సీమెన్స్ ఇండస్ట్రియల్ సాఫ్ట్ వేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కి సీమెన్స్ కి సంబంధం లేదని నిరూపించగలరా?
-టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్
రాష్ట్రంలో వారం రోజుల క్రితం చంద్రబాబునాయుడును అన్యాయంగా, అక్రమంగా అరెస్టు చేశారు. చేయని నేరానికి ఆయనను జైల్లో వేశారు. ఏపీ సీఐడీ కోర్టులను సైతం తప్పుదోవ పట్టించింది. అసత్యాల్ని విపరీతంగా ప్రచారం చేశారు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి, సంజయ్ లు కలిసి చంద్రబాబుపై విపరీతమైన అసత్యాలు వల్లెవేశారు. సీమెన్స్ ఇండస్ట్రియల్ సాఫ్ట్ వేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కి సీమెన్స్ కి సంబంధం లేదని నిరూపించగలరా? సీమెన్స్ ఇండస్ట్రియల్ సాఫ్ట్ వేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనేక దేశాల్లో ఉంది. సీమెన్స్ కి, సీమెన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కి సంబంధం లేదని ఎలా చెప్పగలరు. మా ఇంటికి బోర్డు పెట్టుకుంటే నీవు ఊరుకుంటావా అని సీఐడీనే ప్రశ్నించింది. ఒక దొంగ ట్రాఫిక్ యూనిఫామ్ వేసుకొని ట్రాఫిక్ చలానా వసూలు చేస్తే ఊరుకుంటారా? వారం లోపలనే పట్టుకుంటారు.
సీమెన్స్ ఏజీ సంస్థ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ కన్నా ఆరు రెట్లు ఎక్కువ రెట్లు వ్యాపారం చేస్తోంది. అలాంటి సంస్థ పేరు వేరేవారు వాడుకుంటే ఆ సంస్థ చూస్తూ ఊరుకుంటుందా? ఇవన్నీ ఆలోచించాలి. రాష్ట్ర ప్రభుత్వానికి అంత పరిజ్ఞానం లేదనిపిస్తోంది. చంద్రబాబుపై బురద చల్లాలని వైసీపీ నాయకుల మాటలు విని తప్పుడు సమాచారాన్ని పదే పదే చెబుతున్నారు. సీమెన్స్ ఏజీ మాకు లేఖ రాసిందని తప్పుడు సమాచారమిస్తున్నారు. రాసి ఉంటే ఆ లేఖను వెంటనే బయట పెట్టాలి. వారి స్టాక్ హోల్డింగ్ రిపోర్టు కూడా బయట పెట్టాలి. టీడీపీ నాయకుల బ్యాంక్ అకౌంట్లు వైసీపీ నాయకులు తెలుసుకున్నట్లు ఇది కూడా తెలుసుకోవాలి. సీమెన్స్ ఏజీ వెబ్ సైట్ కెళ్లి అఫిషియల్ టాక్యుమెంట్ తీసుకోవాలి. ఏపీలోనే కాకుండా హైదరాబాద్ లో కూడా సీమెన్స్ విషయంలో చంద్రబాబుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సీమెన్స్ అనేది ఒరిజనల్ సంస్థ. ప్రభుత్వానికి స్కిల్ డెవలప్ మెంట్ పై అవగాహన లేదు.
చంద్రబాబుతోనే కాదు రాష్ట్రంలోని యువతీ యువకుల జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంది. ప్రభుత్వం చేసిన ఈ నష్టంతో ఇంకో కంపెనీ ఆంధ్ర రాష్ట్రం వైపు తిరిగి చూడదు. చంద్రబాబు యువతకు ఉద్యోగాలు రావాలనే తపనతో పనిచేశారు. వైసీపీ దీన్ని బూడిదపాలు చేసింది. వైసీపీ ప్రభుత్వం యువకుల జీవితాలలో నిప్పులు పోసింది. సాఫ్ట్ వేర్ తిరుగుబాటు వచ్చినప్పుడు భారత దేశంలో ఏ రాష్ట్రంలో చేయకపోయినా ఏపీలో చంద్రబాబు రిస్క్ తీసుకున్నారు.
350 ఇంజనీరింగ్ కాలేజీలకు ఒకేసారి పాలసీ పెట్టించారు. ఆరోజుల్లో 350 కాలేజీలు ఇవ్వడంతో నేడు ప్రపంచ వ్యాప్తంగా పేదవారి పిల్లలు పెద్ద పెద్ద కంపెనీలలో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. వైసీపీ ప్రభుత్వానికి ఇలాంటి ఆలోచనలు ఊహకు కూడా రావు. విభజన ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికిప్పుడు పరిశ్రమలు తీసుకురాలేము, ఉద్యోగాలు కల్పించలేమనే ఉద్దేశంతో చంద్రబాబు సీమెన్స్ తో ఒప్పందం కుదుర్చుకుని స్కిల్ డెవలప్ మెంట్ను అభివృద్ధి చేశారు. 10, ఇంటర్, పాలిటెక్నిక్ చదివిన విద్యార్థులు కూడా తమ కాళ్ల మీద తాము నిలబడేలా చేశారు.
చంద్రబాబు మంచి ఉద్దేశంతో కృషి చేశారు. సీమెన్స్ గుజరాత్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుని ఉందన్న విషయం తెలుసుకుని మన చంద్రన్న కూడా ఒప్పందం చేసుకొని సీమెన్స్ ద్వారా స్కిల్ డెవలప్ మెంట్ ను అభివృద్ధి చేశారు. ఆ సమయంలో త్రి సభ్య కమిటీని, ముగ్గురు కార్యదర్శులను గుజరాత్ కు పంపారు. స్టడీ చేయించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా నడుస్తున్న ప్రాజెక్టును గుర్తించలేకపోయారంటే కళ్లుండి చూడలేని గుడ్డివారు వైసీపీ నాయకులు. లక్షలాదిమంది జీవితాలను నేడు నాశనం చేశారు. స్కిల్ డెవలప్ మెంట్ పాలసీని అడాప్ చేస్తోంది వైసీపీ ప్రభుత్వం. అబ్దుల్ కలాం పొగిడిన కంపెనీనే ఇది ఫేక్ కంపెనీ, సూట్ కేస్ కంపెనీ అనడం వారి అవివేకం.
నేడు మేం సీఐడీ, జగన్ సర్కార్ లేవనెత్తిన అన్ని ఆరోపణలను ఆధారాలతో సహా ఎండగడతాం. స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ కు సంబంధించి మొత్తం 35 డాక్యుమెంట్ల ద్వారా సీఐడీ సంజయ్, పొన్నవోలు, వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణల్నీ అవాస్తవాలనీ ఆధారాలతో సహా నిరూపిస్తాం. నేడు తాను బయట పెట్టిన అంశాలపై బహిరంగంగా గానీ, మీడియా సమక్షంలో గానీ చర్చకు వచ్చే దమ్ము, ధైర్యం సజ్జలకు, సీఐడీ చీఫ్ సంజయ్ కు ఉందా అని సవాల్ చేస్తున్నాను.
మార్చి 22, 2016న సెంట్రల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ (సీఐటీడీ) ఇచ్చిన వాల్యుయేషన్ రిపోర్ట్ పరిశీలిస్తే శిక్షణా కేంద్రాల్లో ఎలాంటి పరికరాలు, ఎటువంటి అధునాతన సాంకే తిక పరిజ్ఞానం ఉందో సీఐడీవారికి కనిపిస్తుంది. సిమెన్స్ సంస్థ అందించిన సాఫ్ట్ వేర్ వ్యాల్యుయేషన్ వివరాలకు సంబంధించిన వాల్యుయేషన్ అంతా బోగస్ అన్నట్టు వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. ప్రజలకు పనికొచ్చే ప్రాజెక్టుల వ్యాల్యుయేషన్లు వైసీపీ నాయకులకు, జగన్ రెడ్డికి ఏం తెలుస్తాయి. అవినీతి దోపిడీ వ్యాల్యుయేషన్లు అయితే వారికి తెలుస్తుంది.
చంద్రబాబునాయుడును జైలులో ఉంచడం కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని ప్రజలకు అర్థమైపోయింది. వైసీపీ ప్రభుత్వాన్ని కట్టగట్టి గంగలో కలపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మారుతున్న సమీకరణలతో మరింత ఉధృతంగా ఉద్యమం మొదలౌతుంది.