ఐటీ నోటీసులపై చంద్రబాబు మౌనం అర్థాంగీకారం
తప్పు చేయకపోతే స్టే తెచ్చుకోకుండా విచారణ ఎదుర్కోవాలి
వైఎస్‌ఆర్ సీపీ సంయుక్త కార్యదర్శి కారుమూరి వెంకటరెడ్డి
తాడేపల్లి: అధికారంలో ఉన్నప్పుడు లక్షల కోట్లు దోచేసిన చంద్రబాబు ఇప్పుడు అడ్డంగా దొరికిపోయాడు. లెక్కలు చూపని రూ. 118 కోట్లపై ఐటీ శాఖ నోటీసు ఇస్తే, చంద్రబాబు దానిపై స్పందించడం లేదు. ఒక వేళ ఐటీ శాఖ తప్పుడు నోటీసులు ఇచ్చిందని భావిస్తే.. ఆ శాఖ మీద పరువు నష్టం దావా వేయగలవా?. కేంద్రాన్ని ప్రతివాదులుగా చేర్చి కోర్టులో విచారణ కోరవచ్చు. కానీ చంద్రబాబు ఆ పని చేయడం లేదంటే.. భయంతోనా?.. లేక ఇంకా లోతుగా వెళ్తే.. మరింత అడ్డంగా దొరికిపోతామన్న ఆందోళనా?.
ఐటీ నోటీసులు తప్పుడుగా ఇస్తే.. షాపూర్జీ పల్లోంజీ ప్రతినిధి అబద్ధం చెబితే అందరిపైనా పరువు నష్టం దావా వేయాలి. సోషల్ మీడియాలో తప్పుడు వార్త పెట్టారని యువగంగాళం యాత్ర చేస్తున్న లోకేశ్, కోర్టుల్లో కేసులు వేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఐటీ నోటీసులపై మాట్లాడడం లేదు. స్పందించడం లేదు. చంద్రబాబు కూడా కోర్టుల్లో కేసులు వేయడం లేదు. కానీ చంద్రబాబుకు అరెస్టు అవుతాననే భయం పట్టుకుంది.
షాపూర్జీ పల్లోంజీ కంపెనీ నుంచి రూ. 118 కోట్ల లంచాన్ని షెల్ కంపెనీల ద్వారా తీసుకున్నట్లు, ఐటీ నోటీసుల ద్వారా తేటతెల్లమైంది. అయితే వెలుగులోకి రాని ఇలాంటివి చంద్రబాబు 5 ఏళ్ల పాలనలో ఎన్నో ఉండొచ్చు. కాంట్రాక్టర్ల ద్వారా చంద్రబాబు మెక్కిన లంచాలన్నీ బయటకు వస్తే, అది లక్షల కోట్లు ఉంటుంది.
చంద్రబాబుకు ఐటీ శాఖ నోటీసులు ఇస్తే, తానెందుకు స్పందించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అంటున్నారు. గతంలో ఏలేరు స్కాంపై బీజేపీ వారు ఉదయ కమలం అనే పుస్తకం వేశారు. అలాంటి బీజేపీ ఇప్పుడు నోరు మెదపడం లేదంటే.. ఆ పార్టీ రాష్ట్ర పెద్దలు చంద్రబాబుకు సంబంధించిన వ్యక్తులు అని ప్రజలకు అర్థమౌతోంది.