తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు పూర్తి ఎలక్షన్ మోడ్ లోకి వెళ్ళిపోయినట్టు కనపడుతున్నారు. ‘ఈ సారి విజయం తెలుగుదేశందే’ అని అనడమే కాదు ; ఆయన నమ్ముతున్నారు . ఆ నమ్మకం లోనుంచి పుట్టుకు వచ్చిన సరి కొత్త ఉత్సాహం తో పనీ చేస్తున్నారు. ‘ ఆయన చూపు మారింది. ముఖ కవళికలు మారాయి. అభివాదం చేసే తీరు మారుతున్నది. గమనించారా?’ అంటూ రోజూ ఆయనను దగ్గరి నుంచి చూసే ఒకరు అడిగారు.
ఏ నియోజక వర్గాల మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి… అనే విషయమై ఆయనకు పూర్తి స్పష్టత ఉన్నదని పార్టీ ముఖ్యమైన నాయకుడు ఒకరు చెప్పారు. ‘ మా పార్టీ కి సలహాదారు ల న్యూసెన్స్ లేదు. అన్నీ ఆయనే చూసుకుంటున్నారు.’అని కూడా ఆయన అన్నారు. రాష్ట్రంలో గల 13 ఉమ్మడి జిల్లాల్లో – రెండు ఉమ్మడి జిల్లాలను ఆయన పెద్దగా పట్టించుకోవడం లేదని సమాచారం. ఉమ్మడి కడప, ఉమ్మడి కర్నూలు జిల్లాలపై ఆయన పెద్దగా దృష్టి పెట్టడం లేదని అంటున్నారు. ఈ రెండు ఉమ్మడి జిల్లాల్లోను 26 శాసనసభ స్థానాలు ఉన్నాయి. మిగిలిన 149 నియోజక వర్గాల్లో టీడీపీ అభ్యర్థుల గుర్తింపు పని కూడా చురుకుగా సాగుతున్నది (అంటున్నారు).
నిన్నటికి నిన్న ఉమ్మడి పశ్చిమ గోదావరిలోని గోపాలపురం ఎస్ సీ రిజర్వుడ్ నియోజక వర్గానికి పార్టీ అభ్యర్థిగా మద్ది వెంకటరాజు ను చంద్రబాబు ఖరారు చేసి పంపించారు. రాజకీయంగా వైసీపీ వ్యతిరేక వాతావరణం రాష్ట్రం లో నెలకొని ఉన్నదనే భావం రాష్ట్రం లో విస్తృతంగా వ్యాపించి ఉండడం తో టీడీపీ టికెట్ ఆశావహులతో మంగళగిరి లోని టీడీపీ కేంద్ర కార్యాలయం కిట కిట లాడుతున్నదని విజయవాడ కు చెందిన టీడీపీ అడ్వకేట్ నాయకుడు చెప్పారు.