– ఇందిరమ్మ హయాంలో ఇచ్చిన భూములను వ్యాపారం కోసం ఎలా వాడతారు?
– కేటీఆర్ ఇప్పుడు నంగనాచి కబుర్లు చెబుతున్నారు
– బీఆర్ఎస్ పార్టీకి సెంట్రల్ యూనివర్సిటీ భూములపై మాట్లాడే నైతిక హక్కు లేదు
– బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ నాణేనికి బొమ్మా, బొరుసు వంటివి
– పదేళ్లపాటు వాళ్లు పచ్చగున్న దగ్గర తిని.. వెచ్చగున్న చోట పడుకున్నారు
– ఈ రెండు పార్టీలది వీణా-వాణిలా విడదీయరాని బంధం
– బీజేపీ ఎంపీ రఘునందన్ రావు
హైదరాబాద్: ‘‘ తన నానమ్మ ఇచ్చిన భూములను తన పార్టీ సీఎం రేవంత్‌రెడ్డి తెగనమ్ముతుంటే దానిని ప్రశ్నించి అడ్డుకోవలసి రాహుల్‌గాంధీ ఎక్కడున్నారు? విద్యార్ధులను జంతువుల కన్నా హీనంగా పోలీసులు ఈడ్చుకెళుతున్న దృశ్యాలు రాహుల్‌కు కనిపించవా? హెచ్‌సీయు భూములపై సుప్రీంకోర్టు తీర్పు విద్యార్ధుల విజయం. మేం చివరి వరకూ వారితోనే ఉంటాం’’ అని బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు స్పష్టం చేశారు.
కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రఘునందన్ రావు స్వాగతించారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు నిదర్శనమని ఆయన మండిపడ్డారు. 1973లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పెట్టినప్పుడు 2,374 ఎకరాలను అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందని, ఇప్పుడు అదే కాంగ్రెస్ ఆ భూములను లాక్కుంటుందని మండిపడ్డారు.
రఘునందన్‌రావు ఇంకా ఏమన్నారంటే.. యూనివర్సిటీలో పిల్లల జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన దృశ్యాలు రాహుల్ గాంధీకి ఎందుకు కనిపించలేదు? మా నానమ్మ ఇచ్చిన భూములను ఎందుకు లాక్కుంటున్నావని రాహుల్ గాంధీ అడిగారా? రాహుల్ అడిగి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదు. భవిష్యత్తులో విద్యార్థుల భూములు ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వకుండా అడ్డుకుంటాం.
వాల్టా చట్టం ప్రకారం ఇంటి కాంపౌండ్‌లో ఉన్న చెట్టు నరకాలన్నా అనుమతులు తప్పనిసరి. ఈ చట్టాలు, నిబంధనలు అధికారులకు తెలియదని నేను అనుకోవడం లేదు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం నెల రోజుల్లో నిపుణుల కమిటీ వేయాలి. విద్యార్థుల పక్షాన నిలబడతాం.
1973లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పెట్టినప్పుడు 2374 ఎకరాలను ప్రభుత్వం ఇచ్చింది. ఇందిరమ్మ రాజ్యమని రోజూ చెప్పే రేవంత్ రెడ్డి, ఇందిరమ్మ హయాంలో ఇచ్చిన భూములను వ్యాపారం కోసం ఎలా వాడతారు? చెరువులు, కుంటల్లో అక్రమ నిర్మాణాలను తొలగించి పర్యావరణాన్ని రక్షించేందుకు హైడ్రా తెచ్చానని సీఎం రేవంత్ అన్నారు. మరిక్కడ వందల ఎకరాల్లో చెట్లను నరికి, వన్య ప్రాణులకు ఇబ్బంది కలిగిస్తుంటే ఎలా?
పదేళ్లపాటు అధికారంలో ఉన్నప్పుడు సెంట్రల్ యూనివర్సిటీ మొహం చూడని కేటీఆర్ ఇప్పుడు నంగనాచి కబుర్లు చెబుతున్నారు. బీఆర్ఎస్ పార్టీకి సెంట్రల్ యూనివర్సిటీ భూములపై మాట్లాడే నైతిక హక్కు లేదు. ఆ పార్టీ విశ్వసనీయత కోల్పోయింది.
బీఆర్ఎస్ వాళ్లు విద్యార్థుల ముందుకెళ్లి మొసలి కన్నీళ్లు కార్చుతున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ నాణేనికి బొమ్మా, బొరుసు వంటివి. పదేళ్లపాటు వాళ్లు పచ్చగున్న దగ్గర తిని, వెచ్చగున్న చోట పడుకున్నారు. గులాబీ జెండా మీద ఎమ్మెల్యే అయ్యి, మూడు రంగుల జెండా మీద పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేశారు. ఈ రెండు పార్టీలది వీణా-వాణిలా విడదీయరాని బంధం. బీజేపీ విద్యార్ధుల పక్షాన నిలబడుతుంది. ప్రభుత్వ భూములు కాపాడేందుకు పోరాడుతుంది.