాగే సిఐడి విభాగంలో పనిచేసిన సునీల్ నాయక్, ఉమామహేశ్వరరావు, సుబ్బారావు తోపాటు సునీల్ కుమార్ కాల్ డేటాను సేకరించాలని తన తీర్పులో పేర్కొంది. సునీల్ కుమార్ తనని చిత్రహింసలకు గురి చేసిన వీడియోను మరొక దరిద్రుడికి చూపెట్టారు. ఇంతమంది కుట్ర చేసి తన సెక్యూరిటీని దూరం పెట్టి తనని చిత్రహింసలకు గురి చేశారు. ఈ వివరాలన్నీ కలెక్ట్ చేయమని హైకోర్టు ఆదేశించింది.

జగన్ మాయ చేసి వివరాలను లేకుండా చేసిన పెద్దగా ఫరక్ పడదు. డిసెంబర్లో ప్రభుత్వం మారడం ఖాయం. తన వద్ద పూర్తి వివరాలు ఉన్నాయి. అప్రూవర్ గా మారిన వారు ఉన్నారు. కొట్టిన వారిని, ఆ వీడియో చూసి ఆనందించిన వాడిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. హైకోర్టు తీర్పు కథనం ఆంధ్రజ్యోతి ఛానల్ యూట్యూబ్ లో పెడితే మూడు లక్షల మంది వీక్షించారు. రెండు ప్రముఖ దినపత్రికలో మెయిన్ ఎడిషన్ లో ప్రచురించిన వార్త, సాక్షి దినపత్రికలో అక్షరం ముక్క కూడా రాయలేదంటే, వారు చలి జ్వరంతో వణికి పోతున్నారని అర్థమవుతుంది.

రెండు ప్రముఖ దినపత్రికలు రాశాయి… సాక్షి దినపత్రిక రాయలేదని ఈ పని ఎవరు చేయించారోననేది తెలిసిపోయింది, తాము చేసిన పనికి వారు అడ్డంగా దొరికిపోయారని రఘురామకృష్ణం రాజు అన్నారు. కావలిలో చెట్లు కొట్టి వేయడాన్ని నిరసిస్తూ బిజెపి కార్యకర్తలు ఆందోళన నిర్వహించగా, ఒక బీజేపీ కార్యకర్తను హింసించిన తీరుపై తాను బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు లేఖ రాయనున్నట్టు తెలిపారు. ఇన్నాళ్లు తమపై పడినవారు, ఇప్పుడు బిజెపి కార్యకర్తల పై కూడా పడ్డారు. నిజంగా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలనుకునే కార్యకర్తలకు మీరే అండగా నిలువాలని ఆయన్ని కోరుతానని రఘురామకృష్ణం రాజు చెప్పారు.

జగన్మోహన్ రెడ్డి ని చేరదీశారన్న అపోహనే బిజెపి కొంప ముంచింది
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ఓటమికి కారణం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఆ పార్టీ నాయకత్వం చేరదీసిందని ప్రజల్లో నెలకొన్న అపోహనే కారణమని రఘురామకృష్ణం రాజు వెల్లడించారు. ప్రజల్లో నెలకొన్న ఈ అపోహను దూరం చేసుకోకపోతే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోను మూల్యం బిజెపి నాయకత్వం చెల్లించుకోవలసి వస్తుంది. తెలంగాణలోనూ 20నుంచి 25 శాతం మంది ఆంధ్ర ప్రాంత ప్రజలు ఉంటారు. ఆంధ్ర, రాయలసీమ ప్రజలకు ఎప్పటినుంచో తెలంగాణ ప్రాంత ప్రజలతో బంధుత్వాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి ఇంతటి ఘన విజయాన్ని చేకూర్చిన జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీ రుణపడి ఉండాలి. కర్ణాటకలో ఎక్కడైతే తెలుగు ప్రజలు ఉన్నారో అక్కడ బిజెపి ఓటమిపాలయ్యింది. కోస్టల్ కర్ణాటక మినహా, మిగతా ప్రాంతాలలో తెలుగువారు ఉన్నారు. బిజెపి ఇంత దారుణంగా ఓడిపోవడానికి తెలుగు వారి కోపమే కారణం. ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం చేస్తూ, ఆర్థిక విధ్వంసానికి పాల్పడిన జగన్మోహన్ రెడ్డిని బిజెపి నాయకత్వం తెలిసో తెలియకో చేరదీస్తోందన్న అపోహ వల్లే బిజెపికి వారంతా వ్యతిరేకంగా ఓటు వేశారు.

రాష్ట్రంలో విధ్వంసం, దోపిడి, అరాచకాలకు పాల్పడుతూ, తన కుటుంబ సభ్యుడి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ జగన్మోహన్ రెడ్డి దర్జాగా తిరగగలుగుతున్నారంటే బిజెపి చలువ వల్లేనని సాధారణ ప్రజలు అనుకుంటున్నారు. ఈ విషయములో బిజెపికి సంబంధం లేదని తాను విశ్వసిస్తాను. కానీ సాధారణ ప్రజలు నమ్మడం లేదు. ప్రజల్లోని సందేహాలను నివృత్తి చేసుకొని, దుష్టుడికి దూరంగా ఉండాలన్న విషయాన్ని ఇప్పటికైనా బిజెపి నాయకత్వం గుర్తిస్తే మంచిదని రఘు రామకృష్ణంరాజు సూచించారు.

LEAVE A RESPONSE