నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు
ప్రజాసేవ తప్ప ఏ దురలవాటు లేని వ్యక్తి తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రఘురామ కృష్ణంరాజు కొనియాడారు. ప్రజాసేవ కూడా ఒక దురలవాటేనని కొంతమంది అంటుండగా, అది చాల మంచి అలవాటేనని చాలామంది చెబుతుంటారు. క్రమశిక్షణతో కూడిన ఆహారపు అలవాట్లతో, సకాలంలో మందుల వాడకంతోనే నారా చంద్రబాబు నాయుడు ఆరోగ్యంగా కనిపిస్తున్నారు. తన అనారోగ్యాన్ని అదే పరిమితిలో ఉంచడంలో ఆయన సఫలీకృతులయ్యారన్నారు.
రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ…. కాల్షియం సంబంధించిన సమస్యలకు మందులు వాడుతూ, కంట్రోల్ చేస్తున్నప్పటికీ, ఏ నిమిషంలో నైనా చంద్రబాబు నాయుడు కు ఆపద రావచ్చు. స్టెంట్ వేయాల్సిన అవసరం ఏర్పడవచ్చు.. చంద్రబాబు నాయుడు కు మధుమేహ వ్యాధితో పాటు, చర్మ సంబంధిత సమస్యలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడుకు ఉన్న చర్మ సంబంధిత సమస్యలను స్కిన్ క్యాన్సర్ అనలేము కానీ, కణాల రీ జనరేషన్ తగు మోతాదులో ఉండే అవకాశాలు లేవు. నిరంతరంగా క్రీం అప్లై చేసుకోవడంతో పాటు, స్కిన్ డామేజ్ కాకుండా చూసుకుంటూ, జాగ్రత్తలు తీసుకోవాలి.
జైల్లో ఉన్నప్పుడు చర్మ సంబంధిత సమస్యలతో చంద్రబాబు నాయుడు బాధపడుతుంటే, కొంతమంది దరిద్రులు నోటికొచ్చినట్లు వాగారు. చరిత్రలో రాక్షసులు కూడా ఇంత దరిద్రంగా మాట్లాడి ఉండరు. దేశంలోనే మొదటి మూడు స్థానాలలో ఉన్న ఏఐజి ఆసుపత్రి వైద్య బృందం, అమెరికాకు చెందిన మయో క్లినిక్ రోచేస్టర్ వైద్య బృందం కూడా 2017, 2019లో వైద్య పరీక్షలను నిర్వహించి గుండె సంబంధిత సమస్యలు ఉన్నట్లు తెలిపారు. ఇప్పుడే చంద్రబాబు నాయుడుకి గుండె సంబంధిత సమస్య వచ్చిందా అని కొందరు అంటున్నారు. అటువంటిది ఏమీ లేదు. గత కొన్ని ఏళ్లు గా ఉన్నప్పటికీ డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారు. డాక్టర్ల ద్వారా నాకు అందిన చంద్రబాబు నాయుడు వైద్య నివేదికలు, మీకు కూడా అందే ఉంటాయి.
సంజీవ్ ఔరంగ బత్కర్ అనే ప్రముఖ డెర్మటాలజిస్ట్ పరీక్షించి చంద్రబాబు నాయుడు ముఖము, ముక్కు పై చర్మ సమస్య ఎక్కువగా ఉన్నదని నిర్ధారించారు. చంద్రబాబు నాయుడు పై దొంగ కేసులు పెట్టి 53 రోజులపాటు జైల్లో నిర్బంధించిన కారణంగానే చర్మ సంబంధిత సమస్యలు తీవ్ర మయ్యాయనేది వాస్తవం. రాష్ట్రంలో వైద్య సౌకర్యాలు బ్రహ్మాండమని చెబుతున్నప్పటికీ, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సత్తిబాబు వైద్యం కోసం ఏఐజి ఆసుపత్రిలో చేరారని గుర్తు చేశారు. నారా చంద్రబాబు నాయుడు అనారోగ్య సమస్యలకు సంబంధించి 12 రకాల మందులను తీసుకోవలసి ఉంటుందని, జైలులో ఉంటే సమయం ప్రకారం తీసుకోగలరా అని రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు. 73 ఏళ్ల వయసు ఉన్న చంద్రబాబు నాయుడు పై నిరాధారమైన ఆరోపణలతో అక్రమ కేసులు బనాయించి హింసించాలనుకుంటే చరిత్ర, మానవజాతి మిమ్మల్ని క్షమించదని పాలకులను హెచ్చరించారు.
వైద్యులుగా అవతారం ఎత్తిన సుధా, మిల్లెట్ రెడ్డి
ఉదయం, సాక్షి దినపత్రికలలో విలేకరిగా పనిచేసే, ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి సలహాదారుడిగా వ్యవహరిస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి, డాక్టర్ మిల్లెట్ రెడ్డిగా ప్రస్తుతం వైద్యశాస్త్రంలో కూడా తగినంత ప్రావీణ్యత సంపాదించినట్లు ఉన్నారని రఘు రామకృష్ణంరాజు ఎద్దేవా చేశారు. న్యాయస్థానంలో నిజమైన వైద్యులు అందజేసిన నివేదికను, న్యాయవాది నుంచి వైద్యుని అవతారం ఎత్తిన అడిషనల్ అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి తప్పు పట్టడం విడ్డూరంగా ఉంది. వైద్యులు అందజేసిన నివేదికనే న్యాయమూర్తులు ప్రామాణికంగా తీసుకుంటారు. అంతేకానీ వైద్యశాస్త్రంలో పరిజ్ఞానం లేని వ్యక్తులు చేసే వాదనలను న్యాయస్థానం పరిగణలోకి తీసుకోదు.
ఇప్పటికే చంద్రబాబు నాయుడుకి ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిలో రెండు కళ్ళకు శస్త్ర చికిత్స జరిగింది. అలాగే ఏఐజి ఆసుపత్రి వైద్య బృందం ఆయనకు గుండె సంబంధిత సమస్యలు ఉన్నట్లు నిర్ధారించారు. ప్రతి వెధవ నోటికి వచ్చినట్లుగా వాగుతున్న తరుణంలో ఏడు సంవత్సరాల కింద ఆయనకు నెస్సల్ సర్జరీ చేసిన వైద్యుడు కూడా గుండెకు సంబంధించిన సమస్యను గుర్తించారు. ఆయన దానికి తగిన రీతిలో క్రమశిక్షణతో ముందు జాగ్రత్తలు తీసుకుండడం వల్ల గుండెకు సంబంధించిన సమస్య తీవ్రతరం కాకుండా , అలాగే కొనసాగుతోందని రఘు రామ కృష్ణంరాజు తెలిపారు.
వైద్యులు ఇచ్చిన నివేదిక బోగస్ అని, ఈసీజీ పరీక్ష చేస్తే తెలుస్తుందనడం అడిషనల్ అడ్వకేట్ జనరల్ కంటే ఆదిమానవుడు నయమని అనిపిస్తోందని రఘురామ కృష్ణంరాజు అన్నారు. ఈసీజీ అంటేనే తప్పుల తడక అని, ప్రాథమిక రోగనిర్ధారణ కోసమే ఈసీజీ పరీక్షలు చేస్తారన్నారు. గుండె లేని మనుషుల్లో అడ్డంగా వాదిస్తున్నారని గుండె లేదు కాబట్టే, గుండె నొప్పి గురించి వారికి తెలిసే అవకాశం లేదని ఎద్దేవా చేశారు. గొడ్డలి పోటుకు, గుండెపోటుకు పెద్దగా తేడా తెలియదని మనుషులు మీరు అంటూ రఘురామకృష్ణం రాజు విరు చుక పడ్డారు.
ఇలాగైతే రాజమండ్రి జైల్లో రెండు వేల మంది ఖైదీలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. వాళ్లు తమకు ఈ ఇబ్బంది ఉంది.. ఆ ఇబ్బంది ఉందని న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉన్నట్లుగా, వైద్యుల నివేదికను నమ్మొద్దని సుధాకర్ రెడ్డి చెప్పడం హాస్యాస్పదంగా ఉంది.న్యాయ మూర్తి తీర్పును రిజర్వ్ చేశారు. ఎప్పుడు తీర్పు వెలువడిన వైద్యుల నివేదికను పరిగణలోకి తీసుకొనే తీర్పు ఇస్తారన్న ఆశాభావాన్ని రఘురామకృష్ణం రాజు వ్యక్తం చేశారు. ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తిగా, ప్రజాసేవే ఆయన ఆకాంక్ష కాబట్టి చంద్రబాబు నాయుడు కు అంబులెన్స్ ను ఎప్పుడు అందుబాటులో ఉంచాలని వైద్యులు తమ నివేదికలో సూచించారు.
దీనిపై కూడా డాక్టర్ సుధా మాట్లాడుతూ ఇది మానిప్లేటెడ్ రిపోర్ట్ అని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉంది. న్యాయస్థానంలో సుధా నోటికొచ్చినట్లు మాట్లాడితే, డాక్టర్ మిల్లెట్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి కాల్షియం నెంబర్ గురించి మాట్లాడడం… కాల్షియం అంత మోతాదులో ఉంటే స్టంట్ వేయాలి, సర్జరీ చేయాలని చెప్పడమే కాకుండా ఇంకా ఏదేదో చెబుతున్నారు. ఇది మెడికల్ రిపోర్టా లేకపోతే పొలిటికల్ రిపోర్టా అని మిల్లెట్ రెడ్డి బుల్లెట్ లాగా అద్భుతమైన వ్యాఖ్యలు చేశారు.
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వంశస్తులనే సిబిఐ హంతకుల జాబితాలో చేర్చింది. డబ్బులు ఇచ్చి హత్యకు ప్రోత్సహించినట్లుగా పేర్కొంది. వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఐపిసి 302 సెక్షన్ మోపబడి జగన్మోహన్ రెడ్డి పినతండ్రి జైలుకు వెళ్లారు. జైల్లో ఆయన ఆరోగ్యం బాగా లేనప్పుడు మొదట వారం రోజులపాటు బెయిల్ ఇచ్చారు. ఆ తర్వాత దాన్ని పొడిగించారు. ఏఐజి వైద్య బృందం ఆయనకు ఆరోగ్య పరిరక్షణలో భాగంగా కొన్ని ముందు జాగ్రత్తలు అవసరమని చెప్పింది. మరి ఆయనకు సర్జరీ ఎందుకు చేయలేదు మిల్లెట్ రెడ్డి… డాక్టర్ సుధాకర్ రెడ్డి అంటూ రఘు రామ కృష్ణంరాజు ప్రశ్నించారు.
ఏఐజి వైద్య బృందం ఇచ్చిన ఆ రిపోర్టు ఫేక్ అంటారా అని నిలదీశారు. ఏఐజి వైద్య బృందం ఇచ్చిన రిపోర్టును తప్పు పడితే, చిన్నాన్నకు ఇచ్చిన బెయిల్ ను కూడా తప్పు పడుతున్నారా అంటూ ప్రశ్నించిన రఘురామకృష్ణంరాజు, ఏఐజి వైద్య బృందం, మయో క్లినిక్ రిపోర్టును కూడా తప్పుపడుతున్నారంటే, అందరూ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ ప్రభావతి మాదిరిగా తప్పుడు నివేదికలు ఇవ్వరని గుర్తించాలన్నారు. లాకప్ లో నన్ను చితకబాదినప్పుడు కాళ్లు కందిపోతే దాన్ని ఒక చర్మవ్యాధిలాగా లాయర్ నుంచి డాక్టర్ అవతారం ఎత్తిన సుధాకర్ రెడ్డి అభివర్ణించారు.
ఇదే విషయాన్ని టీవీ9 డిబేట్ లో, న్యాయస్థానంలో చెప్పారన్నారు … సిఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్, కోడి కత్తి డాక్టర్లు సాంబశివారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డిలు ప్రభావితం చేస్తే ప్రభావతి మాదిరిగా అందరూ తప్పుడు నివేదికలు ఇవ్వరన్నారు. 2017 – 18 వ సంవత్సరంలోనే మయో క్లినిక్ చంద్రబాబు నాయుడుకు ఉన్న గుండె సంబంధిత రుగ్మతలపై నివేదిక ఇచ్చింది. 2019లో జగన్మోహన్ రెడ్డి నెగ్గి కేసులు పెడతారని, ప్రపంచ ప్రఖ్యాత క్లినిక్ నుంచి రిపోర్టును తెప్పించుకొని దగ్గర పెట్టుకుంటారా?, అసలు బుద్ధి ఉండే ఇలా మాట్లాడుతున్నారా? అని రఘురామకృష్ణంరాజు మండిపడ్డారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహోదరుడు కాకపోయినా సోదరుడైన అవినాష్ రెడ్డిని సిబిఐ అరెస్టు చేయడానికి వెళితే ఆయన తల్లి అనారోగ్యంతో బాధపడుతున్నారని చెప్పి కర్నూలులోని ఒక ఆసుపత్రిలో చేర్పించారు. అవినాష్ రెడ్డి తల్లిని పరామర్శించడానికి వెళ్లి వైఎస్ కుటుంబీకులు నానా హంగామా చేశారు. మళ్లీ ఆమె అనారోగ్యం గురించి ఊసే లేదు. జబ్బు ఉంటే ఏఐజి ఆసుపత్రిలో, జబ్బు లేకపోతే కర్నూలు ఆసుపత్రిలో చేర్చుతారు.
కర్నూలు ఆస్పత్రిలో వైఎస్ అవినాష్ రెడ్డి తల్లిని చేర్చినప్పుడు వైకాపా నాయకులంతా నానా చెత్తా మాట్లాడారు. కాబట్టి ఇప్పుడు నేను మాట్లాడాల్సి వస్తుంది. ఏఐజి వైద్య బృందం, మయో క్లినిక్ నివేదికల ఆధారంగానే న్యాయమూర్తి తీర్పును ఇస్తారని ఆశిస్తున్నాను. నాకైతే డెఫినెట్ గా డాక్టర్లు ఇచ్చిన వైద్య నివేదికలను వరిగణలోకి తీసుకుంటారని ప్యాలెస్ నుంచి ఆడించే తోలుబొమ్మల ఆటలను పట్టించుకోరని భావిస్తున్నట్లుగా రఘురామ కృష్ణంరాజు తెలిపారు.
జీవోలను వెబ్సైట్లో ఎందుకు అప్లోడ్ చేయడం లేదన్న న్యాయస్థానం
రాష్ట్ర ప్రభుత్వం జారీ చేస్తున్న జీవోలను వెబ్సైట్ లో ఎందుకు అప్లోడ్ చేయడం న్యాయస్థానం ప్రశ్నించింది.. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేస్తున్న జీవోలను వెబ్సైట్లో అప్లోడ్ చేయడం లేదని న్యాయవాది ఉమేష్ చంద్ర తో పాటు మరో ముగ్గురు కలిసి దాఖలు చేసిన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యంపై న్యాయస్థానం విచారణ చేపట్టిందని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.
ఇదే విషయమై ప్రభుత్వం తరఫున చింతల సుమన్ రెడ్డి తన వాదనలను వినిపిస్తూ ఇంపార్టెంట్ జీవోలను అప్లోడ్ చేస్తున్నామని చెప్పారు. ఇంపార్టెంట్ కానివి అప్లోడ్ చేయడం లేదని అన్నారు. అన్ని జీవోలను అప్లోడ్ చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ కేసును వాయిదా వేశారు. అయితే మరుసటి రోజు జిఏడి వాళ్లు ఒక సర్క్యులర్ జారీ చేశారు. అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు జీవోలను వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని, గతంలో జారీ చేసిన ఆదేశాలను పాటించాలని అన్నారు. ఇది ఒక డ్రామా అని తేలిపోయింది. మేము ఎప్పుడో చెప్పామని చెప్పడానికే, ఈ సర్క్యులర్ ను జారీ చేశారు.
ఒకవేళ ముందే సర్కులర్ ను జారీ చేసి ఉంటే, కోర్టులో కూడా అదే విషయాన్ని చెప్పి ఉండేవారు కదా అని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. న్యాయవాదులు ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిచూపుతూ ఎప్పటికీ అప్పుడు ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేయాలని, దాని ద్వారా ప్రభుత్వం పై సామాన్య ప్రజలు పోరాటం చేయడానికి వెసలు బాటు కల్పించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను 99.7% అమలు చేశామని మిల్లెట్ రెడ్డి చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో మద్య నిషేధం అమలు చేస్తామని చెప్పి, మద్యం ద్వారా లభించే ఆదాయంపై అప్పులను చేశారు.
నవరత్నాలు అన్నారు… వాటికి రంద్రాలను పెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా వాలంటీర్లు ఇళ్లపై వైకాపా జెండాలను, ఇంటి గోడలపై స్టిక్కర్లను వేసుకున్న వారికే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయని బెదిరిస్తున్నారట. ప్రభుత్వం అందజేసే సంక్షేమ పథకాలు మీ అబ్బా బాబు జేబుల్లోంచి తీసి ఖర్చు పెడుతున్నది కావు. ఈ ప్రభుత్వం అధికారంలో నుంచి దిగిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు మళ్లీ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టాక ఇంతకంటే ఎక్కువ అభివృద్ధి, నిజమైన సంక్షేమాన్ని ప్రజలకు అందిస్తామని రఘురామకృష్ణం రాజు తెలిపారు. ఇళ్లపై వైకాపా జెండాలను పెడితే పెట్టించుకుని వెంటనే తొలగించాలని, అలాగే స్టిక్కర్లను తీసివేయాలని సూచించారు.