– ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి
విజయవాడ: చంద్రబాబు ఇచ్చేది అన్నదాత సుఖీభవ కాదు..అన్నదాత దుఃఖీభవ. సూపర్ సిక్స్ హామీల అర్హులు అందరికి కాదు..కొందరికే. రాష్ట్రంలో 76.07 లక్షల మంది రైతులుంటే.. కూటమి ప్రభుత్వం ఎంపిక చేసింది కేవలం 47 లక్షల మంది రైతులనేనని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి విమర్శించారు. ఈ మేరకు ఆమె శుక్రవారం మీడియాతో మాట్లాడారు. వడపోతల పేరుతో 30 లక్షల మంది రైతులకు టోకరా పెట్టారన్నారు. ఆమె ఇంకా, ఏమన్నారంటే… ఇప్పటికే గ్యాస్ సిలిండర్లు సగం మందికే ఇస్తూ, తల్లికి వందనం కింద 20 లక్షల మంది బిడ్డలకు కోత పెట్టి, ఇప్పుడు సుఖీభవ పేరుతో సగం మంది రైతులకు తీరని అన్యాయం చేస్తున్నారు.
అన్నదాత సుఖీభవ కింద రాష్ట్ర ప్రభుత్వమే రూ.20వేలు ఇస్తుందని ఎన్నికల ప్రచారంలో బాబు ఊదరగొట్టారు. తీరా గెలిచాక కేంద్రం ఇచ్చే రూ. 6 వేల తో ముడిపెట్టి నాలుక మడతేశారు. కేంద్రం ఇచ్చే రూ. 6 వేలు పక్కన పెడితే రాష్ట్ర నిధుల నుంచి మీరిచ్చేది కేవలం రైతుకి రూ.14 వేలే. ఆనాడు ప్రతిపక్షంలో పెద్ద పెద్ద మాటలు చెప్పారు. కేంద్ర పథకానికి రాష్ట్రానికి ఏం సంబంధం అని మాటల తూటాలు పేల్చారు.
కేంద్రం నేరుగా రైతుల అకౌంట్ లో వేస్తున్నప్పుడు మీరెలా ఇచ్చినట్టు చెప్పుకుంటారు? రెండు కలిసే సమస్యే లేదన్నారు. ఇన్ని మాటలు చెప్పి ఇప్పుడు మీరెందుకు కేంద్రం నిధులతో లింక్ పెట్టారు? మీరిస్తామని చెప్పిన రూ.20 వేలకు కేంద్రం వాటాను ఎందుకు జోడించారు? హామీలు ఇచ్చేముందు కేంద్రం వాటాతో కలిపి అని ఎందుకు చెప్పలేదు? కేంద్రం ఇచ్చే పీఎం కిసాన్ పథకం దేశంలో ఉన్న రైతులందరికి తప్పా కేవలం ఏపీకే కాదు కదా?
చంద్రబాబు సమాధానం చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వం నేరుగా అన్నదాత సుఖీభవ పథకం కింద రైతుకు రూ.20వేలు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.