చిత్తూరు జిల్లా కుప్పం గంగమ్మ ఆలయ మాజీ ఛైర్మన్ పార్థసారథి ఆత్మహత్య పట్ల టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విచారం వ్యక్తం చేశారు. పార్థ సారథి ఆత్మహత్య, స్థానికంగా నెలకొన్న ఆందోళనలపై స్థానిక పార్టీ నేతలతో చంద్రబాబు ఆరా తీశారు. సొంత పార్టీ వాళ్ళ కారణంగానే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు పార్థసారథి సెల్ఫీ వీడియో లో చెప్పారని, వైసీపీ నేతలు వేధింపులకు చివరికి సొంత పార్టీ వ్యక్తులు కూడా బలి అవుతున్నారని ఈ సందర్భంగా చంద్రబాబు వ్యాఖ్యానించారు.
డబ్బులకు పదవులు అనే విష సంస్కృతిని వైసీపీ నేతలు కుప్పంలో కూడా తీసుకువచ్చారు. గంగమ్మ గుడి ఛైర్మన్ గా పనిచేసిన బలహీన వర్గానికి చెందిన పార్థసారథి సొంత పార్టీలో అవమానాలకు ప్రాణాలు తీసుకోవడం విచారకరం. పార్థసారథి ప్రాణాలు పోవడానికి కారణం అయిన వారిపై ఎందుకు కేసు నమోదు చేయడం లేదు?
సెల్ఫీ వీడియోలో పార్థసారథి చెప్పిన మాటల ఆధారంగా కేసు నమోదు చేయాలని, ఆయన కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు. పార్థసారథి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.