Suryaa.co.in

Andhra Pradesh

పులివెందులలోనూ నెగ్గగలమా? వై నాట్ 175 అని అంటున్న పాలకులకు డౌట్

పది నెలల క్రితం నమోదు చేసిన కేసులో సెక్షన్లు మార్చి బీటెక్ రవి ని అరెస్టు చేసిన పోలీసులు
పది నెలలుగా బీటెక్ రవి తప్పించుకు తిరుగుతున్నాడని చెప్పడం కంటే దిగజారుడుతనం మరొకటి ఉండదు
స్కిల్ కేసులో ఇప్పటికే అందరికీ బెయిల్ మంజూరు
క్యాబినెట్ ఆమోదంతో స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ ను అమలు చేసిన మాజీ ముఖ్యమంత్రిని నిర్బంధించాల్సిన అవసరం లేదు
హీరో కృష్ణ స్ఫూర్తితో రాష్ట్రంలో బయోత్పాత వాతావరణాన్ని సృష్టించాలని చూస్తున్న కుహనా రాజకీయ నాయకుల పై డేరింగ్ అండ్ డాషింగ్ గా ప్రజలంతా పోరాడాలి
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు

తెదేపా నేత బీటెక్ రవీంద్రనాథ్ రెడ్డి ని అరెస్టు చేసి, పులివెందులలో భయానక వాతావరణంలో సృష్టించాలని పాలకులు భావించినట్లు స్పష్టం అవుతోందని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రఘురామకృష్ణం రాజు అన్నారు. దీన్నిబట్టి చూస్తే, పులివెందులలో కూడా నెగ్గగలమా అనే అనుమానం వై నాట్ 175 అని చెప్పుకు తిరిగే పాలకుల్లో కనిపిస్తోందన్నారు. బుధవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు మీడియా తో మాట్లాడుతూ… జైలులో , కోర్టుకు తరలించే సమయంలో బీటెక్ రవీంద్రనాథ్ రెడ్డికి ఏమైనా హాని జరిగితే, దానికి పులివెందుల ఎమ్మెల్యే, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని వైకాపా తరఫున, ప్రజల తరఫున హెచ్చరిస్తున్నానని అన్నారు.

ఈ ఏడాది జనవరి మాసంలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కడప జిల్లా పర్యటన సందర్భంగా ఒక ఏ ఎస్ ఐ కి వాహనం టైరు రాసుకు పోయింది. ఈ ప్రమాదంలో ఆయనకు ఎటువంటి గాయాలు కాలేదు. అయినా, బీటెక్ రవీంద్రనాథ్ రెడ్డి ఐపిసి 324 కింద కేసు నమోదు చేశారు. ఐపిసి 324 సెక్షన్ కింద నిందితుడిగా తేలితే మూడేళ్ల జైలు శిక్ష పడుతుంది. ఈ కేసులో కోర్టు ద్వారా బెయిల్ పొందవచ్చు. ఎలాగైనా బీటెక్ రవి పై పదేళ్ల శిక్షార్హమైన కేసును నమోదు చేయాలని భావించిన పోలీసులు సెక్షన్ మార్చారు. ఐపిసి 333 కింద కేసు నమోదు చేశారు.

విధుల్లో ఉన్న పోలీసు అధికారిపై దాడి చేస్తే, ఆ అధికారికి తీవ్ర గాయాలయితే దాడి చేసిన వారిపై ఐపీసీ 333 సెక్షన్ ను మోపుతారు. మంగళవారం నాడు పులివెందుల నుంచి కడప వైపు వెళ్తున్న బీటెక్ రవిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండు గంటల వరకు ఆయన్ని ఎవరు అరెస్టు చేశారో చెప్పలేదు. చివరకు వల్లూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో బీటెక్ రవిని అరెస్టు చేసినట్లుగా పోలీసులు తెలిపారు. ఒకవేళ బీటెక్ రవిని క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో అరెస్టు చేస్తే, బెట్టింగ్ ఆడుతుండగా అరెస్టు చేయాలి కానీ రోడ్డుపైన వాహనంలో వెళుతున్న వ్యక్తిని ఎలా అరెస్టు చేస్తారని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు.

రాత్రి రెండు గంటల సమయంలో గతంలో పులివెందులలో పనిచేసి, ప్రస్తుతం పోరుమామిళ్ల అనే ప్రాంతంలో సీఐ గా పని చేస్తున్న మల్లికార్జున అనే పోలీసు అధికారి బీటెక్ రవి పై కేసు నమోదు చేశారు… క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో అరెస్ట్ చేసిన బీటెక్ రవి పై పది నెలల క్రితం నమోదు చేసిన కేసులో ఆయన తప్పించుకు తిరుగుతున్నారని పోలీసులు చెప్పడంసిగ్గుచేటు. మంగళవారం నాడు కూడా తప్పించుకుని వెళ్తుంటే, తమకు దొరికారని పోలీసులు చెప్పడం చూస్తుంటే జనాలు అంత వెర్రి వెంగళప్పల్లా కనిపిస్తున్నారా? అని రఘు రామకృష్ణం రాజు మండిపడ్డారు. గత పది నెలల వ్యవధిలో ప్రస్తుత ఎస్పీని, ఇక్కడ నుంచి బదిలీ అయి వెళ్లిన ఎస్పీని బీటెక్ రవి ఎన్నిసార్లు కలిశారో రికార్డులను తనిఖీ చేయాలని సూచించారు.

పులివెందులలో అద్భుతమైన తెదేపా కార్యాలయాన్ని బీటెక్ రవి పర్యవేక్షణలో నిర్మించారు. తెదేపా కార్యాలయ ప్రారంభోత్సవ సందర్భంగా వైకాపాకు చెందిన ఓ 40 మంది నాయకులు తెదేపాలో చేరారు. పులివెందులలో వైకాపాకు కూడా లేనంత బ్రహ్మాండమైన కార్యాలయాన్ని తెదేపా కోసం బీటెక్ రవి పర్యవేక్షణలో నిర్మించడంతో, పులివెందుల పర్యటనకు వెళ్ళిన జగన్మోహన్ రెడ్డికి ఆ కార్యాలయ భవనాన్ని చూసి తన అక్కసు ను వెళ్లగక్కినట్లు తెలిసింది.

ప్రధాన రహదారిలో ఇంత పెద్ద భవంతుని ఎలా నిర్మించ నిచ్చారంటూ జగన్మోహన్ రెడ్డి వై కాపా నేతలతో అన్నట్లు తెలిసింది. పులివెందులకు జగన్మోహన్ రెడ్డి వెళ్లడం… వెంటనే బీటెక్ రవిపై పోలీసులు కేసులను నమోదు చేయడం ప్రారంభమయ్యింది. పది నెలలుగా పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నారన్న బీటెక్ రవి, తెదేపా కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. అప్పుడు పోలీసులు కళ్ళు మూసుకున్నారా? అని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు.

బీటెక్ రవిని అరెస్టు చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచినప్పుడు పది నుంచి 11 నెలల క్రితం జరిగిన సంఘటన కు సంబంధించిన కేసులో ఇలా అర్ధరాత్రి హడావిడిగా తీసుకురావడం ఏమిటని ప్రశ్నించినట్లు తెలిసింది. కొల్లూరు పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లి ఉదయాన్నే కోర్టులో హాజరుపరచాలని ఆయన పోలీసులను ఆదేశించారు. అక్కడ నుంచి
బీటెక్ రవిని వల్లూరు పోలీస్ స్టేషన్ కు తరలిస్తుండగా, అప్పటికే మెజిస్ట్రేట్ తో పోలీసులు ఏమి మాట్లాడారో తెలియదు కానీ… మార్గమధ్యలోనే ఆయన్ని బ్రతిమాలి పోలీసులు 41 A నోటీసు అందజేసి, మళ్లీ మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. మెజిస్ట్రేట్, బీటెక్ రవికి 14 రోజుల రిమాండ్ ఇదించారు. బీటెక్ రవి తరుపున రేపు న్యాయస్థానంలో బెయిల్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఇది తప్పుడు కేసు అని స్పష్టం అవుతుంది.

ఈ కేసులో కచ్చితంగా ఆయనకు బెయిల్ లభిస్తుంది. ఒకవేళ కడప జిల్లా న్యాయస్థానంలో బెయిల్ లభించకపోయినప్పటికీ, హైకోర్టులో మాత్రం ఆయనకు కచ్చితంగా బెయిలు లభించడం ఖాయమని రఘురామ కృష్ణంరాజు అన్నారు. బీటెక్ రవి ఎక్కడ కూడా విధి నిర్వహణలో ఉన్న పోలీసు పై దాడి చేయలేదు. దాడి చేసినట్లుగా చెబుతున్న అధికారి గాయపడింది లేదు. కోడి కత్తి కేసులో జగన్మోహన్ రెడ్డికి గీరుకుపోయినట్లుగా, సదరు ఏ ఎస్ ఐ కి వాహనం టైరు మాత్రమే రాసుకుంటూ వెళ్ళింది. కోడి కత్తి కేసులో జగన్మోహన్ రెడ్డి ఆస్కార్ లెవెల్ నటన కనబరిచారు. గన్నవరం లో జరిగిన ఘటనలో పోలీసు అధికారి ఒకరు ఆసుపత్రికి వెళ్లిన తర్వాత దెబ్బ తగిలినట్టుగా నాటకం ఆడారు. కడప సంఘటనలో సదరు ఏఎస్ఐ కి అలా నటించే అవకాశం లభించలేదని రఘురామ కృష్ణంరాజు అపహస్యం చేశారు .

మధ్యాహ్నానికి వాయిదా పడిన చంద్రబాబు నాయుడు బెయిల్ పిటిషన్ వాదనలు
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పూర్తిస్థాయి బెయిల్ పిటిషన్ పై బుధవారం నాడు ప్రాసిక్యూషన్ తరపు న్యాయవాది అభ్యర్థన మేరకు మధ్యాహ్నానికి వాదనలు వాయిదా పడ్డాయని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. లిస్టులో ఐటెం నెంబర్ 22 గా ఉన్న చంద్రబాబు నాయుడు బెయిల్ పిటిషన్ పై ఉదయమే వాదనలు ప్రారంభమవుతాయని ఆశించాను. కానీ మళ్లీ ప్రభుత్వం తరఫున ప్రాసిక్యూషన్ న్యాయవాదులు వాయిదా కోరారు. ఈ కేసులో అడిషనల్ అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి దగ్గర మ్యాటర్ లేదు. మ్యాటర్ లేని సుధాకర్ రెడ్డి వాదించడానికి కూడా ఏమీ లేదు. ప్రాసిక్యూషన్ తరపు న్యాయవాదుల దగ్గర వాదించడానికి పాయింట్లు లేకపోవడంతో, చంద్రబాబు నాయుడు తరఫున న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తారని భావించాను.

అయితే ప్రాసిక్యూషన్ తరపు న్యాయవాదులు మళ్లీ వాయిదా కోరడం, న్యాయమూర్తి మధ్యాహ్నానికి వాయిదా వేయడం జరిగింది. ప్రాసిక్యూషన్ తరపున న్యాయవాదుల వద్ద ఇప్పటివరకు ఏ ఒక్క ఆధారం లేదు అన్నది సుస్పష్టం. తొలుత మూడువేల కోట్ల కుంభకోణం జరిగిందన్నారు. ఆ తరువాత 300 కోట్ల రూపాయల కుంభకోణం అన్నారు. చివరకు 27 కోట్ల రూపాయలకు వచ్చారు… ఆ 27 కోట్ల రూపాయల కూడా చెక్కు రూపంలో తెదేపాకు వచ్చినట్లుగా చెబుతున్నారు. చెక్ రూపంలో 27 కాకపోతే 107 కోట్ల రూపాయలు తెదేపాకు విరాళంగా రావచ్చు. అలా వైకాపాకు కూడా బోలెడన్ని విరాళాలు వచ్చాయి. ఆ వివరాలన్నీ ఆ పార్టీ నాయకత్వం వెల్లడిస్తుందా? అని రఘురామకృష్ణంరాజు నిలదీశారు.

ఇప్పుడు తెదేపాకి నోటీసులు ఇచ్చామని, నోటీసులు ఇచ్చాము కాబట్టి కొద్దిగా గడువు ఇవ్వండని ప్రాసిక్యూషన్ తరపు న్యాయవాదులు అడుగుతారేమో ?నని రఘురామకృష్ణం రాజు అపహస్యం చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు అందరికీ బెయిల్ లభించింది. సుప్రీంకోర్టు సెలవులకు ముందు భాస్కర్ అనే ఉద్యోగికి కూడా పూర్తిస్థాయి బెయిల్ మంజూరు చేయడం జరిగింది. క్యాబినెట్ నిర్ణయంతో స్కిల్ డెవలప్మెంట్ స్కీమును అమలు చేసిన మాజీ ముఖ్యమంత్రిని నిర్బంధించాల్సిన అవసరమే లేదు. మధ్యాహ్నం వాదనలు కొనసాగుతాయా?, లేకపోతే ప్రాసిక్యూషన్ దీనంగా ప్రాధేయపడితే రేపటికి వాయిదా వేస్తారా అన్నది చూడాలని రఘురామకృష్ణంరాజు అన్నారు.

కృష్ణను మాత్రమే హీరో అని అంటారు
సినీ కథానాయకుల్లో హీరో అని ఒక కృష్ణ నే పిలుస్తారని రఘురామకృష్ణం రాజు అన్నారు. అలాగే ఒక నటుడిని డేరింగ్ అండ్ డాషింగ్ అని పిలవడం కృష్ణ తోనే ప్రారంభమయ్యిందన్నారు. శిఖండులైన పోలీసు అధికారులను అడ్డం పెట్టుకొని కుహనా రాజకీయ నాయకులు తప్పుడు కేసులతో రాష్ట్రంలో భయోత్పాత వాతావరణాన్ని సృష్టించాలని చూస్తున్నారు. హీరో కృష్ణ స్ఫూర్తితో డేరింగ్ అండ్ డాషింగ్ గా ప్రజలంతా పోరాడాలని రఘురామకృష్ణం రాజు కోరారు. సినీ హీరో కృష్ణ తొలి వర్ధంతి సందర్భంగా ఆయనకు రఘురామకృష్ణం రాజు ఘనంగా నివాళులు అర్పించారు.

LEAVE A RESPONSE