బెజవాడ బెంజ్ సర్కిల్ లో పదినిమిషాలు ఆగటం తప్పనిసరి అయిందనిపిస్తున్నది. బెజవాడలో అమ్మవారు ఎంత ప్రసిద్ధులో బెంజ్ సర్కిల్ కూడా అంత ప్రాచుర్యమున్నదే. ఎప్పుడూ బెంజ్ సర్కిల్ అనేది రద్దీగా వుండే ప్రాంతమే కానీ ఇప్పుడు పెరిగిన ట్రాఫిక్ కు తగినంత సౌకర్యం లేక, తానిబ్బంది పడుతూ జనాన్ని కూడా ఇబ్బంది పెడుతున్నది.
బెంజ్ సర్కిల్ అనే కాదు, విజయవాడలో అన్ని రోడ్ల పరిస్థితి అలాగే వుంది. రాజధానిగా ప్రకటించబడిన అమరావతి ప్రాంత ట్రాఫిక్ భారాన్ని మోయలేక బెజవాడ చాలా ఇబ్బంది పడుతున్నది. ఒకనాటి బెజవాడ, తరువాత విజయవాడ. కురుక్షేత్ర మహా సంగ్రామంలో గెలుపు కోసం పాశుపతాస్త్రం కోరుకున్న పార్థుడు పరమశివుడి కోసం ఇంద్రకీలాద్రిపైన తపమాచరించి సాధించాడు అనే కధ ఒకటి వాడుకలో వుంది.
కనకదుర్గ అమ్మవారు మహిషాసురుడిని వధించి కొండపైన నిండుగా కొలువైనది అనేది వాడుకలో ఉన్న మరో కథ. మహిషాసురుడు అనేది చెడు అనుకుంటే అమ్మవారు ఆ చెడును నశింపచేసిన మంచి. అందుకే చెడుపై మంచి సాధించిన విజయానికి వేదిక అయినందున విజయవాడగా ప్రసిద్ధి గాంచి ఉండవచ్చు. ఇంద్రకీలాద్రి పర్వతంపైన వెలసిన కనకదుర్గ అమ్మవారి ముక్కుపుడకను తాకాలని వడివడిగా ప్రవహించే కృష్ణమ్మను బంధించి, ప్రవాహాన్ని శాసించే ప్రకాశం బ్యారేజీ, విజయవాడను భౌగోళికంగా అందంగా తీర్చిదిద్దితే, అదే విజయవాడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక రాజధానిగా వెలుగొందింది.
విద్యాకేంద్రంగా విరాజిల్లిన విజయవాడ, కళాశాల రాజకీయాలకు ఎంత ప్రసిద్ధి గాంచిందో, హత్యా రాజకీయాలకు అంతే ప్రసిద్ధి గాంచింది. వీర తెలంగాణ విప్లవపోరాటానికి ప్రత్యక్షంగా సాయమందించిన, పరోక్షంగా పోరాటాన్ని నడిపిన నాయకులకు విడిది అయిన కృష్ణాజిల్లాకు కేంద్రమైన విజయవాడ, ఒకనాడు కమ్యూనిస్టుల కంచుకోట. కొండపైన అమ్మవారు ఎంత ప్రసిద్ధి చెందినదో, గుణదల మేరిమాత కొండ అంత ప్రసిద్ధి.
కొచ్చిన్ లో చర్చ్ లు చూడటానికి ఎంత బాగుంటాయో విజయవాడలో చర్చ్ లు కొన్ని అంత బాగుంటాయి. ప్రపంచంలో జనసాంద్రత ఎక్కువ కలిగిన పట్టణాలలో విజయవాడ మూడవ స్థానంలో వుంది. బ్రిటిష్ వారి హయంలోనే విద్యారంగంలో ముందంజ వేసిన ప్రాంతం. పారిశ్రామికంగా ముందంజ వేసి, పాలకుల నిర్లక్ష్యానికి గురైన ప్రాంతం. 1937 లోనే ఆంధ్రా సిమెంట్స్ స్థాపించబడింది. ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి సిమెంటు ఫ్యాక్టరీ.
1950 లో స్థాపించబడిన సిరీస్ ఫార్మాస్యూటికల్స్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి ఫార్మాస్యూటికల్ కంపెనీ. వ్యవసాయ ఉత్పత్తుల్లో, పారిశ్రామిక వస్తువుల ట్రేడింగులో ఏనాటినుండో దేశంలో అగ్రగామి పట్టణాలతో పోటీపడిన నగరం. నున్న మామిడిపండ్ల మార్కెట్ ఆసియాలోనే పెద్ద మార్కెట్లలో ఒకటి. ఇక విజయవాడ రైల్వేజంక్షన్ దేశంలో బిజియెస్ట్ జంక్షన్స్ లో ఒకటి. విజయవాడ నగరం డైరెక్ట్ గా నేషనల్ హైవేకు అనుసంధానించబడి ఉంది.
కానీ ఎందుకని హైదరాబాదులా ప్రగతి పధంలో పయనించలేక పోయింది.? విజయవాడ చరిత్రలో మొదలైనరోజు నుండి ఇప్పటివరకు తన స్వయంప్రతిభతో ఎదిగిందే కానీ, ప్రభుత్వాలు విజయవాడ నగరానికి చేసింది ఒక్కటి కూడా చూపించలేరు. ఒక విద్యార్థిలో ప్రతిభ కనిపిస్తే చేయూతనందిస్తే రాణిస్తాడు. ఎలాగూ ప్రతిభ వుందికదా అని వదిలేస్తే వాడు ఎలా పైకొస్తాడు.? విజయవాడ పరిస్థితి కూడా అదే.
తనకు తానుగా ఎంత అభివృద్ధి చెందగలదో అంతా చెందింది. అక్కడే ఆగిపోయింది. వేగంగా పెరగగల సత్తా ఉన్న నగరం అని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ లాంటి వారి నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో విజయవాడకు ఏ ఒక్క ప్రభుత్వమూ ఏది చేయలేదు అనేది కఠిన వాస్తవమేకాదు చేదునిజం.
రాష్ట్ర విభజనానంతరం కూడా విజయవాడకు ఇప్పటివరకు టీడీపీ ప్రభుత్వం ఏమీ చేయలేదు. వైసీపీ ప్రభుత్వం నాశనం చేసే ప్రయత్నం చేసింది. మరలా వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఇప్పటివరకైతే ఏమీ చేయలేదు. కనీసం మౌలిక వసతులకు కూడా విజయవాడ నోచుకోలేదు. వెళ్లిన ప్రతిసారి నేను గమనిస్తున్న విషయం కూడళ్లలో సిగ్నల్స్ ఎప్పుడూ పనిచేయవు. పోలీసులు మైకులు పట్టుకుని చెబుతూ ఉంటారు.
సీడ్ కేపిటల్ ఏరియాలో ఉన్న ప్రాంతంలో కూడా అభివృద్ధి జరగకపోతే ప్రజల కలల రాజధాని నిర్మాణం జరిగేది ఎప్పుడు.? 2019-24 మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి రాజధానిని మూడు ముక్కలు చేస్తే, 2024 లో వచ్చిన కూటమి ప్రభుత్వం అమరావతే రాజధాని అని చెప్పిందే కానీ, ఇంతవరకు కనీసం పనులు మొదలుపెట్టలేదు. నిధుల కేటాయింపు జరిగిన తరువాత కూడా ఇంత ఆలస్యం జరుగుతుంటే రాజధాని ప్రాంతవాసుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
చంద్రబాబు నాయుడు గెలవగానే రాజధాని పైన ఆశలతో వేర్వేరు ప్రాంతాలనుండి వచ్చేవారిని మోసేది విజయవాడ. లోకల్ వారు కాక ప్రతిరోజూ అయిదు లక్షల పైచిలుకు ఫ్లోటింగ్ ఉంటుంది అంటున్నారు. గతంలో ఎలాగూ నిర్లక్ష్యానికి గురైంది విజయవాడ. ఇప్పుడుకూడా అభివృద్ధి చేయకపోతే విజయవాడ మాసిపోయిన మధుపర్కంలా మిగిలిపోతుంది.
ప్రజలకు చంద్రబాబు చెప్పే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటం వ్యాలీ లు అర్థం కావు. అవి ఎగ్జిస్టెన్స్ లోకి వచ్చి ఫలితాలు రావటానికి టైం పడుతుంది. రాజధాని నిర్మాణం, దాని పరిసర ప్రాంతాల అభివృద్ధి జరగటంలేదని ప్రజలు భయపడుతున్నారు. గతంలో హైదరాబాదులో చంద్రబాబు నాయుడు కృషితో వచ్చిన కంపెనీల ఆదాయం వచ్చేటప్పటికి రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చాడు.
అభివృద్ధి కోసం సంస్థల చుట్టూ చంద్రబాబు తిరుగుతుంటే రాజశేఖరరెడ్డి కరెంటు ఛార్జీల గురించి మాట్లాడి, కరెంటు బిల్లులు కట్టొద్దు అంటూ ప్రజల మార్కులు కొట్టేసి ముఖ్యమంత్రి అయ్యాడు. అమరావతిలో కట్టినవి శాశ్వత నిర్మాణాలు కాదు అని రాజధాని నిర్మాణం జరగలేదు అన్నట్లుగా చంద్రబాబు మాట్లాడటం వలన, వైసీపీ అధికారంలోకి వచ్చింది.
జగన్మోహన్ రెడ్డి రాజధాని రైతులను హింస పెట్టగలిగాడు. మరలా అదే రిపీట్ అవుతున్నది. చరిత్ర ఎక్కడ పునరావృతం అవుతుందో, రాష్ట్రం ఏమైపోతుందో అని కూటమికి ఓట్లేసిన ప్రజలు భయపడుతున్నారు. ప్రజల ఆశలు నెరవేరాలంటే చంద్రబాబు హామీ ఇచ్చినట్లు 2027 నాటికి అమరావతి నిర్మాణం పూర్తి కావాలి. పోలవరం పరవళ్లు తొక్కాలి.
ఈ రెండింటి నిర్మాణాల మీద చంద్రబాబు దృష్టి సారించకుండా పారిశ్రామిక వేత్తలను తీసుకొచ్చినా ఉపయోగం ఉండదు. అమరావతిని సింగపూర్ వాళ్ళు నిర్మించకపోయినా బాధలేదు, అమరావతి ప్రపంచంలోనే అగ్రగామి రాజధానుల్లో ఒకటిగా లేకపోయినా బాధలేదు. రాజధాని నిర్మాణం పూర్తి కావాలి.
ఇప్పటి వేగం తో 2027 నాటికి అమరావతి నిర్మాణం పూర్తి అవుతుంది అని నిజంగా చంద్రబాబు నాయుడు భావిస్తే ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ ఆయనపైన నమ్మకమే ప్రాతిపదికగా కూటమికి ఓట్లేసిన ప్రజల నమ్మకాన్ని ఆయన వమ్ము చేస్తే మాత్రం, ఫలితాలు దారుణంగా ఉంటాయి
. ప్రజల తరఫున కూటమి ప్రభుత్వానికి మరీ మరీ విజ్ఞప్తి చేసేది ఒక్కటే.! అభివృద్ధి 2029 నుండి మొదలైనా పర్వాలేదు కానీ అమరావతి నిర్మాణం, దాని పరిసర ప్రాంతాలైన విజయవాడ లాంటి ప్రాంతాలను వేగంగా అభివృద్ధి చేయాలి, పోలవరం నిర్మాణం పూర్తి చేయాలి. అభివృద్ధి గురించి బాధ్యత లోకేష్ కు అప్పగించండి. ఈ రెండు నిర్మాణాల వేగం పెంచండి. రాజధాని నిర్మాణ వేగం పెంచాలి, పెంచుతారని ఆశిస్తూ…
– ఇంద్రాణి