Suryaa.co.in

Andhra Pradesh

జగన్ రెడ్డి దెబ్బ అంటే సీబీఐ అబ్బ అంటోంది

– రాష్ట్రంలో కేసులు దర్యాప్తు చేయాలంటే సీబీఐ భయపడుతోంది
– జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక వివేకా హత్య కేసులో సిబిఐ విచారణకు స్వచ్ఛత లేదు
– వివేకా హత్య కేసు సూత్రధారులెవరో తెలిసినప్పటికీ చర్యలు లేవు
– వివేకాది హత్య కాదు, గుండెపోటు అన్న విజయసాయిరెడ్డిని దర్యాప్తు చేయాలి
విజయసాయి రెడ్డిని సీబీఐ ఎందుకు విచారించలేదు?
– టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య

పాత తెలుగు సినిమాల్లో బాబులు గాడి దెబ్బ అంటే గోల్కొండ అబ్బ అన్నట్లు జగన్ రెడ్డి దెబ్బ అంటే సీబీఐ అబ్బ అంటోందని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య పేర్కొన్నారు. బుధవారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వర్ల రామయ్య మాట్లాడుతూ…

నేడు సీబీఐ రాష్ట్రంలో కేసులు దర్యాప్తు చేయాలంటే భయపడుతోంది. గతంలో సీబీఐకి లోకల్ పోలీసులు భయపడేవారు. నేడు లోకల్ పోలీసులకు సీబీఐ భయపడుతోంది. లోకల్ పోలీసు వ్యవస్ధ సిబిఐకి సహకరించక పోగా సహాయ నిరాకరణ చేస్తోంది. జగన్ రెడ్డి అధికారంలోకి రాక ముందు వరకు అనగా నాలుగు దశాబ్దాల కాలంలో సిబిఐ కేసు దర్యాప్తు చేస్తే లోకల్ పోలీసు వ్యవస్ధ భయపడే పరిస్ధితి ఉండేది. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక సిబిఐ రాష్ట్రంలో కేసులు దర్యాప్తు చేయాలంటే భయపడుతోంది. ఏపీ పోలీసులు సిబిఐ అధికారులపై ప్రైవేటు కేసులు బనాయిస్తున్నారు. సీబీఐపై లోకల్ పోలీసులు ఎప్పుడు ఏ కేసులు పెడతారో, స్థానిక పోలీసు అధికారి ఏ సీబీఐ అధికారిని చేయిపట్టుకొని ఎక్కడ లాక్కెళ్తారో, ఎవరు చార్జి షీట్ పెడతారో అనే భయంలో సిబిఐ ఉంటుంది. దీనికి భాద్యత జగన్ రెడ్డిది కాదా?

జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్ళు గడుస్తున్నా అతని బాబాయి వివేకా హత్య కేసులో సీబీఐ విచారణకు రాష్ట్రంలో స్వచ్ఛత లేదు. వివేకా హత్య కేసు వెనుక సూత్రధారులు ఎవరో సిబిఐకి తెలుసు. సిబిఐ దోషులను పట్టుకోకుండా అడుగడుగునా అడ్డు పడుతోందన్న విషయం ప్రజలందరికి తెలుసు. వివేకా హత్య కేసులో ప్రధాన ముద్ధాయిని అరెస్ట్ చేస్తారన్న ప్రతిసారి జగన్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళుతున్నారు. జగన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళిన ప్రతి సారి ఏం జరుగుతుందో తెలియదు సిబిఐ మాత్రం వివేకా కేసులో వెనుకడుగు వేస్తోంది.

సీబీఐపై కేసులు పెట్టే చరిత్ర ఆంధ్రప్రదేశ్ లో ఎన్నడూ లేదు. నేనుండగా నాదే చట్టం మరో చట్టం లేదని జగన్ ధోరణిగా ఉంది.. రాజకీయ వ్యవస్థ ఈ విధంగా ప్రవర్తిస్తుంటే నేరాల దర్యాప్తు రాష్ట్రంలో ఎలా కొనసాగుతుంది. డబ్బుండి దౌర్జన్యం చేసిన వారే అభివృద్ధి చెందే పరిస్ధితులు తేవాలనుకుంటున్నారు.

ఎంతో మంది మహానుభావులు, ముఖ్యమంత్రులు జైలు జీవితాలు గడిపిన చరిత్ర ఉంది. ఇందిరా గాంధీ 14 సార్లు ప్రధాన మంత్రిగా చేసిన ఉక్కు మహిళను అరెస్ట్ చేసి జైలుకు పంపించిన సంఘటనలు ఉన్నాయి. ఇవన్నీ కాదని నేరస్తులను తప్పించడానికి కొత్త చట్టాలను అమలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి అరెస్టు చేయొద్దని చెబితే సిబిఐ చేయదా? ఏ1 ముద్దాయి జగన్ ని, ఏ2 ముద్దాయి విజయసాయిని ఇంత వరకు సీబీఐ విచారణ చేయలేదు. ముఖ్యమంత్రి ఏమైనా సిబిఐకి అతీతుడా? వివేకా ది గుండెపోటు అని ప్రకటించిన విజయసాయి రెడ్డిని సీబీఐ ఎందుకు విచారించలేదు? అనుమానితుడుగా ఉన్న ఎంపీ అవినాష్ రెడ్డిని ఎందుకు విచారణ చేయలేదు. సామాన్యుడికి న్యాయం జరిగే పరిస్ధితి రాష్ట్రంలో ఉందా అనే అనుమానం కలుగుతోంది.

గతంలో ఎంతో పటిష్టమైన కేసులను దర్యాప్తు చేసిన చరిత్ర సిబిఐకి ఉంది. కడప సెంట్రల్ జైలులో ఉన్న గెస్ట్ హౌస్ లో సీబీఐ బస చేస్తుందంటే వారిని ఏ విధంగా భయబ్రాంతానికి గురిచేస్తున్నారో అర్థమవుతుంది. వివేకా హత్య కేసు మూలంగా వాళ్ళ ప్రతిష్టని వారు పోగొట్టుకోకూడదు. వివేకా హత్య కేసును చేధించ లేకపోతే సిబిఐకి భవిష్యత్తు ఉండదు. సీబీఐ డైరెక్టర్ వివేకా కేసుకు సంబంధించి చర్చ జరిపించాలి. సీబీఐ విచారణ గురించి న్యాయస్థానం కూడ సమీక్ష జరిపించాలి. ఈ కేసును ఇలానే నీరు గారిస్తే ప్రజలలో సీబీఐ, న్యాయస్ధానం, ప్రజాస్వామ్య పరిపాలన, రాజ్యాంగం మీద నమ్మకం పోయే పరిస్ధితులు ఎదురవుతాయి. బయట గెస్ట్ హౌస్ లలో సీబీఐ అధికారులు ఉండాలన్నా భయపడే పరిస్ధితి నెలకొంది. నేరస్థులకు లోకల్ పోలీస్ అండగా ఉండడం ఇదెక్కిడి చోద్యం?

రాష్ట్రంలోని ప్రతి వ్యక్తి కూడా వివేకానందరెడ్డిని హత్య చేసిందెవరో తెలుసుకోవాలని తాపత్రయ పడుతున్నారు. ఇదివరకు జగన్ కూడా ఆసక్తి కనబరిచారు. మా బాబాయిని చంపిందెవరో తేల్చాలని కోర్టులో కేసు వేశారు. ఆ తరువాత ఎందుకో ఆయన ఆసక్తి కనబరచలేదు. ప్లేటు ఫిరాయించడంలో మతలబేమిటో తెలియదు. వివేకానందరెడ్డి కుమార్తె సునీత తన తండ్రిని చంపిన నేరస్థుల భరతం పట్టాలని కోర్టుల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది. వివేకానందరెడ్డి కుమార్తె, అల్లుడు, డ్రైవర్ దస్తగిరి లు మాకు ప్రాణహాని ఉందనడం ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతోంది.

వివేకాను హత్యచేసిన అసలు నేరస్థులను పట్టుకోవడంలో పోలీసులు సీబీఐకి సహకరించమని డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డి సూచించాలి. అసలైన ముద్దాయిలను పట్టుకొని.. సీబీఐ డైరెక్టర్ సమీక్షలు జరిపి ఈ కేసును వీలైనంత తొందరగా ఓ కొలిక్కి తేవాలి. ముఖ్యమంత్రిపై కూడా తన బాబాయిని హత్య చేసినవారిని గుర్తించి శిక్ష పడేలా చేయాల్సిన బాధ్యత ఉంది. కావున రాష్ట్ర పోలీసులకు సూచించాల్సిన అవసరముంది. న్యాయాన్ని చంపొద్దు, ధర్మాన్ని హత్య చేయొద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నానని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య వివరించారు.

LEAVE A RESPONSE