Suryaa.co.in

Andhra Pradesh

వచ్చే అంబేడ్కర్ జయంతి నాటికి విజయవాడలో ఆయన నిలువెత్తు విగ్రహం

– దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటా అన్న చంద్రబాబు.. దళితులను తలెత్తుకునేలా చేస్తాడా..!?
– రాజ్యాంగ వ్యవస్థల్ని నిర్వీర్యం చేసిన బాబుకు అంబేడ్కర్ పేరెత్తే అర్హతే లేదు
– చంద్రబాబు పాలనలో దళితులపై అతిపెద్ద దాడి జరిగింది.. దళితులకు ప్రధాన శత్రువు చంద్రబాబే.
– జగనన్న పరిపాలనలో దళితులకు అన్నింటా అగ్రతాంబూలం
– అంబేడ్కరిజాన్ని గుండెల నిండా నింపుకుని రాష్ట్రంలో సామాజిక విప్లవానికి బాటలు వేస్తున్న ముఖ్యమంత్రి జగన్ గారు
– రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున

వచ్చే అంబేడ్కర్ జయంతి నాటికి ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డున ఉన్న విజయవాడలో బాబా సాహెబ్ అంబేడ్కర్ నిలువెత్తు విగ్రహాన్ని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, ఈ విషయాన్ని ఛాలెంజ్ చేసి మరీ ప్రతిపక్షాలకు చెబుతున్నామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున తెలిపారు.

తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అంబేడ్కర్ విగ్రహం, స్మృతివనం అంటూ 5 ఏళ్ళు కాలయాపన చేసి, ఆఖరికి పిచ్చి మొక్కలకు ఆలవాలంగా మార్చిన టీడీపీ నేతలు మా ప్రభుత్వంపై విమర్శలు చేయడం సిగ్గుచేటు అని అన్నారు. కోట్ల రూపాయల విలువ చేసే అత్యంత ఖరీదైన స్థలంలో, విజయవాడ నడిబొడ్డున రాష్ట్ర ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా అంబేడ్కర్ విగ్రహాన్ని, స్మృతివనాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.

మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే…
5 ఏళ్ళు అధికారంలో ఉండి అంబేడ్కర్ విగ్రహాన్ని బాబు ఎక్కడ పెట్టారు?
అంబేద్కర్‌ విగ్రహం గురించి మాట్లాడుతున్నారే? చంద్రబాబు నాయుడు అయిదేళ్ల కాలంలో అంబేద్కర్‌ విగ్రహాన్ని ఎక్కడ పెట్టారని అడుగుతున్నాం. ఎక్కడో మారుమూల పిచ్చి మొక్కలు పెరిగే ప్రాంతంలో, వరదలు వస్తే మొట్ట మొదట మునిగిపోయే ప్రాంతంలో పెడతానని వాగ్దానాలు చేసి 5 ఏళ్ళు కాలయాపన చేసి అధికారం నుంచి దిగిపోయాడు.

మేం ప్రతిపక్షంలో ఉండి, వైయస్సార్‌ సీపీ ఎస్సీ విభాగానికి అధ్యక్షుడు హోదాలో, అంబేద్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేసే ప్రాంతాన్ని చూడటానికి వెళితే, నన్ను ముప్పతిప్పలు పెట్టి అరెస్ట్‌ చేశారు. మీరు విగ్రహాన్ని పెట్టలేకపోవడం వల్లే కదా నన్ను ఆరోజు అరెస్ట్‌ చేసింది. మీరు ఆప్రాంతంలో ఏమీ చేయకపోవడం వల్లే కదా అంతగా భయపడిది.?

మా ముఖ్యమంత్రి జగన్ ని మేము ఎవరూ కూడా అంబేద్కర్‌ విగ్రహం పెట్టమని అడగలేదు. అయినా ఆయన ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డున, విజయవాడలో, కోట్ల రూపాయలు విలువ చేసే ప్రాంతంలో అంబేడ్కర్ నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. వచ్చే అంబేద్కర్‌ జయంతి నాటికి విజయవాడలో మా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డితో ప్రారంభించబోతున్నాం. ప్రతిపక్షాలకు, చంద్రబాబుకు ఛాలెంజ్‌ చేసి మరీ చెబుతున్నాం.

ముఖ్యమంత్రి జగన్ ఇవాళ కూడా అంబేద్కర్‌ గారి విగ్రహం ఏర్పాటు పనులు గురించి ప్రభుత్వాధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులు వేగవంతంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్ర మంత్రులుగా నాతోపాటు విశ్వరూప్, ఆదిమూలపు సురేష్, జోగి రమేష్, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్… మేమంతా విజయవాడ వెళ్ళి పరిశీలించాం. అలాంటిది అంబేడ్కర్ గారి విగ్రహం గురించి టీడీపీలో చంద్రబాబు మొరగమన్నట్టు అల్లా మొరిగే కొంతమంది చెంచాలు, డూడూ బసవన్నలను పెట్టుకుని, మరోవైపు ఎల్లో మీడియాను అడ్డు పెట్టుకుని ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారంటే మీకు కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేదని అర్థమవుతుంది.

మీకు అయిదేళ్లు అధికారం ఇస్తేనే దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్నారు… పొరపాటునైనా మరోసారి ఇస్తే దళితులను ఎవరు బతకమన్నారం అని అంటారు. సొంత మామ చావుకే కారణమై, ఈరోజు ఆయన ఫోటోలకే దండలు వేస్తున్న చంద్రబాబు ఏమైనా చేస్తాడు. మీరు ఎన్ని కుయుక్తులు పన్నినా దళితులు మిమ్మల్ని నమ్మరు. రాష్ట్రంలో సుపరిపాలనతోపాటు, బడుగుబలహీన వర్గాలను సమాజంలో తలెత్తుకుని తిరిగేలా, రాజకీయ అవకాశాలు కల్పించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్‌గారు.

సామాజిక విప్లవానికి బాటలు…
ప్రపంచ మేధావి, భారత జాతి గర్వించదగ్గ ముద్దుబిడ్డ, భారతదేశానికి రాజ్యాంగ స్మృతులను అందించినటువంటి మహా మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తోంది. ఐక్యరాజ్య సమితితోపాటు ప్రపంచ దేశాల్లో అంబేడ్కర్‌ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. అలాంటి మహనీయుడి ఆలోచనలు, ఆయన ఆశయాలను ఈ రాష్ట్రంలో అమలు చేయాలనే ఆలోచనతో పనిచేస్తున్న గౌరవనీయ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి దళితులుగా మేమంతా రుణపడి ఉంటాం.

తెలుగుదేశం హయాంలో దళితులకు సముచిత స్థానం ఇవ్వని పరిస్థితులను చూశాం, దళితులపై దాడులు చేయించి, దళిత చట్టాలను అపహాస్యం చేసిన పరిస్థితులు కోకొల్లలు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చట్టాలను తమ చుట్టాలుగా చేసుకున్నారు. దళిత మహిళల మీద దాడులు, అఘాయిత్యాలు, అమానుషాలు, చివరికి దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అని స్వయంగా అప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు మాట్లాడటంతో ఈ రాష్ట్రంలో ఉన్న యావత్తు దళిత లోకం నివ్వెరపోయింది. అటువంటి చంద్రబాబు దళితులను తలెత్తుకునేలా చేస్తాడని ఆ పార్టీ నేతలు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు ఉంది.

ఇవాళ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో దళితులకు, బలహీనవర్గాలకు మేలు చేసేవిధంగా పరిపాలన సాగుతోంది. దళిత సంక్షేమానికి, అంబేడ్కర్‌ గారి ఆలోచనా విధానానికి పెద్దపీట వేస్తూ, బాబూ జగ్జీవన్‌రామ్‌గారి విధానాలను భుజాన వేసుకుని, జ్యోతిరావుపూలే, సాహు మహరాజ్‌, పెరియార్‌ రామస్వామి గారి ఆలోచనలు రంగరించి.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఇవాళ రాష్ట్రంలో సామాజిక విప్లవానికి బాటలు వేస్తున్నారు.

నీతిమాలిన చర్య
ఈ రాష్ట్రంలో కళ్లులేని కబోదిలా ఉన్న అర్హతలేని ప్రతిపక్షం దళితుల్లోని కొంతమంది పెయిడ్‌ ఆర్టిస్టులను పెట్టుకుని అభూత కల్పనలు, ఆశ్రిత పక్షపాతంతో ముఖ్యమంత్రిగారిని నోటికొచ్చినట్లు మాట్లాడటాన్ని ఓ నీతిమాలిన చర్యగా భావిస్తున్నాం. తెలుగుదేశం పార్టీలో ఉన్న నా దళిత సోదరులను అడుగుతున్నాను… మనందరిదీ ఒకే రక్తం. కానీ మీకు సిగ్గు ఎటూలేదు. వర్ల రామయ్య, నక్కా ఆనంద్‌బాబు, బలహీనవర్గాల మంత్రులుగా పనిచేసిన అచ్చెన్నాయుడు తదితరులంతా మాట్లాడుతున్నారు. మీరు నిజంగా చీము, రక్తం ఉన్న రాజకీయ నాయకులే, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఇంత తపనపడుతూ, దేశచరిత్రలోనే ఎక్కడా లేని గొప్ప సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న జగన్‌ మోహన్‌ రెడ్డిని పల్లెత్తి మాట మాట్లాడటానికి కూడా మీకు అర్హత లేదని చెబుతున్నాం.

అప్పుడు మీ రక్తం మరగలేదా..?
టీడీపీవాళ్లకు అంబేద్కర్‌ జయంతి, వర్థంతి రోజే అంబేద్కర్‌ గారు గుర్తుకు వస్తారు. అప్పుడు మాత్రమే వాళ్లకు సామాజిక న్యాయం గుర్తుకు వస్తుంది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రం, దళితులను తొక్కి నార తీస్తారు. మీరు మనుషులే అయితే దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అని చంద్రబాబు అన్నప్పుడు… మీ చీము, నెత్తురు ఏమయ్యాయి, అప్పుడు మీ రక్తం మరగలేదా అని వర్ల రామయ్య, తదితర టీడీపీ దళిత నాయకులను సూటిగా ప్రశ్నిస్తున్నాం.

వర్ల రామయ్యా.. నీవు అసలు మనిషివేనా?. చంద్రబాబు అదిగో పదవి.. ఇదిగో పదవి అని మూడుసార్లు ఆశ పెట్టి.. మొండి చెయ్యి ఇస్తే.. ఏడ్చావే…!. అటువంటి నువ్వు చంద్రబాబుకు భజన చేయడానికి, కీర్తించడానికి నీకు నోరు ఎలా వస్తుంది. నీవు అసలు దళితుడివేనా అని అడుగుతున్నాను. నీకు దళిత భావజాలం ఉందా?. చంద్రబాబు హయాంలో అంబేద్కర్‌ విగ్రహాన్ని పెట్టనివ్వలేదు. దళితులపై నిత్యం దాడులు, అఘాయిత్యాలు జరిగాయి, దళిత మహిళలను వివస్త్రలను చేస్తే మీరు మాట్లాడలేదు. అప్పుడు మీ పౌరుషం ఏమైపోయింది, ఎందుకు నోరు తెరిచి మాట్లాడలేకపోయారు మీరు?. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ పేదల పెన్నిధిగా, అంబేద్కర్‌ ఆలోచనా విధానంతో గొప్ప గొప్ప సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ, దళితులు తలెత్తుకుని తిరగేలా పరిపాలన చేస్తున్నది మీ కళ్లకు కనిపించడ లేదా..?

రాజ్యాంగ వ్యవస్థలను నాశనం చేసి అంబేడ్కర్ కు దండలేస్తారా..?
ఎన్టీఆర్‌ చావుకు కారణమై.. ఆయన ఫోటోకు దండే వేసే సంస్కృతి చంద్రబాబు నాయుడుది. అలానే రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలను చంద్రబాబు నాయుడు నాశనం చేసి, సామాజిక న్యాయానికి పాతర వేసిన రోజుల్లో అంబేడ్కర్ గారు గుర్తుకు రాలేదా అని అడుగుతున్నాం. అటువంటి మీరు, ఈరోజు అంబేద్కర్‌గారి ఫోటోకి దండలు వేసి, స్వీట్లు పంచి లెక్చర్లు దంచుతారా? అంబేద్కర్‌ గారిని, ఆయన రాసిన రాజ్యాంగాన్ని అడుగడుగునా అపహాస్యం చేసి, అవమానం చేసి, ఆయన గురించి మరోవైపు ఎలా మాట్లాడతారని వర్ల రామయ్య, నక్కా ఆనంద్‌, వంగలపూడి అనిత కావచ్చు… వాళ్లందరినీ అడుగుతున్నాం. చంద్రబాబు పంచన చేరి ఊడిగం చేయవద్దని వారికి చెబుతున్నాం.

బాబు హయాంలో దళితులపై అతి పెద్ద దాడి జరిగింది
చంద్రబాబు హయాంలో దళిత జాతిపై అతిపెద్ద దాడి జరిగింది. అలాంటి చంద్రబాబుకి వత్తాసుగా దళిత సోదరులు మాట్లాడటం ఎంతవరకు కరెక్టు… ? దళిత జాతికి అతిపెద్ద శత్రువు చంద్రబాబు. అలాంటి వ్యక్తి దగ్గర చప్రాసీ ఉద్యోగం చేయవద్దని హితవు పలుకుతున్నాం.

దళిత జాతికి ప్రశ్నించే హక్కు అంబేద్కర్‌ గారు కల్పిస్తే… చంద్రబాబు కల్పించారని చెప్పే మూర్ఖులు మీరు. ఈ రాష్ట్రంలో జగన్‌ మోహన్‌ రెడ్డి పరిపాలన చూసి బెంబేలుఎత్తుతున్నారు. అంబేడ్కరిజాన్ని గుండెల నిండా నింపుకుని జగన్‌ పరిపాలన చేస్తున్నారు. కుల, మత, రాజకీయాలకు అతీతంగా నవరత్నాల ద్వారా ప్రతి పేదవాడి తలుపుతుడుతుంటే ఓర్వలేక మీరు జగన్‌గారి మీద అభూతకల్పనలు మాట్లాడం సరికాదు.

అంబేద్కర్‌గారిని గుండెల్లో నింపుకుని ఈ రాష్ట్రంలో జగన్‌ గారు సామాజిక విప్లవానికి తెరతీస్తే… దళితులను అడుగడుగునా అణిచివేసిన ముఖ్యమంత్రిగా, చరిత్ర హీనుడుగా చంద్రబాబు నాయుడు ఎప్పటికీ మిగిలిపోతారు.

వర్ల రామయ్య ఆలోచన లేని హీనుడు. ఎవరో దళిత మంత్రి సోదరుడిని లిఫ్ట్‌ ఎక్కనివ్వలేదని, అవమానించారని ఏవేవో మాటలు మాట్లాడుతున్నాడు. కనీస ఇంగిత జ్ఞానం లేకుండా దళిత మంత్రి లిఫ్ట్ ఎక్కితే.. ఆయన దళితుడు కాదు, ఆయన సోదరుడు మాత్రమే దళితుడా.. ఏం మాట్లాడుతున్నావో నీకు అయినా అర్థమవుతుందా వర్ల రామయ్యా.. ?.

రాష్ట్రంలో కనీవినీ ఎరుగని సంక్షేమాన్ని బహుజనులకు అందిస్తున్నాం. జగనన్న పాలనలో దళితులకు అన్నింటా అగ్రతాంబూలం దక్కుతోంది. ఎవరి పాలనలో దళితుల సంక్షేమం, అభివృద్ధి జరిగిందో చర్చకు రావాలని ఎన్నోసార్లు అడిగాం. ఎన్నడైనా వచ్చారా?

చర్చించే దమ్ముందా..?
చంద్రబాబు వర్సెస్‌ రాజశేఖర్‌ రెడ్డి , చంద్రబాబు వర్సెస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పరిపాలనపై చర్చకు వస్తారా? అవినీతి, ఆశ్రితపక్షపాతంలో, దళితులను అవమానించిన అంశాలో చంద్రబాబు ముందువరసలో ఉంటారు. దళితులకు సంక్షేమం, అభివృద్ధితోపాటు అండగా ఉండే విషయంలో వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి, జగన్‌ మోహన్‌ రెడ్డి ముందు వరుసలో ఉంటారు. రాజశేఖర్‌ రెడ్డి కుటుంబం మాతో వియ్యమొందిన కుటుంబం. రక్తసంబధీకులైన జగన్‌ కుటుంబాన్ని నెత్తిన వేసుకుని మోయాల్సిన బాధ్యత దళిత సోదరులుగా మాకుంది.

పెయిడ్‌ ఆర్టిస్ట్‌లకు జగన్‌ గురించి మాట్లాడే అర్హత లేదని స్పష్టం చేస్తున్నాం. జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఎలాంటి సామాజిక న్యాయం జరిగిందో మీకు తెలియదా అని ప్రశ్నిస్తున్నాం? ఎక్కడ చర్చకు వస్తారు? చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దళితులకు ఎంతమందికి మంత్రి పదవులు ఇచ్చారు. ఎంతమంది గిరిజనులు, మైనార్టీలకు, మహిళలకు పదవులు ఇచ్చారు, ఏ పోర్ట్‌పోలియోలు ఇచ్చారో చర్చించేందుకు మీరు సిద్ధమా అని సూటిగా ప్రశ్నిస్తున్నాం.

మా ముఖ్యమంత్రి జగన్ సామాజిక న్యాయానికి పెద్ద పీట వేశారు. కేబినెట్ లోనూ దళితులకు అగ్ర తాంబులం, ఉప ముఖ్యమంత్రులు, బ్రహ్మాండమైన పోర్ట్‌పోలియోలు కట్టబెట్టారు. అంబేద్కర్‌ జయంతి రోజు ఏమీ తెలియనివాళ్లను తీసుకు వచ్చి జగన్‌ని తిట్టిస్తారా?. అంబేద్కర్‌గారి గురించి మాట్లాడే అర్హత అసలు మీకు ఎక్కడుంది? అంబేద్కర్‌ ఆశయాలను చంద్రబాబు అపహాస్యం చేయలేదా? రాజశేఖర్‌ రెడ్డిగారు అధికారంలోకి వచ్చాక ఏం జరిగిందో తెలియదా? చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఏం జరిగిందో తెలియదా?

సామాజిక సమన్యాయం కోసం చివరికి ఈ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్లను వేర్వేరు చేసిన చరిత్ర మా ముఖ్యమంత్రి కే ఉంది. ఎస్సీలకు, ఎస్టీలకు ఒక కమిషన్‌, కార్పోరేషన్‌ను మాల, మాదిగ, రెల్లి కార్పొరేషన్‌లుగా ఏర్పాటు చేసింది జగన్‌ మోహన్‌ రెడ్డి.

అభివృద్ధి, సంక్షేమం విషయంలో చర్చించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. మా దళితులకు సామాజిక న్యాయం, సామాజిక సంక్షేమం ఎలా జరిగిందో చర్చించుకునేందుకు రావాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా సవాల్‌ చేస్తున్నా.

విలేకర్ల సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మెన్ కొమ్మూరి కనకారావు, రెల్లి కార్పొరేషన్ ఛైర్మన్ వడ్డాది మధుసూదన్ రావు, పార్టీ ఎస్సీ సెల్ అనంతపురం జిల్లా MVP ఓబులేష్, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ మందపాటి శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE