– తెలంగాణ మహిళలను సీఎం ఘోరంగా అవమానించారు
– చిలుక పచ్చ చీరలతో మహిళలు చిలుకల్లా కనిపిస్తారని సీఎం అనడం మహిళలను అవమానించడమే
– అబద్దాలు మాట్లాడటానికి రేవంత్ రెడ్డి కి సిగ్గు అనిపించడం లేదా ?
– 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామని సీఎం నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా
– తన మనువడి అక్షరాభ్యాసం కోసం బాసర వచ్చి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారు
– ఆదిలాబాద్ ఇండస్ట్రియల్ పార్క్ పేరిట స్థానిక బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ భూ దోపిడీ
– ఆయనకు సీఎం సహకరిస్తున్నారు
– మాజీ మంత్రి జోగు రామన్న
హైదరాబాద్: ఆదిలాబాద్ ను సీఎం మరోసారి నయవంచన చేశారు. ఎన్నికలప్పుడు ఆదిలాబాద్ ను దత్తత తీసుంటానని చెప్పి మాట తప్పారు. ఈ రెండేళ్ల లో ఆదిలాబాద్ కు చేసిన పని ఒక్కటీ లేదు. కేవలం శంఖుస్థాపనలకే పరిమితమయ్యారు. హౌజ్ అరెస్టులు లేవని ప్రజాస్వామ్య విలువలను పాటిస్తున్నామని నిన్న సీఎం పచ్చి అబద్దం చెప్పారు. నన్ను ఏన్నో సార్లు హౌజ్ అరెస్టు చేశారు. హరీష్ రావు ఈ రోజు పరిగి వెళ్తుంటే ఈ రోజు ఎందుకు అరెస్టు చేశారు?
సీఎం హోదా లో ఉండి ఇంత పచ్చిగా అబద్దాలు మాట్లాడటానికి రేవంత్ రెడ్డి కి సిగ్గు అనిపించడం లేదా ? నిన్న సభ పెట్టిన పిప్రి గ్రామం లో ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్లు 17 మాత్రమే .అందులో పూర్తయినవి 3 మాత్రమే. ఆదిలాబాద్ జిల్లాలో 11 వేల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయితే పూర్తయినవి 550 మాత్రమే. సీఎం, డిప్యూటీ సీఎం నాతో చర్చకు వస్తారా ? ఇది అభివృద్ధి ఎలా అవుతుంది?
రోడ్లకు శంఖుస్థాపనలు తప్ప పూర్తయ్యింది లేదు. ఆదిలాబాద్ లో 50 కోట్లతో ఐటీ హబ్ నిర్మిస్తే దాన్ని ప్రారంభించడం లేదు. కేసీఆర్ హయం లో 3 మెడికల్ కాలేజీ లు ఆదిలాబాద్ కు తెచ్చాము. అగ్రికల్చర్ బీ ఎస్సీ కళాశాలను నిర్లక్ష్యం చేశారు. ఇచ్చిన హామీలను పక్కన పెట్టారు. ఆదిలాబాద్ లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులు ఎందుకు మొదలు పెట్టలేదు? దళిత ,గిరిజనులకు మీరు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి ? కేసీఆర్ హయం లో వచ్చిన గురుకులాలను నిర్లక్ష్యం చేస్తున్నారు.
మెస్సి తో ఫుట్ బాల్ మ్యాచ్ ఆడటానికి సింగరేణి నుంచి 100 కోట్ల రూపాయలను సీఎం దారి మళ్లించారు. 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామని సీఎం నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా ? ఏ కాంగ్రెస్ నేత నాతో చర్చకు వస్తారో రండి.
ఆరు గ్యారంటీల్లో 99 శాతం అమలు అవుతున్నాయని భట్టి పచ్చి అబద్దం చెప్పారు. అప్పుల గురించి అబద్దాలు మాట్లాడుతున్నారు. తెలంగాణ మహిళలను సీఎం ఘోరంగా అవమానించారు. మూడు నెలలకే పిల్లలు పుడతారా అని సీఎం అనొచ్చా? కాంగ్రెస్ అధికారం లోకి వచ్చి 27 నెలలు అవుతుంది. నువ్వు చెప్పిన సమయం కూడా అయిపోయింది కదా ? ఇంత నిస్సిగ్గుగా సీఎం నోటి నుంచి అబద్దాలా?
చిలుక పచ్చ చీరలతో మహిళలు చిలుకల్లా కనిపిస్తారని సీఎం అనడం మహిళలను అవమానించడమే. సీఎం తన మనువడి అక్షరాభ్యాసం కోసం బాసర వచ్చి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారు. బాసర ఇపుడే గుర్తొచ్చిందా ? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కేసీఆర్ టైమ్ లోనే అన్నింటా అభివృద్ధి జరిగింది. చనకా కొరటా ప్రాజెక్టు ,ఇతర పెండింగ్ ప్రాజెక్టుల గురించి సీఎం మాట్లాడలేదు. పాత ప్రాజెక్టు ల ప్రస్తావన లేదు కానీ ఏవో లిఫ్ట్ ల గురించి మాట్లాడ లేదు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కనీస సౌకర్యాలు లేవు.
కేరళ సీఎం కు రేవంత్ ఓ లేఖ రాశారు. కేరళ లో గతంలో యూడీఎఫ్ ప్రభుత్వం అభివృద్ధి గురించి రేవంత్ ఆ లేఖలో ప్రస్తావించారు. మరి తెలంగాణ కు ఆ సూత్రం వర్తించదా ? కేసీఆర్ హయం లో పదేళ్లలో జరిగిన అభివృద్ధి గురించి రేవంత్ చెప్పరా ? రేవంత్ రెడ్డి ఏం చేయకున్నా దైర్యంగా అబద్దాలను చెబుతూ తనకంటే మోసగాడు మరెవ్వరూ లేరని నిరూపించుకుంటున్నారు. ఆదిలాబాద్ ఎయిర్ పోర్టు గురించి కూడా సీఎం అబద్దాలు చెబుతున్నారు.
కాంగ్రెస్ బీజేపీ నేతలు కలిసి ఎయిర్ పోర్టు పై ఆదిలాబాద్ ప్రజలను మోసం చేస్తున్నారు. ఆదిలాబాద్ ఇండస్ట్రియల్ పార్క్ పేరిట స్థానిక బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ భూ దోపిడీ చేస్తున్నారు. ఆయనకు సీఎం సహకరిస్తున్నారు. ప్రెస్ మీట్ లో బీ ఆర్ ఎస్ నేతలు జాన్సన్ నాయక్, లోక బాపు రెడ్డి , కె .కిషోర్ గౌడ్ పాల్గొన్నారు.