– ఆంక్షలు, అరెస్ట్‌లతో భయపెట్టేందుకు ప్రయత్నించిన ప్రభుత్వం
– అయినా స్వచ్ఛందంగా పాల్గొన్న విద్యార్ధులు, యువత, ప్రజానీకం
– పెల్లుబికిన ప్రజాగ్రహంతోనైనా చంద్రబాబు కళ్ళు తెరవాలి
– మాజీ మంత్రి విడదల రజని డిమాండ్
తాడేపల్లి : ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైయస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైయస్ జగన్ పిలుపు మేరకు నిర్వహించిన ఛలో మెడికల్ కాలేజ్ కార్యక్రమం విజయవంతం అయిందని మాజీ మంత్రి విడదల రజని స్పష్టం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తూ ఇచ్చిన జీవోను తక్షణం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే దిగొచ్చేదాకా వైయస్సార్సీపీ ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని రజని హెచ్చరించారు.
పోలీసులను ప్రయోగించి నిరసన కార్యక్రమాన్ని అడ్డుకోవాలని చూసినా పార్టీ శ్రేణులు, విద్యార్ధులు, యువత, ప్రజలు స్వచ్ఛందంగా పెద్ద సంఖ్యలో తరలివచ్చారని వివరించారు. మెడికల్ కాలేజీలు పూర్తి కాలేదని కూటమి నాయకులు చేస్తున్న అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు ఆయా మెడికల్ కాలేజీల వద్దకు వెళ్లి ఫొటోలు, వీడియోలు ప్రదర్శించారని ఆమె మీడియాకు వివరించారు. ఆమె ఇంకా ఏమన్నారంటే…
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో జరిగిన ఛలో మెడికల్ కాలేజీల కార్యక్రమం విజయవంతమైంది. గత ఐదేళ్ల వైయస్సార్సీపీ పాలనలో రూ.8,500 కోట్ల వ్యయంతో వైయస్ జగన్ 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టి 5 కాలేజీలను పూర్తి చేశారు. వాటిల్లో అడ్మిషన్లు పూర్తయ్యి క్లాసులు జరుగుతున్నాయి. ఎన్నికల నాటికి పూర్తయిన పాడేరు మెడికల్ కాలేజీని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రారంభించింది. మా నాయకులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారి మీద కక్షతో పులివెందుల మెడికల్ కాలేజీని మాత్రం ప్రారంభించకుండా ఎన్ఎంసీ సీట్లు కేటాయించినా వద్దని లేఖరాసిన అసమర్థ నేత చంద్రబాబు.