* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అండగా ఉంటాయి
* జరిగిన పంట నష్టాన్ని ప్రత్యక్షంగా చూశాను
– కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్
* కేంద్ర మంత్రి ముందు తమ గోడును వెళ్ళబోసుకున్న రైతులు
కేసరపల్లి: రైతులు ఆత్మ స్థైర్యం కోల్పోవద్దని, ధైర్యంగా ఉండాలని, జరిగిన పంట నష్టం పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అండగా ఉంటాయని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రైతులకు హామీ ఇచ్చారు.
శుక్రవారం ఉదయం ఆయన గన్నవరం మండలంలోని కేసరపల్లిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న వరి పంట పొలాలను పరిశీలించి, ఎస్ వి ఎల్ లైలా గ్రీన్ మెడోస్ ప్రవేశ మార్గంలోని తోరణం వద్ద రైతులతో ముఖాముఖి మాట్లాడారు.
ముందుగా ఆయన, కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, గన్నవరం నియోజకవర్గ శాసన సభ్యులు యార్లగడ్డ వెంకట్రావు, రాజమండ్రి పార్లమెంటు సభ్యులు దగ్గుబాటి పురంధరేశ్వరి, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు వై సత్యనారాయణ చౌదరి, రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి బి రాజశేఖర్, రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఎస్ ఢిల్లీ రావు, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లా పోలీసు అధికారి ఆర్. గంగాధర్ రావు లతో కలిసి ముంపు బారిన పడిన పంట పొలాలను పరిశీలించి రైతులతో ముఖాముఖి మాట్లాడారు.
ఈ క్రమంలో కేసరపల్లి గ్రామానికి చెందిన పలగాని శ్రీనివాసరావు మంత్రి ముందు తన గోడును వెళ్ళబోసుకుంటూ తాను 30 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని ఎంటీయు 1318, ఎంటీయు 1061 వరి రకాలను సాగు చేశానని, అయితే నడుములోతు బుడమేరు వరదతో పంట పూర్తిగా మునిగిపోయి కుళ్ళిపోయిందని వేదనతో వరి దుబ్బులను మంత్రికి చూపించాడు.
సాధారణంగా ఎకరానికి 35 నుంచి 40 బస్తాల దిగుబడి వస్తుందని, పెట్టుబడి పోను ఎకరానికి రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు ఆదాయం వస్తుందని రైతు తెలిపారు. భూయజమానికి ఎకరానికి రూ.15 వేలు కౌలు ముందుగానే చెల్లిస్తామన్నారు.
అదేవిధంగా మరో రైతు చదలవాడ కృష్ణారావు మాట్లాడుతూ తాను 10 ఎకరాలను కౌలుకు తీసుకుని వరి సాగు చేస్తున్నానని, పంట మొత్తం వరదలకు పూర్తిగా నీట మునిగి నష్టపోయానని రోదించాడు. తనకు ఇద్దరు ఆడపిల్లలని, పంటలు నష్టపోయి రోడ్డున పడ్డానని, ఎలాగైనా తమను ఆదుకోవాలని కోరారు. విత్తనాలు, ఎరువులు ఇన్పుట్ సబ్సిడీని అందించాలని కోరారు. మంత్రి రైతును అక్కున చేర్చుకుని అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు. పిదప జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పంటల నష్టంపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ తిలకించారు.
అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు జిల్లాలో భారీ వర్షాలు, వరదల కారణంగా మునిగిపోయి దెబ్బతిన్న పంటలను పరిశీలించి జరిగిన నష్టాన్ని కేంద్ర ప్రభుత్వానికి నివేదించేందుకు వచ్చానని తెలిపారు.
జిల్లాలో ఎక్కువగా వరి, అరటి, పసుపు, కంద, తమలపాకు, కూరగాయలు తదితర పంటలు తొమ్మిది రోజుల పాటు నీట మునిగి ఎక్కువ మొత్తంలో నష్టం వాటిల్లిందని తెలిపారు.
తానూ రైతు కుటుంబాన్నించి వచ్చానని, రైతు కష్టాలపై అవగాహన ఉందని అన్నారు. పొలాల్లోని నీరు నాలుగైదు రోజుల్లో బయట పోయి ఉంటే పంట దక్కేందుకు అవకాశం ఉండేదని, కానీ 9 రోజుల పాటు పూర్తిగా నీట మునిగి నష్టపోయిన పంటలను ప్రత్యక్షంగా చూశానన్నారు.
వరదల ప్రభావం రైతులపై ప్రత్యక్షంగా పడిందని, దేశ ప్రధానితో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతులను అన్ని విధాల ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నారని, రైతులు ఆందోళన చెందొద్దని ధైర్యం చెప్పారు.
సొంత భూమి కలిగిన రైతులతో పాటు కౌలు రైతులను ఆదుకునే దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంగా అడుగులు ముందుకు వేస్తున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్న రూ.3,400 కోట్ల ఎస్ డి ఆర్ ఎఫ్ (స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్) నిధులతో రైతులకు తాత్కాలిక తక్షణ ఉపశమన చర్యలు తీసుకుంటామన్నారు.
గత ప్రభుత్వం ఫసల్ బీమా యోజన పథకానికి సంబంధించిన ప్రీమియం చెల్లించకపోవడంతో ప్రస్తుతం అందుకు రైతులు పరిహారాన్ని పొందడానికి అవకాశం లేకుండా పోయిందని, దీనిపై తీసుకోవలసిన చర్యలపై రాష్ట్ర ప్రభుత్వంతో ఇప్పటికే చర్చించినట్లు తెలిపారు.
ప్రస్తుత వరద నీరు తగ్గిపోయాక రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు ఇన్పుట్ సబ్సిడీ అందిస్తామన్నారు. ఇప్పటికే బ్యాంకుల నుంచి రుణం తీసుకున్న రైతుల విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తామన్నారు. రైతులకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వ పథకాలతో రైతులకు కచ్చితంగా న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు.
కార్యక్రమంలో ముందుగా ఆయన సభ వద్ద రైతులతో ముఖాముఖి మాట్లాడారు. కేసరపల్లి గ్రామానికి చెందిన సీతారామయ్య మాట్లాడుతూ పేద కుటుంబానికి చెందిన తాను 10 ఎకరాలను కౌలుకు తీసుకొని ఎంటీయు 1318 రకం వరి సాగు చేశానన్నారు. వరి నాట్లు వేసి 60 రోజులు అయిందని, ప్రస్తుతం చేలు చిరుపొట్ట దశలో ఉండగా ఈ లోపు బుడమేరు వరద ముంచెత్తి పంటను పూర్తిగా నాశనం చేసిందని వివరించారు. ఇప్పటికీ ఎకరానికి 25 వేల రూపాయలు ఖర్చు చేశానని, భూయజమానికి ఎకరానికి 15 బస్తాలు లెక్కన కౌలు ముందుగానే చెల్లించాల్సి ఉంటుందని రైతు మంత్రికి తెలిపారు.
అదే గ్రామానికి చెందిన మరో రైతు ఎడ్లపల్లి సాంబశివరావు మాట్లాడుతూ 40 ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి పంట సాగు చేశానన్నారు. బుడమేరు వరదలతో 70 రోజుల పంట పూర్తిగా నీట మునిగి నష్టం వాటిల్లిందని, కౌలు ఎకరానికి రూ.15 వేలు చెల్లిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారిణి ఎన్ పద్మావతి, ఏపీ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయలక్ష్మి, ఉద్యానవన శాఖ డైరెక్టర్ కె శ్రీనివాసరావు, ఇతర అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.