Suryaa.co.in

Editorial

సీఎం కాన్వాయ్ కోసం ఆ మాత్రం త్యాగం చేయలేరా?

– దానికే సస్పెన్షన్లా.. అన్యాయం!
( మార్తి సుబ్రహ్మణ్యం)

రాష్ట్రాభివృద్ధి కోసం అహోరాత్రులు కష్టపడుతూ, అక్కచెల్లెమ్మలకు డబ్బులు పంచేందుకు దొరికినకాడికి అప్పులు చేస్తున్న ముఖ్యమంత్రి జగనన్న పర్యటన కోసం ఆఫ్టరాల్ ఒక కారు ఇవ్వలేరా? ఆ మాత్రం త్యాగం చేయనివారు అసలు ఆంధ్రాలో ఎందుకు ఉంటున్నారు? ఎలా ఉండనిస్తున్నారు? సీఎం గారి కాన్వాయ్ కోసం వాహనాల వేటలో పడిన పోలీసులు, రవాణాశాఖ అధికారులు.. దారినపోయే దానయ్య కుటుంబాన్ని కారు దింపి, కారు తీసుకువెళ్లారే అనుకోండి. ఏం.. అంతమాత్రాన కొంపలంటుకుపోతాయా? సీఎం గారి పర్యటన అయేంతవరకూ ఒంగోలు బస్టాండులో హాయిగా ఏ బఠాణీలో, బజ్జీలో, గుంటపునుగులో తినొచ్చుగా? తిరుపతికి వెళితే మాత్రం.. సాక్షాత్తూ నడిచేదేవుడే ఇక్కడ జిల్లాలో పర్యటిస్తుంటే, కనపడని దేవుడి కోసం కారులో వెళ్లాలా ఏంటీ? పైగా అధికారులు తమ కారు ఎత్తుకెళ్లారని మీడియాకు తీరికూర్చుని చెప్పడం! అబ్బెబ్బే.. ఏమీ బాగలేదురా అబ్బాయ్! అతన్ని అలా వదిలేయకండి. ఎవరికన్నా చూపించండ్రా!!

తిరుపతికి కుటుంబసమేతంగా వెళుతున్న వినుకొండ వాసిని, రవాణాశాఖ అధికారులు ఒంగోలులో కాపు కాసి పట్టుకున్నారు. లైసెన్సు గ్రటాల కోసం అనుకుంటే తప్పులో కాలేసినట్లే. అది సీఎం జగనన్న జిల్లా పర్యటన కోసం సీఎం కాన్వాయ్‌లో వాహనాల వేటలో భాగమట. మేము తిరుపతి వెంకన్న దర్శనానికి వెళుతున్నా వినకుండా, మా జగనన్న కంటే మీ వెంకన్నే ఎక్కువా అన్నట్లు ఓ చూపు చూసి.. చాల్చాల్లే ఇక దిగండని, కారు కీస్ తీసుకుని ‘మర్యాదగా’ కిందకు దింపేశారు.

ఈ విషయాన్ని గమ్మున మనసులో దాచుకోలేని సదరు వినుకొండ వాసి, తనకు జరిగిన ‘మర్యాద’ను మీడియాకు చెప్పడం, అదికాస్తా వైరల్ కావడం, చంద్రబాబు దానిని ఖండిస్తూ ట్వీట్ చేయడం, ఎంపీ రఘురామకృష్ణంరాజు తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించడం శరవేగంగా జరిగిపోయాయి. దీనితో

నష్టనివారణకు దిగిన సీఎంఓ.. సదరు అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేసి, కారు గుంజుకున్న హోం గార్డును, అతగాడిని ఆ పనికి పురమాయించిన ఎంవీఐనీ జమిలిగా సస్పెండ్ చేశారు. ఇదీ వార్త.

ఎంత అన్యాయం? సీఎం కాన్వాయ్ కోసం అధికారులేదో ముచ్చటపడి, ఒకే ఒకసారి కారు అడిగితే దానికి ఇంత సీన్ సృష్టిస్తారా? అయినా వాళ్లు పాపం దానిని పర్మినెంట్‌గా ఉంచేసుకోవడం లేదు. సీఎం టూర్ అయ్యాక కారు వెనక్కిచ్చేస్తారు కదా? సీఎం-మంత్రుల టూర్లకు ప్రభుత్వం నుంచి బడ్జెటు ఉండదు. అందుకే సహజంగా ఎక్కడైనా ఆయా శాఖల జిల్లా అధికారులు ఇలా నిస్సిగ్గు- నిర్లజ్జగా అందరిపై వాలిపోయి, వాలేశ్వర్రావ్‌లా బాదేస్తుంటారు. ఆ ప్రకారంగా రైస్ మిల్లు, బంగారు షాపు, ఆయిల్‌మిల్లులు, ప్రైవేటు కాలేజీలు-స్కూళ్లు, మైనింగ్ కంపెనీ, హోటల్ అసోసియేషన్లకు ‘ఇండెంటు’ పెట్టి వీఐపీల టూర్లను లాగించేస్తుంటారు. ఆర్డీఓ నుంచి వీఆర్వో వరకూ ఈ బాధ్యతలు బదిలీ అవుతుంటాయన్నమాట. ఇది ఏ ప్రభుత్వంలో అయినా జరిగే నిస్సిగ్గు వసూళ్ల పర్వమే. ఎంకిపెళ్లి సుబ్బిచావుకు రావడమంటే ఇదే!

సహజంగా దొంగలు కార్లు ఎత్తుకెళితే పోలీసులకు, ఆ తర్వాత రవాణాశాఖకు ఫిర్యాదు చేస్తారు. మరి ఆ అధికారులే దారికాచి కారు దోచుకువెళితే ఎవరి ఫిర్యాదు చేయాలి? పాపం వినుకొండ కుర్రాడి దగ్గర పైసలున్నాయి కాబట్టి, ఇంకో కారులో తిరుమల వెళ్లాడు. అదే ఇంకో సుబ్బారావు జేబులో ఏమీ లేవనుకోండి. ఆ బకరా సంగతి ఏమిటి? ఇప్పుడు ఇదే అందరి ప్రశ్న.

LEAVE A RESPONSE