– నామినేషన్ నుంచి పోలింగ్ వరకూ ప్రజాస్వామ్యం ఖూనీ
– నిర్భయంగా ఎన్నికలు నిర్వహిస్తే వెబ్ కాస్టింగ్ బయటపెట్టండి?
– పక్క నియోజకవర్గాల టీడీపీ నేతలు ఎలా ఓటేశారు?
– పోలింగ్ పరిశీలనపై ఎక్స్ లో చేసిన పోస్టును కలెక్టర్ ఎందుకు డిలీట్ చేశారు?
– – మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) ఫైర్
తాడేపల్లి: పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని వైయస్సార్సీపీ మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. 14 నెలల పాలనలో ప్రజలను అన్నిరకాలుగా వంచించిన కూటమి ప్రభుత్వానికి ఈ జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పులివెందుల ప్రజలు కర్రుకాల్చి వాత పెడతారన్న భయంతో పోలీసులు అండతో దౌర్జన్యకాండకు దిగిందని మండిపడ్డారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ … చంద్రబాబు ప్రభుత్వం ఎన్ని అక్రమాలు చేసినా, ప్రజలకు వాస్తవాలు అర్థమయ్యాయని ప్రజలు వారిని తరిమి కొట్టడం ఖాయమని తేల్చి చెప్పారు. ఇంకా ఆయన ఏమన్నారంటే…
సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు కొన్నిచోట్ల కార్పొరేషన్ కార్పొరేటర్లు దురదృష్టవశాత్తూ మరణించారు. వాటిలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పులివెందులలో ఒక జడ్పీటీసీ, రాజంపేట నియోజకవర్గంలో ఒక జడ్పీటీసీ, కుప్పంలో ఒక ఎంపీటీసీ, ప్రకాశం జిల్లాలో ఒక సర్పంచ్ మచ్చుకు ఎంచుకుని మరీ, మహాగొప్పగా చంద్రబాబు ప్రభుత్వం ఉపఎన్నికలకు మేం సిద్ధంగా ఉన్నామని ఎన్నికల కమిషన్ తో కూడబలుక్కుని ఈ ఎన్నికలు నిర్వహించారు. ఇంకా సుమారు 13 నెలల టర్మ్ ఉన్న జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తూ, నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ, రకరకాల తంతులు నిర్వహించారు.
ఖాకీచొక్కాలను, లాఠీలను, తొత్తులుగా మారిన అధికారులను అడ్డం పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని కొంతమంది ఖాకీ బూట్ల కింది నలిపి, ఛిద్రం చేశారు. చివరకు ఎన్నికల కమిషన్ లో విధులు నిర్వహిస్తున్న అధికారులు… ఐఏఎస్ కు ఎంపికై, రాష్ట్రంలో అత్యున్నత పదవులు వెలగబెట్టి, సమాజానికి దిక్సూచీలుగా నిలబడి, వ్యవస్థను బాగుచేయాల్సిన, ఎన్నికల విధుల్లో ఉన్న కొంతమంది అధికారులు అందుకు భిన్నంగా వ్యవహరించారు. మిగిలిన దేశాలతో పోలిస్తే… మన దేశంలో ఎన్నికలు అత్యంత ప్రజాస్వామ్యయుతంగా జరుగుతాయని జబ్బులు చరుచుకుంటాం.
మనదేశంలో కూడా బీహార్ వంటి రాష్ట్రాలను అందరం వేలిపెట్టి చూపించి మాట్లాడేవాళ్లం. అక్కడ తుపాకీ రాజ్యం నడుస్తుందని.. ఎన్నికలు జరగవని మనకు నీతులు చెప్పే పత్రికలు పుంఖానుపుంఖాలుగా వార్తలు రాసేవి. ఎన్నికల్లో ఏ జరిగిందో కళ్లకు కట్టినట్టు ఆధారాలతో సహా చూపిస్తూ వీటికి సమాధానం ని వైయస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్.జగన్మోహన్ రెడ్డి ఛాలెంజ్ చేశారు. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల పై న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తున్నామని చెప్పారు. వాటికి సమాధానం చెప్పకుండా, వెంటనే మరలా స్క్రీన్ ప్లే మార్చారు.