– పాత ఫోటోలతో చంద్రబాబు బురిడీ రాజకీయం
– మైనింగ్ మాఫియా ఫోటో ఎగ్జిబిజన్ అంటూ బాబు బరితెగింపునకు ఇవిగో సాక్ష్యాలు
– ఫొటోల రుజువులతో సహా మీడియా ముందు ప్రదర్శించిన సజ్జల రామకృష్ణారెడ్డి
– బాబు అధికారంలో ఉంటే అమెరికా.. లేకపోతే శ్రీలంక అన్నట్టు ఎల్లో మీడియా దుష్ప్రచారం
– చంద్రబాబు ఆరోపణలు సోషల్ మీడియాలో జోక్స్ లా పేలుతున్నాయే తప్ప పసలేదు
– అభివృద్ధి పనులను అడ్డుకోవడమే చంద్రబాబు పని
– అందుకే అక్రమ మైనింగ్ అంటూ దుష్ప్రచారాలు
– ప్రభుత్వంపై అర్ధం లేని ఆరోపణలు, విమర్శలు
– మా పార్టీ ప్లీనరీ సక్సెస్‌తో చంద్రబాబు మైండ్ బ్లాంక్
– అందుకే ఆయన, ఎల్లో మీడియా, దత్తపుత్రుడు బరితెగింపు
– రాష్ట్రంలో ఏదో జరుగుతోందంటూ నిందల పర్వం
– ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం.. అసత్యాల ప్రచారం
– కంకర తవ్వకుండా ఎవరైనా రోడ్లు వేయగలరా?
– సిమెంటు లేకుండా భవన నిర్మాణాలు చేయగలరా?
– చంద్రబాబులా గ్రాఫిక్స్‌లోనే అభివృద్ధిని మేం చూపలేం
– నియమ నిబంధలనకు అనుగుణంగానే మైనింగ్
– ఎక్కడైనా ఉల్లంఘన జరిగితే కఠిన చర్యలు
– అపరాధ రుసుము కూడా వసూలు చేస్తున్నాం
– చంద్రబాబు హయాంలో యథేచ్ఛగా ఇసుక దోపిడి
– అమరావతి వద్ద కృష్ణా నదిలో ఇసుక తవ్వకాలు- రూ.100 కోట్ల ఫైన్ వేసిన ఎన్జీటీ
– బాబు పాలనలోనే అక్రమ మైనింగ్.. కొండలను తోడేశారు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి
ప్రెస్‌మీట్‌లో సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే..
దిక్కు తోచక విషం కక్కుతున్నారు:
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ నభూతో న భవిష్యత్ అన్నట్లు జరగింది. భారీ వర్షాలు కురుస్తున్నా ప్రజలు ఎక్కడా వెనక్కు తగ్గలేదు. ప్లీనరీకి ముందు తెలుగుదేశం పార్టీ, దాని అనుకూల మీడియా, చంద్రబాబు దత్తపుత్రుడు అంతా కలిసి అబద్ధపు, అన్యాయపు ప్రచారం చేశారు. జగన్ పనైపోయందని చెబుతూ వచ్చారు.
అయితే వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ, ప్లీనరీ దిగ్విజయంగా జరగడంతో చంద్రబాబుకు, ఆయన దత్తపుత్రుడికి, టీడీపీని సమర్థించే మీడియాకు ఏం చేయాలో దిక్కు తోచక, ఇప్పుడు ఇంకా విషం కక్కుతున్నారు. రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందంటూ, గేరు మార్చి ఇంకా ఎక్కువ దుష్ప్రచారం మొదలు పెట్టారు.
పాత ఫోటోలతో ఎగ్జిబిషన్: చంద్రబాబు బరితెగింపు
చంద్రబాబు చెబుతున్నవన్నీ అసత్యాలు అంటూ.. ఒక ఫోటో చూపిన సజ్జల రామకృష్ణారెడ్డి..
ఇది నిన్న చంద్రబాబు ఫోటో ఎగ్జిబిషన్‌లో చూపెట్టారు. ఇలా కొండను తవ్వారంటూ ఒక బోరు ఉన్న ప్రాంతాన్ని చూపారు. అది వైయస్సార్‌సీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి నిర్వాకం అంటూ విమర్శించారు. దాన్ని ఈనాడు కూడా ప్రచురించింది.
నిజానికి అది 2018లో సోషల్ మీడియాలో పెట్టిన ఫోటో. ‘మన తెలుగు జోక్‌లు. ప్రతి ఇంటా నవ్వుల పంట’ అన్న దాంట్లో ఆ ఫోటో వాడారు. ఇలా ఉంటే బోరు ఎలా కొట్టాలి అంటూ.. ఆ ఫోటో పోస్టు చేశారు. పాత ఫోటోను చూపిన చంద్రబాబు, ఎమ్మెల్యే ద్వారంపూడిపై నిస్సిగ్గుగా ఆరోపణలు చేశారు.
ఈ ఫోటో ఎందుకు చూపుతున్నానంటే.. చంద్రబాబు అడ్డూ అదుపులేనితనానికి, బరితెగింపునకు ఇది ఒక ఉదాహరణ.
అలాగే మరో ఫోటో..
కొండను తవ్విన ఫోటో. ఇది మంగళగిరి రోడ్‌లో టీడీపీ ఆఫీస్ దగ్గరే ఉంది. దాన్ని కూడా టీడీపీ హయాంలోనే, ఆ రోజుల్లోనే తవ్వేశారు.
మరో ఫోటోలో ఉన్న కొండ కూడా ఇక్కడికి దగ్గర్లోనే ఉంది. దాన్ని కూడా టీడీపీ హయాంలోనే తవ్వేశారు. వీటిని మీడియా కూడా సందర్శించి, వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలి.
వాస్తవాలు గుర్తించడం లేదు:
ప్రజలు స్పష్టంగా తమ నిర్ణయం ప్రకటిస్తున్నా, వారు వాస్తవాలు గుర్తించడం లేదు. ప్రజల అవసరాలు గుర్తించి, వారికి మేలు చేయకపోతే, ఎవరూ ఆదరించరన్న వాస్తవాన్ని కూడా గుర్తించడం లేదు. సీఎం వైయస్ జగన్ ఆ పని చేస్తున్నారు కాబట్టే, ఆయనను ప్రజలంతా ఆదరిస్తున్నారు. కానీ చంద్రబాబు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ ప్రభుత్వంపై అర్ధం లేని విమర్శలు చేస్తున్నారు.
అవి లేకుండానే పనులు చేశారా?:
మైనింగ్ పై టీడీపీ అధినేత చంద్రబాబు నిన్న ఒక ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి, చాలా సేపు ప్రసంగించారు. ఎప్పటికీ తానే అధికారంలో ఉండాలనే ఆరాటంతో, ఎప్పటి మాదిరిగానే తిట్ల దండకం, అబద్ధాలు వల్లె వేశారు. రాష్ట్రంలో ఘోరాలు ఏవో జరుగుతున్నాయంటూ మాట్లాడారురు. ఎక్కడ పడితే అక్కడ అడవులు, గుట్టలు కొట్టేస్తున్నారని.. ఇంకా భారతి సిమెంట్ కోసం లేటరైట్ అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపించారు.
మాకు ఒక సందేహం..
చంద్రబాబు తన పాలనలో సిమెంటు అవసరం లేకుండా నిర్మాణాలు చేశారా? కంకర లేకుండా రోడ్లు వేశారా?. చంద్రబాబు అమరావతిలో ఎలాంటి నిర్మాణాలు లేకుండా గ్రాఫిక్స్‌లో చూపారు. అందుకే సిమెంటు, ఇసుక, కంకర, మట్టి ఇవేవీ ఆయనకు అవసరం పడలేదేమో. లేక అవేవీ లేకుండానే ఆయన అమరావతి కట్టాలనుకున్నారా?.
అభివృద్ధిని అడ్డుకుంటున్నారు:
ఎక్కడ ఏ నిర్మాణం చేసినా, ఏ ప్రభుత్వ హయాంలో అయినా అవసరమైన మైనింగ్ కొనసాగుతుంది. అయినా చంద్రబాబు ఇప్పుడే ఎందుకలా వ్యవహరిస్తున్నాడు. ఫోటో ఎగ్జిబిషన్ పెట్టి నానా హంగామా ఎందుకు చేస్తున్నాడు అంటే..
రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. 30 లక్షలకు పైగా ఇళ్ల స్థలాలు. పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. వాటికి అవసరమైన మట్టి, ఇసుక, సిమెంట్ వినియోగం జరుగుతోంది. అక్కడ రోడ్లు వేస్తున్నారు. వాటన్నింటిని అడ్డగించడం కోసమే ఇలా చేస్తున్నారేమో అనిపిస్తుంది.
ఎక్కడ ఇసుక తవ్వినా చట్ట ప్రకారమే జరుగుతుంది. ఎక్కడైనా ఉల్లంఘన జరిగితే ప్రభుత్వం స్పందిస్తుంది. ఈ ప్రభుత్వ హయాంలో అన్ని శాఖల మాదిరిగా మైనింగ్ విభాగం కూడా చాలా సమర్థంగా పని చేస్తోంది. అందుకే జాతీయ స్థాయిలో గుర్తింపు, అవార్డు పొందింది.
ఎక్కడైనా మైనింగ్‌లో నియమాలు ఉల్లంఘిస్తే, అక్కడ చర్యలు కూడా తీసుకుంటున్నారు. ఆమేరకు ఫైన్‌లు వసూలు చేస్తున్నారు.
నాడు ఎన్జీటీ రూ.100 కోట్ల ఫైన్:
చంద్రబాబు హయాంలో.. అమరావతి దగ్గర కృష్ణా నదిలో అక్రమంగా ఇసుక తవ్వితే, ఎన్జీటీ స్పందించి రూ.100 కోట్ల జరిమానా విధించింది. ఇప్పటికీ అక్కడ తవ్వకాలకు పర్మిషన్ ఇవ్వడం లేదు. దానిపై అప్పట్లో మా పార్టీ నాయకుడు హనుమంతరావు కోర్టును కూడా ఆశ్రయించాడు.
ఎక్కడైనా అనుమతి లేకుండా అడ్డగోలుగా తవ్వారంటే, కేవలం చంద్రబాబు హయాంలోనే జరిగింది. అందుకే రాష్ట్రం ఆనాడు దివాళా పరిస్థితికి వెళ్ళింది. లేటరైట్ లేకుండా సిమెంట్ తయారు చేయొచ్చా?. రోడ్ల మీద కంకర లేకుండా గుంతలు ఎలా పూడుస్తారు?. మట్టి తవ్వకుండా ఎలా మట్టిని రోడ్డుపై నింపుతారో చంద్రబాబు చెప్పాలి.
అదే చంద్రబాబు లక్ష్యం:
జగన్ అధికారంలో ఉన్నారు కాబట్టి, ఏ కార్యక్రమం జరగొద్దు. రోడ్లు వేయొద్దు. ఇళ్లు కట్టొద్దు. అప్పులు బయట పుట్టకూడదు. ప్రభుత్వం మొత్తం స్తంభించిపోవాలి. మొత్తం వ్యవస్థ నిర్వీర్యం కావాలన్నదే చంద్రబాబు లక్ష్యం.అందుకే ఆయన ఏ స్థాయికి వెళ్తున్నాడంటే, ప్రతి పనికీ అడ్డు పడుతున్నాడు.
ఇంకా దిగజారి తన హయాంలో తవ్విన కొండల ఫోటోలు తెచ్చి, ఇప్పుడు ఎగ్జిబిషన్ పెడుతున్నాడు. విశాఖ రుషికొండపై నిర్మాణాలు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. అన్నీ అనుమతితోనే జరుగుతున్నాయి.
నియమ, నిబంధనలకు లోబడి, పర్యావరణాన్ని పరిరక్షిస్తూ, పనులు చేయాలి. దాన్నే ఈ ప్రభుత్వం చేస్తోంది.
ఆనాడే నియమావళి ఉల్లంఘన:
నిజానికి చంద్రబాబు హయాంలో పనులు అలా జరగలేదు. ఇష్టానుసారం తవ్వేశారు. రుషికొండపై చంద్రబాబు హయాంలో కూడా నిర్మాణాలు జరిగాయి. ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారని చంద్రబాబు అనుకుంటున్నాడు. అందుకే రోజూ విష ప్రచారం చేస్తున్నారు. ఇది ఛండాలం. అన్యాయం. పదే పదే అబద్ధాలు చెప్పి, ప్రజలను నమ్మించవచ్చన్న భ్రమలో చంద్రబాబు ఉన్నాడు.
ఇవాళ కూడా విశాఖపై ఇంత హడావిడి ఎందుకు చేస్తున్నారంటే, రేపు అక్కడ సీఎం కార్యక్రమం ఉంది. వాహనమిత్ర కింద ఆటోలు, ట్యాక్సీలు, మ్యాక్సీ క్యాబ్‌ల డ్రైవర్లకు ఏటా రూ.10 వేలు ఇస్తూ, వరసగా నాలుగో ఏడాది అమలు చేస్తున్న పథకం వాహనమిత్ర. ఆ విధంగా డ్రైవర్లు తమ సొంత కాళ్లపై నిలబడి, వాహనాల ఎఫ్‌సీ, ఇన్సూరెన్స్, ఇతర మరమ్మతుల కోసం రూ.10 వేల సహాయం చేస్తున్నాం. దీన్ని నుంచి ప్రజల దృష్టి మరల్చడం కోసమే ఈ కుట్రలు.
చంద్రబాబు ఫెయిల్యూర్ వ్యక్తి:
మొత్తం ఫెయిల్ అయిన వ్యక్తి చంద్రబాబు. అధికారంలోకి అడ్డదారిలో వచ్చాడు. చివరకు తనకు ఒక నియోజకవర్గాన్ని కూడా నిలబెట్టుకోలేకపోయిన మనిషి. కుప్పం ఆయన చేయి జారి పోయింది. ఇప్పటికే సర్పంచ్, మున్సిపాలిటీ, ఎంపీటీసీ పోయింది. రేపు ఎమ్మెల్యే పదవి కూడా పోతుంది.
దీంతో తీవ్ర ఫ్రస్టేషన్‌లో ఏం చేయాలో దిక్కుతోచక, ఈ తరహాలో అనైతికంగా వ్యవహరిస్తున్నాడు. ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాడు. ప్రజలు అన్నీ మర్చిపోతాడని అనుకుంటున్నాడు. చివరకు ఆయనను సమర్థించే ఎల్లో మీడియాకు కూడా నైతిక విలువలు లేవు. అసలు వారికి సిగ్గు లేకుండా పోయింది.
మా ప్లీనరీలో అసాధారణ స్థాయిలో స్పందన. దాన్ని చూసే చంద్రబాబుకు దిక్కు తోచడం లేదు. రాష్ట్రంలో 1.30 లక్షల పంచాయతీలు, స్థానిక సంస్థల వార్డుల్లో వైయస్సార్‌పీపీ నాయకులే ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆ విధంగా పార్టీ నాయకులు కాకుండా, దాదాపు 1.70 లక్షల వైయస్సార్‌సీపీ ప్రతినిధులు ప్రజలకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. దీన్ని ఎదుర్కోవడం చంద్రబాబుకు సాధ్యం కాదు. అందుకే ఈ విధంగా వ్యవహరిస్తున్నాడు.
నిజానికి ప్రజల్లోకి వెళ్లడం తప్ప, మరో మార్గం లేదు. అందుకే చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ మాటలు సోషల్ మీడియాలో ప్రచారానికి, ఒక జోక్‌లా పనికొస్తాయే తప్ప, దాని వల్ల ఓట్లు రావు. వారు అలాగే అనుకుంటే వారికి ప్రజల మళ్లీ బుద్ధి చెబుతారు.
మీడియా ప్రశ్నలకు సమాధానంగా..
రోడ్లన్నీ బాగు చేస్తాం:
భారీ వర్షాలు కురుస్తున్నాయి. అందుకే రోడ్డు పాడవుతున్నాయి. అన్నింటినీ బాగు చేస్తాం. చంద్రబాబు హయాంలో రోడ్ల నిర్మాణం లేదు. కానీ వర్షాలు లేకపోవడం వల్ల వాటి దుస్థితి తెలియలేదు.
ఈ ప్రభుత్వం ఎప్పుడైనా, ఏమైనా జరిగినప్పుడు అక్కడికి పోయి నానా హడావిడి చేసి, ప్రచారం చేసుకోదు. ఎవ్వరి బాధ్యతలు వారు నిర్వర్తిస్తారు. చంద్రబాబు మాదిరిగా తుపాన్‌ను ఆపుతామని, వరదలను, తుపానులను దారి మళ్లిస్తామనే పనికిమాలిన మాటలు జగన్ మాట్లాడరు.
వీలైనంత వరకు ప్రజల ఇబ్బంది తొలగించే ప్రయత్నం చేస్తాం. వేగంగా సాధారణ పరిస్థితులు నెలకొనేలా కృషి చేస్తున్నాం.
అదనపు కోటా కోరుతున్నాం:
పీడీఎస్‌లో రాష్ట్రానిక అన్యాయం జరుగుతోంది. ఇవ్వాల్సిన స్థాయిలో కోటా కేంద్రం ఇవ్వడం లేదు. రాష్ట్రంలో 1.45 కోట్ల బియ్యం ఇచ్చే కార్డులు ఉండగా, వాటిలో 88.7 లక్షల కార్డులకు మాత్రమే కేంద్రం సరుకు ఇస్తోంది. మిగిలిన 56.6 లక్షల కార్డులకు రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా ఇస్తోంది. దీని కోసం ప్రతి నెలా రూ.315 కోట్లు ఖర్చు చేస్తున్నాం. అదే విధంగా సార్టెక్స్ బియ్యం పంపిణీ. అది కూడా డోర్ డెలివరీ. ఈ రెండూ ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు.
కోవిడ్ సమయంలో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (పీఎంజీకేవై) గతంలో ఆరు నెలల కోసం ఇచ్చి, పొడిగిస్తూ వస్తున్నారు. దీంట్లో కూడా కేంద్రం గుర్తించిన కార్డులకే ఆ ప్రభుత్వం ఇస్తోండగా, మిగిలిన వాటికి యథావిథిగా ఇస్తున్నాం. దాన్ని 19 నెలలుగా గత ఏప్రిల్ వరకు ఇచ్చాం. నెలకు రూ.300 కోట్లకు పైగా భరించాం. ఇంకా ఇవ్వడం సాధ్యం కాదు కాబట్టి, ఆ మేరకు ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతున్నాం.