ఎంపీ విజయసాయిరెడ్డి
మాజీ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు మాటలు ప్రజాస్వామ్యానికి వక్రభాష్యం చెబుతున్నాయని, రానున్న ఎన్నికలు ముఖ్యమంత్రికి ప్రజలకు మధ్య పోటీగా అభివర్ణించడం ఆయన దిగజారుడు రాజకీయానికి నిదర్శనమని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల వేదికగా ఆయన గురువారం ఈ అంశంపై స్పందించారు.
అధికారం కోల్పోయాననే బాధ, ఇక ఎప్పటికీ సీఎం కాలేనని దిగులు కారణంగా చంద్రబాబుకు ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతోందని, ఈ నైరాశ్యం ఇప్పుడు పుట్టింది కాదని, 2019 ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి ఆయనలో నిరాశా నిస్పృహలు చోటుచేసుకున్నాయని అన్నారు. మనిషిలోఫ్రస్ట్రేషన్ మితిమించితే మెదడు తిన్నగా ఆలోచించలేదని మానసిక వైద్యులు చెబుతారని ప్రస్తుతం అదే పరిస్థితిలో ప్రతిపక్ష నేత చంద్రబాబు ఉన్నారని అన్నారు. సభలు, సమావేశాల్లో ఆయన రెచ్చిపోయి మాట్లాడుతున్నారని, రాజకీయ ప్రత్యర్థులను హేతుబద్ధం కాని రీతిలో తిట్టిపోస్తున్నారని మండిపడ్డారు.
వచ్చే ఎన్నికలు ఏపీ ముఖ్యమంత్రికీ 5 కోట్ల ప్రజలకు మధ్య జరిగే పోరాటంగా అభివర్ణించడం ఆయన వక్రమార్గపు ఆలోచనలకు అద్దం పడుతుందని అన్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఏ ఎన్నికలైనా భిన్న రాజకీయ సిద్ధాంతాలు అనుసరించే రాజకీయ పక్షాల మధ్య జరిగే పోరాటమని స్కూలు పిల్లాడినడిగినా ఠక్కున చెబుతారని అన్నారు. సుధీర్ఘ అనుభవం కలిగిన చంద్రబాబు మాత్రం రానున్న ఎన్నికలను ముఖ్యమంత్రికి, ఆయన పాలనలో సుపరిపాలన అనుభవిస్తున్న ఆంధ్రా ప్రజలకి మధ్య పోరుగా వర్ణించడం చూస్తే ఆయన మనోస్థైర్యం ఏ మేరకు సన్నగిల్లిందో అర్థమవుతోందని అన్నారు.
టీడీపీకి అండగా ఉండడానికి, రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్రతి కుటుంబం నుంచి ఒకరు రాజకీయాల్లోకి రావాలని చంద్రబాబు పిలుపునివ్వడం విడ్డూరంగా ఉందని విజయసాయి రెడ్డి అన్నారు. ప్రజల సంక్షేమం, బాగోగులు కోరుకునే నాయకులెవరూ ఇటువంటి స్వార్ద బుద్దితో ఆలోచించరని అన్నారు. టీడీపీలో కార్యకర్తలు, సానుభూతిపరులు తగ్గిపోతున్న కారణంగా ప్రతి ఫ్యామిలి నుంచి ఒకరు తన పార్టీకి అండగా రావాలని కోరడం చంద్రబాబు రాజకీయ దివాలాకోరుతనానికి నిదర్శనమని విజయసాయి రెడ్డి అన్నారు.