– కరెంట్ చార్జీల పెంపుతో రూ.15 వేల కోట్ల భారం
– సంపద సృష్టి అంటే ప్రజలపై భారం వేయడమా?
– వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి మండిపాటు
అనంతపురం: అధికారం కోసం ప్రజలను నమ్మించడం.. సీఎం కుర్చీలో కూర్చోగానే మోసం చేయడం చంద్రబాబుకు అలవాటేనని వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. మోసానికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు అని మండిపడ్డారు. ప్రజలను దగా చేయడం..వంచించడం..నిట్టనిలువునా ముంచడంలో చంద్రబాబు త్రిబుల్ పీహెచ్డీలు చేశారన్నారు. కరెంట్ చార్జీల బాదుడుపై శుక్రవారం వైఎస్ఆర్సీపీ పోరుబాట నిర్వహించింది. నగరంలోని పాతూరులో ఉన్న బ్రహ్మం గారి గుడి వద్ద నుంచి పవర్ ఆఫీస్ వరకు పార్టీ శ్రేణులతో కలిసి ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో సూపర్ సిక్స్ పేరుతో మభ్యపెట్టారని, అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడిచినా హామీలు అమలు చేయడం లేదని మండిపడ్డారు. గత ఎన్నికలకు ముందు కరెంట్ చార్జీలను పెంచను.. తగ్గిస్తానని చెప్పిన చంద్రబాబు.. ఆరు నెలల్లోనే ఏకంగా రూ.15,485 కోట్ల భారాన్ని మోపారన్నారు. ఎన్నికలకు ముందు సంపద సృష్టిస్తానని చంద్రబాబు చెప్పారని, దానర్థం పేదలపై రూ.15 వేల కోట్ల కరెంట్ చార్జీల భారం మోపడమా? అని ప్రశ్నించారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తక్షణం కరెంట్ చార్జీల పెంపును ఉపసంహరించుకోవాలని అనంత వెంకటరామిరెడ్డి డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు చార్జీలకు సంబంధించి ఇప్పటికే రూ.6 వేల కోట్ల బాదుడు మొదలైంది. మరో 9,412.50 కోట్ల భారం వచ్చే జనవరి నెల నుంచి వినియోగదారులపై మోపేందుకు సిద్ధమవుతున్నారు. మొత్తం రూ.15,485.36 కోట్ల చార్జీల బాదుడు అత్యంత దారుణం.
ప్రతి నెలా దాదాపు రూ.600 కరెంటు బిల్లు వచ్చే సాధారణ కుటుంబానికి కూడా కనీసంగా రూ.200కు పైగా అదనంగా బిల్లు వస్తూ దాదాపు రూ.800కు పైగా కట్టాల్సి వస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజలు కరెంటు బిల్లులంటేనే భయపడిపోతున్నారు. దాదాపు 35 శాతానికి పైగా అదనపు భారం పడుతుండడంతో వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. చాలీ చాలని జీతాలతో, కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న దళితులపై చార్జీల పిడుగు పడేలా ప్రభుత్వ చర్యలున్నాయి. తక్షణమే ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్ల ఉచిత కరెంటును పునరుద్ధరించాలి.