-అమరావతిని సర్వనాశనం చేయడానికి కుట్రలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి సర్కార్
-సుప్రీంకోర్టు పూర్తి స్థాయి స్టే ఇవ్వనప్పటికీ, స్టే లాంటి ఆర్డర్ నే ఇచ్చింది
-హైకోర్టు తీర్పుకు సవరణ చేసిన సుప్రీం కోర్టు… పట్టాలలో లబ్ధిదారులకు థర్డ్ పార్టీ హక్కు కల్పించరాదని స్పష్టం
-ఈ తీర్పు ఆశించినది కాకపోయినా… రైతులకు మాత్రం ఆశాభంగం కాలేదు
-వైఎస్ వివేకా హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి ఆయన సతీమణిని సీబీఐ విచారించాలి
లేకపోతే రాష్ట్ర ప్రజలు, న్యాయ స్థానం ఊరుకోదు
-వివేకా మరణ వార్త ఆరోజు ఉదయం 6.15 గంటలకు తెలిసిందని నాలుగేళ్ళుగా అందరూ చెబుతుంటే, నాకు నాలుగున్నర గంటలకే తెలుసునని జగన్ ఇప్పటి వరకు ఎందుకు చెప్పలేదు?
-నాలుగున్నర గంటలకు వివేక మరణించారని జగన్మోహన్ రెడ్డికి చెప్పిన ఆ అదృశ్య వ్యక్తి ఎవరు?
-అవినాష్ రెడ్డిని గట్టిగా ప్రశ్నిస్తే అసలు విషయం బయటకు వస్తుందని తనని తాను రక్షించుకోవడానికి ఆరాటపడుతోన్న జగన్
-చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లను విమర్శించడం ఎందుకు?, వారిని లేపి తన్నించుకోవడం అవసరమా?
-నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు
రాష్ట్ర రాజధాని అమరావతిని సర్వనాశనం చేయడానికి జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఎన్ని కుట్రలు చేయాలో, అన్ని కుట్రలను చేస్తోంది. పేదలను అడ్డం పెట్టుకొని వికృత మనస్తత్వం కలిగిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వికృతి చేష్టలను చేస్తున్నారు. పచ్చి అబద్దాలను చెబుతూ, ప్రజలను మభ్యపెడుతున్నారు. ఇప్పటికే అతనికి ఒక అవకాశం ఇచ్చి ఒక తప్పు చేశాం. సరిదిద్దుకోవడానికి మరొక అవకాశం ఉంది. ప్రజలంతా తాము చేసిన తప్పును సరి దిద్దు కోవాలని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు కోరారు.
బుధవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… అమరావతి రైతులకు కచ్చితంగా న్యాయం జరుగుతుందని, స్టే లభిస్తుందని ఆశా భావం వ్యక్తం చేశారు. అయితే వాదనలు ముగిసిన తరువాత సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై రఘురామకృష్ణం రాజు స్పందిస్తూ… ఇది పూర్తిస్థాయి స్టే కాకపోయినప్పటికీ, సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ఒక విధంగా స్టే లాంటిదేనని అభిప్రాయపడ్డారు.
రైతులు ఆశించిన తీర్పు కాకపోయినాప్పటికీ, వారికి ఆశాభంగం జరగలేదన్నారు. హైకోర్టు ఇచ్చిన తీర్పుకు, సుప్రీం కోర్టు సవరణలు చేస్తూ, రాజధాని ప్రాంతంలో ఇచ్చే ఇళ్ల స్థలాల పట్టాల పై లబ్ధిదారులకు థర్డ్ పార్టీ హక్కు కల్పించరాదని స్పష్టం చేసింది. సుప్రీం కోర్టును రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాదులు తప్పుదారి పట్టించారు. డబ్బుల కోసం కక్కుర్తి పడి, సీనియర్ న్యాయవాదులు కోర్టును తప్పుదారి పట్టించిన తీరు చూస్తే అసహ్యం వేస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలను వినిపించిన సీనియర్ న్యాయవాది అభిషేక్ సింగ్ మన్వి ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రాజధాని ప్రాంతంలో ఐదు శాతం భూములు కేటాయించాలని నిర్ణయించినప్పటికీ, కేవలం తమ ప్రభుత్వం మూడున్నర శాతం భూములను మాత్రమే కేటాయిస్తోందంటూ, రాజధాని ప్రాంతంలో ఏర్పాటు చేసిన జోన్ల గురించి ప్రస్తావించకుండా న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారు.
రాజధాని తరపు రైతుల తరఫున శ్యామ్ దివాన్ అద్భుతమైన వాదనలను వినిపించారు. అమరావతి మాస్టర్ ప్లాన్, నవ నగరాల నిర్మాణం. నవ నగరాల నిర్మాణంలో భాగంగా ఎలక్ట్రానిక్ సిటీ నిర్మిస్తే, స్థానికంగానే మూడు లక్షల ఉద్యోగాలు భూములు ఇచ్చిన రైతు బిడ్డలకు వస్తాయని, ఇక్కడే రైతులకు ఇళ్ల స్థలాలు కేటాయించడం జరుగుతుందన్న కాన్సెప్ట్ ను చూసి రైతులు ముందుకు వచ్చి రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చారని చెప్పారు. ఎలక్ట్రానిక్ సిటీని మింగేసి ఆ ప్రాంతంలోనే నివాసాలన్నీ వచ్చేలా చూడడం వాస్తవ మాస్టర్ ప్లాన్ కు విరుద్ధం. ఏ సిటీకి ఆ సిటీలో ఐదు శాతం భూములను ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కేటాయించాలని నిర్ణయించారని శ్యామ్ దివాన్ న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు.
అయితే ఇళ్ల స్థలాల పంపిణీ కోసం మే 7వ తేదీని లేఅవుట్ పూర్తయిందని ప్రభుత్వం పేర్కొనడం జరిగింది. ప్రభుత్వం చెప్పిన అబద్ధాలను న్యాయస్థానం వింటుందా?, రైతులు చెబుతున్న వాస్తవాలను గమనిస్తుందా? అన్నది చూడాలి. జులై 11వ తేదీన కొత్త బెంచ్ వాదనలు వినే వరకు స్టే లభిస్తుందని రఘురామకృష్ణం రాజు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. దీనితో జగన్ అండ్ కంపెనీ ఆటలకు తాత్కాలికంగా బ్రేక్ పడుతుందని ఆయన అన్నారు.
భార్యాభర్తలను సీబీఐ విచారించాల్సిందే…
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఆయన సతీమణి వైయస్ భారతీ రెడ్డిని సిబిఐ విచారణకు పిలవాలి. లేకపోతే ప్రజలు, న్యాయస్థానం ఊరుకోదు. అలాగే, జగన్మోహన్ రెడ్డి తో అప్పటికే సమావేశం అయి ఉన్న ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కూడా విచారణకు పిలవాలి. ఈ కుట్రలో ఎవరు ఉన్నారన్నది అందరికీ అర్థమయిపోయింది. వైయస్ వివేకానంద రెడ్డి మరణ వార్త ఉదయం ఆరు గంటల 15 నిమిషాలకు ప్రపంచానికి తెలిసిందని గత నాలుగేళ్లుగా అందరూ చెబుతుంటే , నాలుగున్నర గంటలకే తనకు తెలుసునని జగన్మోహన్ రెడ్డి చెప్పాలి కదా?.
ఆయనకు ఆ సమాచారాన్ని ఎవరు చేరవేశారో… వారి పేరును కూడా ప్రస్తావించాలి కదా? అలా చెప్పకపోవడమనేది నేరం. జగన్మోహన్ రెడ్డి ఎంతగా మేనేజ్ చేసినా, ఎవరి కాళ్ళను పట్టుకున్న సిబిఐ అధికారులు ఆయన్ని విచారణకు పిలవాలి. అజయ్ కల్లం ను సిబిఐ విచారణకు పిలిచిందో లేదో చెప్పాలి. పిలిస్తే ఆయన ఏమి చెప్పారో చెప్పాలి. పిలవకపోతే ఎందుకు పిలవలేదు కూడా సిబిఐ వివరించాలి.
ఈ కేసులో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విచారిస్తే, ఆయన కూడా నిజాలనే చెబుతారు. అబద్ధం చెప్పాల్సిన అవసరం ఆయనకు ఏమి ఉంటుంది. వైఎస్ వివేకానంద రెడ్డి మరణ వార్త నాలుగున్నర గంటలకు జగన్మోహన్ రెడ్డికి తెలిసినప్పుడు, విస్తృత కుట్ర కోణం గురించి విచారించాలన్న కోర్టు ఆదేశాలకు, తగిన ఆధారం లభించినట్లయింది. ప్రజల కోసం తల్లిని చెల్లిని వదులుకున్న త్యాగధనుడైన జగన్మోహన్ రెడ్డి, తన తండ్రి సవతి తమ్ముడి కుమారుడైన అవినాష్ రెడ్డి ని కాపాడేందుకు పార్టీని కూడా త్యాగం చేస్తుండడం ఆశ్చర్యకరంగా ఉంది.
సొంత రక్త సంబంధం కాకపోయినా, భార్య తరపు రక్త సంబంధం… కజిన్ రక్తసంబంధాన్ని కాపాడేందుకు ఇదంతా చేస్తున్నారా? అంటే కానే కాదు. తనని తాను రక్షించుకోవడం కోసమే ఇదంతా చేస్తున్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగిన రోజు ఉదయం 4:30 గంటలకు ఎవరికి ఫోన్ చేశావని వైఎస్ అవినాష్ రెడ్డి ని గట్టిగా అడిగితే, వైయస్ జగన్మోహన్ రెడ్డి దంపతులకు ఫోన్ చేశానని చెబితే పరిస్థితి ఏమిటి? అన్నది జగన్మోహన్ రెడ్డికి అంతు చిక్కడం లేదని రఘురామకృష్ణం రాజు అన్నారు.
నారా సుర రక్త చరిత్ర అని ఎందుకు రాశారు?
వైఎస్ వివేకానంద రెడ్డి గుండెపోటుతో మరణించారని అదే రోజు ఉదయం 7:45 నుంచి 8:30 గంటల మధ్యలో ఏడుపు ముఖంతో విజయసాయి రెడ్డి మీడియాకు చెప్పారు. అయినా, సాక్షి దినపత్రికలో మాత్రం నారాసుర రక్త చరిత్ర అని ఎందుకు రాశారు. వైఎస్ వివేకను దారుణంగా హత్య చేసినప్పటికీ, గుండెపోటుతో మరణించారని సాక్షి మీడియా పదే పదే ఎందుకు చెప్పాల్సి వచ్చింది.
ఇదంతా పెద్ద కుట్ర … జగన్మోహన్ రెడ్డి కి ముందే తెలుసని అనుమానించడంలో తప్పేముంది?. ఇదే విషయంపై అన్ని విషయాల గురించి మాట్లాడే సకల శాఖామంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి వివరణ ఇస్తే బాగుంటుంది. అలాగే జగన్మోహన్ రెడ్డికి తన బాబాయి మరణ వార్త తెలిసే సమయానికి ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజయ్ కల్లం, అక్కడ లేరని చెప్పండి. ఆంధ్రప్రదేశ్ లో మన పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాతే ఆయనకు ఒక ఉద్యోగం ఇచ్చామని చెబుతారా… చెప్పండి అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి కి రఘురామకృష్ణం రాజు సలహా ఇచ్చారు.
ఇప్పుడు వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు కొత్త పుంతలు తొక్కుతుంది. చిత్తశుద్ధి చూపిస్తున్నట్లు కనిపిస్తున్న సిబిఐకి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఈనెల 19వ తేదీన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్టు ఖాయం. దేశ రాజకీయాలలోనే అత్యంత సంపన్నుడైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు.
ఎలాగైనా ఈ కేసు నుంచి తప్పించుకోవాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నట్లుగానే, తన తండ్రి హత్య కేసులో నిందితులకు జైలు శిక్ష పడాలని డాక్టర్ వైఎస్ సునీత న్యాయపోరాటం చేస్తున్నారు. స్వీయ రక్షణ కోసం జగన్మోహన్ రెడ్డి ఆరాటపడుతుండగా, ప్రజల ఆశీస్సులతో పోరాడుతున్న వైఎస్ సునీత దే అంతిమ విజయమని రఘురామకృష్ణం రాజు అన్నారు.
క్షీణించిన మా పార్టీ గ్రాఫ్
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణలో భాగంగా అజయ్ కల్లం నిజం చెప్పిన తర్వాత తమ పార్టీ గ్రాఫ్ బాగా క్షీణించిపోయింది. అయినా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం తెలుగుదేశం పార్టీ ఐసీయూలో ఉందని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉంది. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నిర్వహిస్తున్న సభలకు జనం తండోపతండాలుగా తరలి వస్తున్నారు.
మా ప్రభుత్వం నిర్వహించే సభలకు, చివరకు యజ్ఞ, యాగాదులకు కూడా జనం కరువయ్యారు. ప్రజాధనం 12 కోట్ల రూపాయలు వెచ్చించి నిర్వహించిన యాగానికి ప్రజలు హాజరు కాకపోవడం పరిశీలిస్తే, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కావడం ఎవరికి ఇష్టం లేదన్న విషయం స్పష్టం అవుతోంది.
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిర్వహిస్తున్న యువ గళం పాదయాత్ర 101 వ రోజు జనం రద్దీ ఎక్కువై తొక్కిసలాట జరిగింది. అదే మన పార్టీ ఎమ్మెల్యే ఒక గ్రామానికి వస్తున్నారని తెలిసి ఆ గ్రామస్తులంతా మూకుమ్మడిగా ఇళ్లకు తాళాలు వేసుకుని వెళ్లిపోయారు. పవన్ కళ్యాణ్ గురించి జగన్మోహన్ రెడ్డి హేళనగా మాట్లాడారు .
అయితే, పాపం పసివాడని జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో ఒక ట్వీట్ చేయగా, దానికి బాక్స్ బద్దలై పోయేలా ఎంతో ప్రజాదరణ కనిపించింది. కంటెంట్ ఉన్నవాడు రోజు ప్రజల ముందుకొచ్చి మాట్లాడవలసిన అవసరం లేదు. ఒక్క ట్వీట్ ద్వారా జగన్మోహన్ రెడ్డి చేసిన విమర్శలు అన్నింటికీ పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పారు. అయినా, పడుకున్న వారిని లేపి తన్నించుకోవడం ఎందుకని జగన్మోహన్ రెడ్డిని రఘు రామ కృష్ణంరాజు ప్రశ్నించారు.
19వ తేదీన తధ్యంగా కనిపిస్తున్న అవినాష్ రెడ్డి అరెస్ట్
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఈనెల 19వ తేదీన కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి అరెస్ట్ తధ్యంగా కనిపిస్తోంది. వైయస్ అవినాష్ రెడ్డికి కొండంత అండగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నారని ఇన్నాళ్లు మనం అనుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజయ్ కల్లం చెప్పిన నిజం విన్న తర్వాత, జగన్మోహన్ రెడ్డి తనని తాను రక్షించుకునేందుకే ప్రయత్నిస్తున్నట్లు స్పష్టమవుతోందని రఘురామ కృష్ణంరాజు అన్నారు.
ఆంధ్రజ్యోతి దినపత్రికలో రాధాకృష్ణ రాసినట్లుగా జగన్మోహన్ రెడ్డికి ఆయన బాబాయి మరణ వార్త తెల్లవారుజామునే తెలిసిందని అజయ్ కల్లం చెప్పుకొచ్చారు. ఉదయం నాలుగు నుంచి నాలుగున్నర గంటలకే వైయస్ వివేకానంద రెడ్డి గుండెపోటుతో మరణించారని, జగన్మోహన్ రెడ్డి కి సమాచారం ఇచ్చిన అదృశ్య వ్యక్తి ఎవరు?, ఆయనకు వైఎస్ వివేక మరణించిన విషయం ఎలా తెలిసింది.
ఎందుకంటే ఆ రోజు ఉదయం 6 గంటలకు లచ్చమ్మ వైఎస్ వివేకానంద రెడ్డి ఇంటికి చేరుకున్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి వ్యక్తిగత సహాయకుడు కృష్ణారెడ్డి ఉదయం ఆరు గంటల 15 నిమిషాలకు ఆయన ఇంటికి చేరుకోగా, అప్పటికి వైఎస్ వివేకానంద రెడ్డి నిద్ర లేవలేదు. ఇదే విషయాన్ని ఆయన భార్యకు ఫోన్ చేసి చెప్పారు. నిద్ర లేపమని వైయస్ వివేకానంద రెడ్డి సతీమణి చెప్పడంతో, వారు ఇంట్లోకి ప్రవేశించారు. దీనితో వైఎస్ వివేకానంద రెడ్డి మరణించిన విషయం ప్రపంచానికి తెలిసింది.
ఈ విషయం తెల్లవారుజామునే జగన్మోహన్ రెడ్డికి తెలిసిందని అజయ్ కల్లం చెప్పడం పరిశీలిస్తే, తెల్లవారుజామున అంటే మార్చి మధ్య మాసంలో ఉదయం 6:15 గంటలకయితే కాదు. సూర్యోదయానికి ముందే తెల్లవారుజాము అంటారు. అంటే ఉదయం 5 గంటల లోపే జగన్మోహన్ రెడ్డికి ఆయన బాబాయి మరణ వార్త తెలిసిందని స్పష్టమవుతుంది.
అదే రోజు ఉదయం ఆరు గంటల 25 నిమిషాలకు జమ్మలమడుగు కు వెళుతున్న తనకు ఫోన్ రావడం వల్లే తాను వైఎస్ వివేక ఇంటికి వెళ్లానని ఎంపీ అవినాష్ రెడ్డి చెబుతున్నారు. కానీ కథ ఇక్కడే అడ్డం తిరిగింది. వైఎస్ వివేకానంద రెడ్డి మరణించినట్లుగా ఉదయం 4:30 నుంచి 5 గంటల మధ్యే జగన్మోహన్ రెడ్డికి తెలిసింది. ప్రపంచానికంతా ఉదయం 6:15 కి తెలిస్తే, జగన్మోహన్ రెడ్డికి 5 గంటలకే తెలియడానికి ఆయనకేమైనా దివ్యదృష్టి ఉందా?, లేకపోతే రాత్రి ఎవరైనా కలలోకి వచ్చి చెప్పారా? అంటూ రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు.
అగ్రజుడి ఆజ్ఞతో కడపకు… సుప్రీంకోర్టులో సరికొత్త పిటిషన్
అగ్రజుడి ఆజ్ఞతో కడపకు వెళ్లిపోయిన ఎంపీ అవినాష్ రెడ్డి విచిత్రమైన ప్రతిపాదనతో సుప్రీంకోర్టుకు వచ్చారు. నేను హైకోర్టు వెకేషన్ బెంచ్ లో కేసు వేయాలనుకుంటున్నాను చెప్పిన ఆయన హైకోర్టు వెకేషన్ బెంచ్ లో కేసు వేయకుండా, సుప్రీం కోర్టులో మెన్షన్ చేయడం ఆశ్చర్యాన్ని కలిగించింది.
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి బెంచ్ లో 131 మెన్షన్లు రాగా, అవినాష్ రెడ్డి అభ్యర్థనను కూడా మెన్షన్ చేశారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ అరెస్టు చేస్తామని చెప్పి, మాటలకే పరిమితం అవుతున్న, న్యాయస్థానాలలో మాత్రం వారికి కచ్చితంగా ఎదురుదెబ్బ తగిలింది. హైకోర్టులో ఒక బెంచ్ లో కేస్ పెండింగ్ లో ఉంది. అయినా అరెస్టు చేయాలంటే చేసుకోండని జూన్ 5వ తేదీ తరువాతే తాను తీర్పు ఇస్తానని న్యాయమూర్తి స్పష్టం చేయడం జరిగింది.
ప్రస్తుతం వెకేషన్ బెంచ్ కేస్ టేక్ అప్ చేసే పరిస్థితి లేదు. దీనితో, వైయస్ అవినాష్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఒకవేళ టేక్ అప్ చెయ్ అని అంటుందేమోనని ఆశతోనే, మెన్షన్ చేశారు. ఒకవేళ సుప్రీంకోర్టు ఆర్డర్ ఇస్తే, సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిందని, వెకేషన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడానికి ఒక ప్రయత్నం చేశారు. కానీ సుప్రీం కోర్టులో విచారణకు వచ్చే అవకాశమే లేదని రఘురామకృష్ణం రాజు వివరించారు.