Suryaa.co.in

Telangana

వర్గీకరణ పోరాటంలో ఉద్యమకారులపై నమోదైన కేసులు వెంటనే ఎత్తివేయాలి

– మాదిగ దండోరా ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలాన్ని ప్రభుత్వం ఉచితంగా ఇవ్వాలి
– ప్రభుత్వ పథకాలలో దండోరా ఉద్యమకారులకు ప్రాధాన్యత ఇవ్వాలి
– మాదిగ అమరవీరుల జ్ఞాపకాలతో స్మృతి వనాల్ని ఏర్పాటు చేయాలి
– మంత్రి దామోదర్ రాజనర్సింహని కలిసి విజ్ఞప్తి చేసిన మాదిగ దండోరా ఉద్యమకారులు
– ఎస్సీ వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో ఆమోదం తెలిపి రాష్ట్రంలో అమలుకు కృషి చేస్తున్న మంత్రి దామోదర్ రాజనర్సింహ, సీఎం రేవంత్ రెడ్డి కు కృతజ్ఞతలు తెలిపిన ఉద్యమకారులు 

హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణ పోరాటంలో ఉద్యమకారులపైనా రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసులను బేషరతుగా వెంటనే ఎత్తివేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ని హైదరాబాదులోని తన నివాసంలో మాదిగ దండోరా ఉద్యమకారులు కలిసి విజ్ఞప్తి చేశారు. సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ పై ఇచ్చిన తీర్పును దేశంలోనే ప్రప్రథమంగా తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయడంలో తీవ్రంగా కృషి చేస్తున్న రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనర్సింహ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కు మాదిగ దండోరా ఉద్యమకారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

ఎస్సీ వర్గీకరణ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ వేసి అసెంబ్లీలో వర్గీకరణ బిల్లును ఆమోదం చేసి అమలుకు ముందుకొచ్చినందుకు దానిలో ముఖ్య భూమిక పోషించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ కి ఉద్యమకారులు ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా SC వర్గీకరణ పోరాటంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమకారుల పైన నమోదైన కేసులను వెంటనే ఎత్తివేయాలని మంత్రి దామోదర్ రాజనర్సింహని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులకు కేటాయించినట్లు 250 గజాల ఇంటి స్థలాన్ని మాదిగ దండోరా ఉద్యమకారులకు కేటాయించాలని వినతిపత్రం సమర్పించారు.

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల లో దండోరా ఉద్యమకారులకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. అలాగే, హైదరాబాద్ నగరంలో మాదిగ అమరవీరుల జ్ఞాపకాలతో స్మృతి వనాల్ని ఏర్పాటు చేయాలని మాదిగ దండోరా ఉద్యమకారులు మంత్రి దామోదర్ రాజనర్సింహ తో కలిసి విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా మాదిగ దండోరా ఉద్యమకారులు చేసిన విజ్ఞప్తిపై రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనర్సింహ సానుకూలంగా స్పందించారు. రాష్ట్రవ్యాప్తంగా మాదిగ దండోరా ఉద్యమకారులపై నమోదైన కేసులను ఎత్తివేసేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో చర్చిస్తామన్నారు.

మాదిగ దండోరా ఉద్యమకారులు రుద్రవరం లింగస్వామి, జిల్లా వెంకటేష్, వెంకట్ గల్ల వెంకట్, మీసాల కురుమయ్య, బడుగుల బాలకృష్ణ, పాలడుగు రమేష్, నక్క వెంకటేష్, గంగాపురం నరసింహ, అరుణ్, నరేష్, అడ్వకేట్ మల్లన్న లు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE