– చంద్రబాబుగారూ.. ఇకనైనా మారండి
– వ్యవసాయ రంగం సమస్యలపై దృష్టి పెట్టండి
– లేని పక్షంలో వారితో కలిసి ఉద్యమం చేస్తాం
– రాష్ట్రంలో ఏ ఒక్క పంటకూ కనీస గిట్టుబాటు ధర లేదు
– మరోవైపు పెట్టుబడి సాయంతో సహా ఏదీ సక్రమంగా లేదు
– రైతుల హక్కు అయిన ఉచిత పంటల బీమాను ఎత్తేశారు
– సున్నా వడ్డీ పంట రుణాలకూ మంగళం పాడారు మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్రెడ్డి
బ్రాహ్మణపల్లి. వైయస్సార్ కడప జిల్లా: వైయస్సార్ కడప జిల్లా బ్రాహ్మణపల్లిలో పర్యటించిన మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్రెడ్డి, అరటి రైతులను కలుసుకుని వారి సమస్యలు ఆరా తీశారు. ఏ మాత్రం గిట్టుబాటు ధర లేక రైతులు పంటను పొలాల్లోనే వదిలేస్తున్న పరిస్థితి, వారి కష్టాలు చూసిన శ్రీ వైయస్ జగన్ చలించారు. అనంతరం అక్కడే ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగం, రైతాంగం దుస్థితికి అద్దం పడుతున్న అరటి రైతుల కడగండ్లను మాజీ సీఎం, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ వైయస్సార్ కడప జిల్లాలో స్వయంగా చూశారు.
పులివెందుల నుంచి బ్రాహ్మణపల్లి చేరుకున్న ఆయన, అక్కడ అరటి రైతులను కలుసుకున్నారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలు, వారికి జరిగిన నష్టాన్ని ఆరా తీశారు. కిలో అరటికి చివరకు 50 పైసలు కూడా రాకపోవడంతో, దాన్ని అలాగే వదిలేస్తున్నామని, లేదా పశువులకు వేస్తున్నామన్న రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఇంత జరుగుతున్నా, ప్రభుత్వం ఏ మాత్రం ఆదుకోవడం లేదని చెప్పారు. తర్వాత అక్కడే మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగం, రైతుల సమస్యల పట్ల, ప్రభుత్వ ఉదాసీనతను ప్రశ్నించిన ఆయన, ఇకనైనా సీఎం చంద్రబాబు మారకపోతే, రాబోయే రోజుల్లో అందరితో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. రైతు ఏ పరిస్థితుల్లోనూ కష్టపడకూడదు. వారికి అగచాట్లు రాకూడదు అని చెప్పి, తపన పడిన ప్రభుత్వం మాది.
అదే చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతుల బ్రతుకులు మొత్తం తిరోగమనమే. ఈ 18 నెలల కాలంలో దాదాపు 16 సార్లు ప్రకృతి వైపరీత్యాలు.. అతివృష్టి, అనావృష్టితో రైతులు చాలా నష్టపోయారు. వారికి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాల్సిన అవసరం ఉన్నా, వారికి చంద్రబాబు ఇచ్చింది బోడి సున్నా. మొన్నటి మొంథా తుపాన్ నష్టాన్ని కూడా తక్కువ చేసి చూపుతున్నారు. దాదాపు రూ.1100 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాల్సి ఉంది. అది కూడా ఎగరగొట్టిన పరిస్థితి. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వకుండా ఎగ్గొడుతూ, రైతులకు హక్కు అయిన, ఉచిత పంటల బీమా ఇవ్వకుండా, వారి హక్కులు కాలరాశారు. ఈ–క్రాప్ కూడా చేయడం లేదు. మా ప్రభుత్వ హయాంలో 80 లక్షల రైతులకు ఉచిత పంటల బీమా సదుపాయం కల్పించాం.
ఆ విధంగా దాదాపు రూ.7400 కోట్లు అందించాం. ఈరోజు రాష్ట్రంలో 84 లక్షల మంది రైతులు ఉంటే, కేవలం 18 లక్షల మంది రైతులకు పంటల బీమా సదుపాయం ఉంది. మరి మిగిలిన వారి పరిస్థితి ఏమిటి?. విపత్కర పరిస్థితుల్లో రైతులను ఆదుకునే నాథుడే లేడు. ఇన్పుట్ సబ్సిడీ లేదు. హక్కు అయిన ఉచిత పంటల బీమా లేదు. చంద్రబాబు వచ్చాక, ఎరువులు సైతం బ్లాక్‌లో కొనాల్సిన పరిస్థితి. మరోవైపు పెట్టుబడి ఖర్చులు దారుణంగా పెరిగాయి. వారికి పెట్టుబడి సాయం కూడా అందడం లేదు. నాడు మా ప్రభుత్వ హయాంలో రైతులకు ఏటా రూ.13,500 క్రమం తప్పకుండా ఇచ్చాం. పంట వేసే సమయాల్లో మూడు విడతల్లో ఆ మొత్తం ఇచ్చాం. ఏ ఏడాది కూడా దాని ఎగ్గొట్టలేదు. ఈ పెద్దమనిషి చంద్రబాబుగారు, రైతు భరోసా ఎగ్గొట్టి, అన్నదాతా సుఖీభవ అన్నారు.
పీఎం కిసాన్ కాకుండా రూ.20 వేలు ఇస్తానని చెప్పి, తొలి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టారు. రెండేళ్లకు మొత్తం రూ.40 వేలు ఇవ్వాల్సి ఉండగా, కేవలం రూ.10 వేలు ఇచ్చి, మిగిలింది ఎగ్గొట్టారు. అలా రైతులకు పెట్టుబడి సాయం తగినట్లు లేదు. ఇన్పుట్ సబ్సిడీ లేదు. ఉచిత పంటల బీమా లేదు. మరోవైపు పంటలకు ఏ మాత్రం గిట్టుబాటు ధర లేదు. దళారీలతో చంద్రబాబు కుమ్మక్కై, రైతుల బతుకులు అగమ్యగోచరంగా మార్చారు. మా ప్రభుత్వ హయాంలో అరటి టన్ను సగటు ధర రూ.25 వేలు కాగా, గరిష్టంగా రూ.32 వేల వరకు పోయింది. అదే ఈరోజు కనీనం రూ.2 వేలకు కూడా కొనడం లేదు. దీంతో పంట మొత్తం చెట్ల మీదే కుళ్లిపోతోంది. అంత దారుణంగా ఉంది పరిస్థితి. మా ప్రభుత్వ హయాంలో అరటి ఎగుమతి కోసం అనంతపురం నుంచి ఢిల్లీకి రైళ్లు నడిపాం. అరటితో పాటు, ఉద్యాన పంటలు వాటిలో ఎగుమతి చేశాం.
చివరకు బనగానపల్లి నుంచి గువాహటి వరకు రైళ్లు నడిచాయి. మా ప్రభుత్వం రాక ముందు అరటి ఎగుమతి 25 వేల టన్నులు మాత్రమే ఉంటే, మా ప్రభుత్వ హయాంలో 3 లక్షల టన్నుల వరకు ఎగుమతి చేశాం. కేంద్రం నుంచి అవార్డులు కూడా పొందాం. అరటి సాగు. ఎగుమతికి సంబంధించి అవార్డులు పొందాం. ఐసీఏఆర్, నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ బనానా, అసోసియేషన్ ఆఫ్ బనానా ఎక్స్‌పోర్టర్స్ అవార్డు పొందాం. అవన్నీ నాడు ప్రభుత్వాన్ని గొప్పగా చూశాయి. కానీ, ఇప్పుడు ఇలాంటి దారుణ పరిస్థితి చూడాల్సి వస్తుందని అనుకోలేదు. డిసెంబరు వస్తే 8 త్రైమాసికాల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయి. ఒక్కో క్వార్టర్‌కు దాదాపు రూ.700 కోట్లు. అంటే ఏకంగా రూ.5,600 కోట్లు బకాయిలు.
ఇచ్చింది కేవలం రూ.700 కోట్లు. అంటే దాదాపు రూ.4,900 కోట్లు బకాయిలు. మరో రూ.2200 కోట్లు వసతి దీవెన బకాయిలు. ఏటా ఏప్రిల్‌లో రూ.1100 కోట్ల చొప్పున ఇవ్వాల్సింది. అదీ ఇవ్వడం లేదు. దీంతో రెండూ కలిపి రూ.6 వేల కోట్లకు పైగా బకాయిలు. ఇక రైతుల పరిస్థితి చూస్తే ఇంత దారుణంగా ఉంది. ఇక సూపర్‌సిక్స్, సూపర్ సెవెన్ గాలికెగిరిపోయాయి. అక్కచెల్లెమ్మలకు నెలకు రూ.1500 ఇస్తానన్నారు. అలా ఏటా రూ.18 వేలు. అలా వారికి రూ.36 వేల బాకీ. ఇంకా నిరుద్యోగ భృతి నెలకు రూ.3 వేలు ఇస్తానన్నాడు. అలా రెండేళ్లకు రూ.72 వేలు బాకీ. అమ్మ ఒడి రూ.15 వేలు అన్నారు. రూ.2 వేలు కట్ చేశారు. రూ.13 వేలు కూడా ఇవ్వకుండా రూ.8 వేలు, రూ.9 వేలు మాత్రమే ఇచ్చారు.
అందులోనూ 30 లక్షల మందికి కోత పెట్టారు. పెన్షన్లు కొత్తవి ఇవ్వకపోగా, 5 లక్షలు కట్ చేశారు. మా ప్రభుత్వ హయాంలో ఎన్నికల నాటికి 66 లక్షలకు పైగా పెన్షన్లు ఇస్తే, ఈరోజు 61 లక్షల మందికే ఇస్తున్నారు. ఈ ప్రభుత్వంలో ఎవ్వరూ సంతోషంగా లేరు. చంద్రబాబుగారు, మీకు ఒకే విషయం చెబుతున్నాం. ఇంకా మీరు రైతులను పట్టించుకోకపోతే, వారితో కలిసి ఉద్యమం చేస్తాం. మీరు ఇకనైనా మారకపోతే, రాబోయే రోజుల్లో వీళ్లందరి తరపున తీవ్రమైన ఉద్యమాలు జరుగుతాయి.