Suryaa.co.in

Telangana

సాయి గణేష్ ఆత్మహత్యపై సీబీఐ విచారణ జరపాల్సిందే

త్మహత్యకు కారకులైన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు
బీజేపీ లీగల్ సెల్ నాయకులతో బండి సంజయ్ భేటీ
రేపు ఖమ్మం, రామాయంపేటకు లీగల్ సెల్ నిజనిర్దారణ కమిటీ పయనం

టీఆర్ఎస్ నేతల, పోలీసుల వేధింపులు ఆత్మహత్య చేసుకున్న ఖమ్మం పట్టణానికి చెందిన సాయిగణేష్ ఘటనపై సీబీఐ విచారణ జరపాలని బీజేపీ లీగల్ సెల్ డిమాండ్ చేసింది. ఈ ఆత్మహత్య వెనుక టీఆర్ఎస్ పెద్దల, పోలీసుల ప్రమేయం ఉన్నందున రాష్ట్ర పోలీసులు చేస్తున్న విచారణపై తమకు నమ్మకం లేదని స్పష్టం చేసింది. పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర నాయకులతో వేముల సమీపంలోని పాదయాత్ర లంచ్ శిబిరంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ భేటీ అయ్యారు. సాయి గణేష్ ఆత్మహత్యతోపాటు రామాయంపేటలో టీఆర్ఎస్ నేతల వేధింపులు భరించలేక సూసైడ్ చేసుకున్న తల్లీకొడుకుల అంశంపై చర్చించారు. దీంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులు, టీఆర్ఎస్ బెదిరింపులపై చట్ట, న్యాయపరంగా తీసుకోవాల్సిన అంశాలపై చర్చించారు.

సాయి గణేష్ ఆత్మహత్యపై వాస్తవాలను తెలుసుకుని న్యాయ పోరాటం చేయాలని, అందులో భాగంగా నిజ నిర్దారణ కమిటీ ఖమ్మం పట్టణానికి వెళ్లాలని సూచించారు. రాష్ట్రంలో బీజేపీకి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేని టీఆర్ఎస్ నేతలు దాడులు, బెదిరింపులతో రాష్ట్రవ్యాప్తంగా కాషాయ పార్టీ కార్యకర్తలను భయపెట్టాలని చూస్తోందని, దీనికి ధీటుగా ఎదుర్కొనేందుకు న్యాయపరమైన పోరాటం కూడా చేయాల్సిన అవసరం ఉందన్నారు.

తద్వారా కార్యకర్తల్లో భరోసా నింపాలన్నారు. సమావేశానంతరం లీగల్ సెల్ రాష్ట్ర కన్వీనర్ రవీంద్ర విశ్వనాథ్ మీడియాతో మాట్లాడుతూ…. ‘‘బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ పిలుపు మేరకు ఇక్కడికి వచ్చాం. ఖమ్మంలో సాయి గణేష్ తోపాటు రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలపై టీఆర్ఎస్ నేతలు చేస్తున్న దాడుల విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించాం. టీఆర్ఎస్ ప్రోద్బలంతో పోలీసులు సాయి గణేష్ పై అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురి చేయడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారాన్ని దుర్వినియోగం చేస్తోంది. బీజేపీ ఎదుగుదలను చూపి ఓర్వలేక కార్యకర్తలను భయపెట్టి వేధించాలని చూస్తోంది. పోలీసులు అందులో భాగం కావడం బాధాకరం’’అని అన్నారు.

‘‘ఈ సందర్భంగా మేం పోలీసులను హెచ్చరిస్తున్నాం. రాబోయే రోజుల్లో బీజేపీ అధికారంలోకి రాబోతోంది. టీఆర్ఎస్ అడుగులకు మడుగులొత్తాల్సిన అవసరం లేదు. నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. లేనిపక్షంలో పోలీసులపై లీగల్ యాక్షన్ తీసుకుంటాం’’అని పేర్కొన్నారు.

‘‘సాయి గణేష్ ఆత్మహత్యకు గల కారణాలపై సీబీఐ విచారణ జరపాలి. దీని వెనుక ఎవరి హస్తం ఉంది? ఎవరు ప్రోద్భలం ఉంది? పోలీసుల పాత్ర ఏమిటనే అంశాలు అప్పుడు మాత్రమే వెలుగులోకి వస్తాయి. దీని వెనుక ఎంత పెద్ద వారున్నా బయటకు లాగుతాం. చట్టపరంగా శిక్షఫడేలా న్యాయ పోరాటం చేస్తాం. అవసరమైతే హైకోర్టు, సుప్రీంకోర్టు దాకా వెళతాం. ఈ అంశంపై అవసరమైతే హైకోర్టు, సుప్రీంకోర్టు దాకా వెళతాం’’అని స్పష్టం చేశారు.

‘‘బీజేపీ కార్యకర్తలను వేధించే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అవసరమైతే ఎక్కడికక్కడ ఫిర్యాదులు చేయడంతోపాటు లీగల్, చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. సాయి గణేష్ మ్రతి వెనుక వాస్తవాలను తెలుసుకునేందుకు లీగల్ సెల్ ఆధ్వర్యంలో నిజ నిర్దారణ కమిటీ ఖమ్మం పట్టణానికి వెళుతుంది. వాస్తవాలు సేకరించి న్యాయ పరమైన పోరాటం చేస్తాం. రామాయంపేటలోనూ తల్లీకొడుకుల బలవన్మరణానికి వెనుకనున్న కారణాలను తెలుసుకునేందుకు సైతం నిజనిర్దారణ కమిటీ వెళుతుంది’’అని తెలిపారు.

ఈ సమావేశంలో లీగల్ సెల్ జాయింట్ కన్వీనర్ రామారావు, సీనియర్ అడ్వోకేట్లు ఆంటోనీ రెడ్డి, నాగూరావు నామోజీ, కరుణా సాగర్, క్రిష్ణారావు, అరవింద్ రెడ్డి, శశిధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE