-సిబిఐ పైనే అభియోగం మోపిన హైకోర్టు
-హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో డాక్టర్ సునీత పిటిషన్ దాఖలు చేయాలి
-నామమాత్రపు కండిషన్లతో అవినాష్ రెడ్డికి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు
-సుప్రీంకోర్టు తాజా తీర్పు స్ఫూర్తితో న్యాయమూర్తులను తిట్టినా కేసులో జగన్మోహన్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలి
-జగన్ ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నించిన అమెరికన్ సివిల్ లిబర్టీస్ సంస్థ
-నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడిగా అభియోగాలను ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు నామ మాత్రపు షరతులతో కూడిన బెయిలు మంజూరిపై సిబిఐ తక్షణమే సుప్రీంకోర్టును ఆశ్రయించాలి. సిబిఐ పైనే హైకోర్టు అభియోగాలను మోపింది. ఇప్పుడు సిబిఐ కి ఇష్టం ఉన్నా లేకపోయినా సుప్రీం కోర్టులో అప్పీల్ చేయడం మినహా మరొక మార్గం లేదని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు అన్నారు.
తన తండ్రి చావుకు కారణమైన సూత్రధారులెవరో తెలుసుకోవాలని పోరాడుతున్న డాక్టర్ వైఎస్ సునీత, సుప్రీంకోర్టును ఆశ్రయించాలి. బుధవారం నాడు సాయంత్రం నాలుగు గంటల లోపు పిటిషన్ దాఖలు చేయాలి. సునీత పిటిషన్ ను సుప్రీంకోర్టు గురువారం నాడు పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు. బుధవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు సబబా?, కాదా? అన్నది తేల్చాల్సింది సుప్రీంకోర్టు. సిబిఐ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తుందా?, లేదా?? అన్నది త్వరలోనే తేలే అవకాశం ఉందన్నారు.
అవినాష్ రెడ్డికి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ, అరెస్టు చేయాలనుకుంటే వెంటనే బెయిల్ మంజూరు చేయాలని పేర్కొంది. ఈ తీర్పును నేను ఊహించలేదు. అవినాష్ రెడ్డికి ప్రజలంతా ముందస్తు బెయిల్ లభిస్తుందని భావించారు. వైఎస్ వివేకా హత్య కేసులో ఇదే ఆరోపణలను ఎదుర్కొంటున్న వైయస్ భాస్కర్ రెడ్డి తో సహా ఇతర నిందితులను సిబిఐ అరెస్టు చేసిందని గుర్తు చేశారు. బెయిల్ ఇవ్వడం అనేది న్యాయమూర్తి విచక్షణాధికారం. బెయిల్ ఇవ్వాలనుకుంటే న్యాయమూర్తి ఇవ్వవచ్చు.
ఆయన విచక్షణా అధికారాన్ని ఎవరికి ప్రశ్నించడానికి అర్హత లేదు. హైకోర్టు న్యాయమూర్తి మంజూరీ చేసిన ముందస్తు బెయిల్ ను సిబిఐ, డాక్టర్ వైఎస్ సునీతలు సుప్రీంకోర్టులో ప్రశ్నించవచ్చు. ఒకవేళ సుప్రీం కోర్టు తప్పు పట్టవచ్చునని అన్నారు. హత్యా ప్రదేశంలో అవినాష్ రెడ్డి సాక్షాలను ధ్వంసం చేశారని, రక్తపు మరకలను తూడ్చివేసే సమయంలో ఆయన అక్కడే ఉన్నారని ప్రకాష్ రెడ్డి సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలంలో వెల్లడించారు.
హత్యకు ముందు హత్య తరువాత నిందితులంతా ఒకే ఇంట్లో ఉన్నట్లుగా గూగుల్ టేక్ అవుట్ ద్వారా సిబిఐ గుర్తించింది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య గురించి ఆయన వ్యక్తిగత సహాయకుడు కృష్ణారెడ్డి చెప్పక ముందే జగన్మోహన్ రెడ్డికి తెలుసునని సిబిఐ పేర్కొంది. ఐపిడిఆర్ ఆధారంగా ఒకే సమయంలో అన్ లో ఉన్న ఫోన్లను గుర్తించడం జరిగింది.
అలాగే ఒకే సమయంలో ఆ రెండు ఫోన్లు ఆఫ్ అయినట్లుగా వెల్లడించింది. ఈ హత్య వెనుక విస్తృత కుట్ర కుంభకోణం ఉందని సిబిఐ పేర్కొంది. విస్తృత కుట్ర కుంభకోణాన్ని ఛేదించడానికి అవినాష్ రెడ్డి సహకరించడం లేదని, అందుకే ఆయన్ని అదుపులోకి తీసుకొని విచారించాలని సిబిఐ కోర్టుకు విన్నవించిందని రఘురామకృష్ణం రాజు తెలిపారు . సిబిఐ గతంలో దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్లో స్పష్టమైన వివరాలను వెల్లడించింది.
అయితే అవినాష్ రెడ్డి పై, సిబిఐ ఎటువంటి నిర్ధారిత ఆరోపణలను చేయలేదని హై కోర్టు తప్పు పట్టింది. ఈ కేసులో సిబిఐ నిర్మాణాత్మకంగా మాట్లాడలేదని ధర్మాసనం భావించింది. గతంలో జస్టిస్ సురేంద్ర బెంచ్ లో దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్ ను నేను చదివాను. అందులో సిబిఐ స్పష్టమైన ఆరోపణలే చేసింది. అయితే ఇప్పుడు మరొక బెంచ్ లో అదే కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారా?, మరొకటి దాఖలు చేశారా అన్నది తెలియదు.
జూన్ 30వ తేదీలోగా వైఎస్ వివేక హత్య కేసు విచారణ పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో, వైఎస్ అవినాష్ రెడ్డి ని కస్టడీలోకి తీసుకొని విచారించడం కీలకం. ఇదే విషయాన్ని సిబిఐ, సుప్రీం కోర్టు దృష్టికి తీసుకువెళ్లాలి. అప్పుడు విచారణకు మరొక నెల పొడిగించే అవకాశాలు ఉంటాయేమోనని ఆయన అన్నారు.
పాజిటివ్ క్రిటిసిజం రిక్వైర్డ్ అన్న న్యాయమూర్తి
వ్యక్తిగత దూషణల కంటే, సానుకూల దృక్పథంతో విమర్శలు చేయడం అవసరమేనని హైకోర్టు న్యాయమూర్తి అభిప్రాయపడ్డారని రఘురామకృష్ణం రాజు వెల్లడించారు. ఈ కేసులో న్యాయమూర్తి వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా మీడియా చర్చా వేదికలలో కొంత మంది మాట్లాడినట్లుగా పేర్కొన్నారు. బెయిలు ఇచ్చే విచక్షణ అధికారం న్యాయమూర్తిదేనని నేను మొదటి నుంచి చెబుతూనే ఉన్నాను. న్యాయమూర్తి అధికారాలను ప్రశ్నించే అర్హత ఎవరికి లేదని స్పష్టంగా వెల్లడించాను. హత్య కేసులో దర్యాప్తు సంస్థ ఎలా విచారణ చేయాలన్న దానిపై కోర్టులకు జోక్యం చేసుకోరాదని మాత్రమే చెప్పాను.
కీలక తీర్పు వెల్లడించిన సుప్రీంకోర్టు
న్యాయమూర్తులపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తే 10 రోజుల జైలు శిక్షను విధించే విధంగా తాజాగా సుప్రీం కోర్టు సంచలన తీర్పును వెల్లడించింది.. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి ఎన్ వి రమణ గారిని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనరాని మాటలు అన్నారు. అజయ్ కల్లాం చేత కూడా అనిపించారు. అప్పటి న్యాయమూర్తి ఎన్వి రమణ గారిపై పై పలు వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ వైయస్ జగన్మోహన్ రెడ్డి సంతకంతో కూడిన పత్రికా ప్రకటనను మీడియాకు విడుదల చేయడం జరిగిందని రఘురామకృష్ణం రాజు గుర్తు చేశారు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి నేరుగా జస్టిస్ ఎన్వీ రమణ గారిపై పై వ్యక్తిగత విమర్శలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి లేఖను రాశారు. జగన్మోహన్ రెడ్డి తో సహా అప్పటి న్యాయమూర్తి ఎన్వి రమణ పై విమర్శలు చేసిన అందరిపై తాజా సుప్రీంకోర్టు తీర్పు స్ఫూర్తితో చర్యలు తీసుకోవాలి. నేను ఎప్పుడూ న్యాయమూర్తులపై వ్యక్తిగత విమర్శలు చేయలేదు…చేయను. చట్టం ప్రకారం, న్యాయ సూత్రాలను అనుసరించి న్యాయమూర్తి తీర్పును ఇస్తారని భావిస్తాను. ఒకవేళ న్యాయమూర్తి ఇచ్చిన తీర్పును ప్రతిఘటించాలనుకుంటే పై కోర్టులో సవాలు చేయాల్సిందే.
దేశం నగుబాటుకు జగన్మోహన్ రెడ్డి ఉన్మాద చర్యలు కారణం కావచ్చు
ఖండాంతరాలలో ప్రధానమంత్రి ఖ్యాతి దశ దిశలా వెలుగొందుతుంటే, దేశం నగుబాటుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్మాద చర్యలు కారణం కావచ్చునని రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు. ఒక పార్లమెంట్ సభ్యుడిని చితకబాదిన ఘటనను మిలిటరీ ఆసుపత్రి ధ్రువీకరించగా, సుప్రీం కోర్టు తన తీర్పులో ఉటంకించింది. ఇప్పటివరకు పార్లమెంట్ ప్రివలేజ్ కమిటీ ఈ ఘటనపై విచారణ చేపట్టలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి అరాచకాలను అమెరికన్ సివిల్ లిబర్టీస్ ఆర్గనైజేషన్ ప్రస్తావించింది.
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ5 మీడియా సంస్థలతోపాటు నాపై 124 A కేసు నమోదు చేసిన విషయం తెలిసింది. ఎల్జి పాలిమర్స్ విషయములో ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని, ప్రభుత్వ తీరును ఎండగడుతూ ఎవరో ఒకరు వాట్సాప్ లో పెట్టిన సందేశాన్ని రంగనాయకమ్మ అనే వృద్ధురాలు ఫార్వార్డ్ చేస్తే ఆమెను సిఐడి పోలీసులు అరెస్ట్ చేసి వేధించారు. నలంద కిషోర్, డాక్టర్ సుధాకర్ లను ప్రత్యక్షంగా పరోక్షంగా వేధింపులకు గురి చేసిన విధానం పసిఫిక్ తీరాన ఉన్నవారి చెవులకు చేరింది .
ఆంధ్ర ప్రదేశ్ లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘన గురించి అమెరికన్ సివిల్ లిబర్టీస్ ఆర్గనైజేషన్ మాట్లాడడం అభినందనీయం. ఆంధ్రప్రదేశ్ సిఐడి పోలీసుల అరాచకం పై, ఆలిండియా మానవ హక్కుల సంస్థ ను నేను రెండు సార్లు కలిశాను. అయినా పట్టించుకోలేదు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల సంఘం కనీసం టైప్ చేసే గుమస్తా కూడా లేని దుస్థితిలో ఉంది . ఇక మానవ హక్కుల ఉల్లంఘనను ఎక్కడ పట్టించుకుంటుంది.
ఆంధ్రప్రదేశ్లో మానవ హక్కుల ఉల్లంఘనల గురించి విదేశీ సంస్థ రాస్తే తెలుసుకోవలసి వస్తుంది. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, అమెరికన్ సివిల్ లిబర్టీస్ ఆర్గనైజేషన్ పై కూడా సిఐడి ద్వారా కేసులు పెట్టి, పిలిపిస్తారా?. మార్గదర్శి సంస్థ ఆస్తులను అటాచ్మెంట్ చేసినట్లుగా, అమెరికన్ సివిల్ లిబర్టీస్ ఆర్గనైజేషన్ ఆస్తులను కూడా అటాచ్మెంట్ చేస్తానంటారా ?
ప్రధాన ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి సెక్యూరిటీని రద్దు చేయాలని కోరినట్లుగానే, అమెరికా సివిల్ లిబర్టీస్ ఆర్గనైజేషన్ ను రద్దు చేయాలని అధ్యక్షుడు జో బైడెన్ కు రాష్ట్ర శాసనసభాపతి లేఖ రాస్తారా అంటూ ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా పార్లమెంట్ ప్రివలేజీ కమిటీ ఏపీ సి ఐ డి మాజీ చీఫ్ సునీల్ కుమార్ అండ్ గ్యాంగ్ ను పిలిచి విచారించాలి. ఆంధ్రప్రదేశ్లో వ్యవస్థలు పనిచేయడం లేదని ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతున్నారు.
పేర్లు పెట్టి వారికి ప్రమోషన్ ఇవ్వద్దు అని అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసి, పత్రికలకు విడుదల చేసిన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చలామణి అవుతున్నారు. కేవలం వాట్సాప్ లో వచ్చిన సందేశాన్ని ఫార్వర్డ్ చేసిన వారిపై కేసులు పెడతారు.
కానీ, అటువంటి వారిపై ఎటువంటి చర్యలు ఉండవు. న్యాయమూర్తిని వ్యక్తిగతంగా దూషించిన వారికి ఎటువంటి నోటీసులు ఉండవు. సుప్రీం కోర్టు తాజా తీర్పు స్ఫూర్తితో మాజీ న్యాయమూర్తి ఎన్వి రమణ గారిపై పై కారు కూతలు కూసిన, కూయించిన, పత్రికలకు ప్రకటనలు విడుదల చేసిన జగన్మోహన్ రెడ్డి తో పాటు ఆయన వందిమాగాదులపై చర్యలు తీసుకోవాలని రఘు రామకృష్ణంరాజు డిమాండ్ చేశారు.