– పల్నాడు ఎస్పీ ఆఫీసులో ఎమ్మెల్యే హల్చల్ దారుణం
– ప్రభుత్వం వెంటనే కేసు నమోదు చేయాలి
– నానాటికీ దిగజారుతున్న కూటమి ఎమ్మెల్యేలు
– నరసరావుపేట ఎమ్మెల్యే తీరే నిదర్శనం
– పల్నాడు ఎస్పీ ఆఫీసులో దాదాగిరీ చేస్తారా ?
– రాష్ట్రంలో ఎస్పీలు, ఐజీలకే రక్షణ కరువైంది
– గతంలోనూ ఆర్డీవో, ఎక్సైజ్ ఆఫీసుల్లో ఇదే తీరు
– కోటప్పకొండపై హోంగార్డులతో మద్యం అమ్మకాలు
– పోలీసు సంఘాలు ఇప్పటికైనా మౌనం వీడాలి
– మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి డిమాండ్
తాడేపల్లి: రాష్ట్రంలో దిగజారుతున్న శాంతిభద్రతలు, కూటమి ప్రజాప్రతినిధుల విచ్చలవిడితనానికి పల్నాడు ఎస్పీ ఆఫీసులో నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు పది గంటల పాటు చేసిన హంగామాయే నిదర్శనమని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. గతంలోనూ ఆర్డీవో, ఎక్సైజ్ ఆఫీసుల్లోనూ ఇలాగే బెదిరింపులకు దిగినా, ధర్నాలు చేసినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే ఇప్పుడు ఎస్పీ ఆఫీసులో బరితెగించారన్నారు. రాష్ట్రంలో ఎస్పీలు, ఐజీలకే రక్షణ, గౌరవం లేదని దీన్ని బట్టి అర్దం అవుతోందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం నరసరావుపేట ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసి, తగిన చర్యలు తీసుకోవాలని గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు.
కూటమి ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రవర్తిస్తున్న తీరును రాష్ట్ర ప్రజలు అసహ్యించుకుంటున్నారు. మొన్న నరసరావుపేటలో స్థానిక ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 11.30 వరకూ దాదాపు పది గంటల పాటు పల్నాడు ఎస్పీ ఆఫీసులో హల్ చల్ చేశారు. పల్నాడు ఎస్పీ ఆఫీసులో దూరి, ఎవరు వచ్చినా, ఆఖరుకు టీడీపీ నేతలు వచ్చినా కూడా పట్టించుకోకుండా బరి తెగించారు. ఎస్పీ విధులకు తీవ్రంగా ఆటంకం కల్పించారు. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందనే దానికి ఇదే నిదర్శనం.
ఈ మధ్యే టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్ తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడితే ఆయనపై చర్యలు లేవు. కనీసం టీడీపీ నేతలు సమాధానం కూడా చెప్పలేదు. మహేష్ యాదవ్ ఒక్కడే తాను తప్పు చేయలేదని సెల్ఫీ వీడియోలు పెట్టుకున్నాడు. తెలంగాణలో పోలీసు అధికారులు దోషిగా తేల్చిన అతనికి స్టేషన్ బెయిల్ ఇచ్చి పార్లమెంట్ కు పంపుతున్నారు. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఓ అమ్మాయిని నాలుగైదుసార్లు గర్భం చేసి అబార్షన్ చేయిస్తే కనీసం రిపోర్ట్ ఇవ్వలేదు. రాష్ట్ర ప్రజలకు జనసేన పార్టీ కనీస సమాధానం చెప్పలేదు.
నరసరావుపేట ఎమ్మెల్యే హల్ చల్ వ్యవహారం ఇది మొదటిసారి కాదు.ఈ మధ్య ఆర్డీవో ఆఫీసుకు వెళ్లి బెదిరించారు. తన ఓ ఔట్ సోర్సింగ్ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేసి, సాయంత్రం నాలుగు గంటల్లోపు ఉద్యోగం ఇవ్వాల్సిందేనని వార్నింగ్ ఇచ్చాడు. గేదెలకు మేత వేసే వ్యక్తిని తీసుకెళ్లి ఔట్ సోర్సింగ్ ఉద్యోగం ఇవ్వాలని ఆర్డీవో ఆఫీసులో హంగామా సృష్టించారు. గతంలో రాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్ ఆఫీసుకు వెళ్లి ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇవ్వాలని ధర్నా చేశారు.
నరసరావుపేటలో కమిషన్లు ఇవ్వలేదని టీడీపీ వాళ్ల బార్లే మూయించిన చరిత్ర ఆయనది. కోటప్పకొండ తిరునాళ్లలో హోంగార్డులతోనే మద్యం అమ్మించాడు. వాళ్లు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోతే ఎస్పీ సస్పెండ్ చేశారు. ఆయన నడిపిస్తున్న ఐదు పేకాట శిబిరాలను ఎస్పీ పట్టుకున్నారు. నరసరావుపేట ఎస్సార్కేటీ కాలనీ దగ్గర నాలుగు కేజీల గంజాయి దొరికింది. ఈయన చేసే కార్యక్రమాలు ఇవి. ఎస్పీ ఆఫీసులో పది గంటలు ఉంటే అందులో ఐదు గంటలు బాత్ రూమ్ లో కూర్చోవడం ఏంటో ? రాష్ట్ర చరిత్రలో ఓ ఎమ్మెల్యే ఎస్పీ ఆఫీసు బాత్ రూమ్ లో కూర్చోవడం ఎప్పుడూ జరగలేదు. బాత్ రూమ్ లో కూర్చుని నిరసనలు ఏంటో అర్ధం కావట్లేదు. విచిత్రంగా ఐజీ స్థాయి అధికారి వచ్చి ఎమ్మెల్యేను బతిమాలి రాజీ చేశారంటే పరిస్ధితి ఎంత దారుణంగా ఉందో తెలుస్తోంది.
ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యే అరవిందబాబు ఎస్పీ ఆఫీసుకు వెళ్లి పది గంటల పాటు హల్ చల్ చేస్తే 48 గంటలు దాటినా కేసు కూడా నమోదు చేయలేదు. అతను ఏదో ఒక సామాన్య కానిస్టేబులో, ఎస్సైనో, ఎమ్మార్వోనే, ఎండీవోనో అయితే అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఉన్నది జిల్లా పోలీసు అధికారి, ఓ ఐపీఎస్. భారత రాజ్యాంగాన్ని అమలు చేయాలంటే కీలకమైన వ్యక్తులు వారు. ఓ ఐపీఎస్ అధికారిని పది గంటల పాటు అడ్డుకుంటే కేసు పెట్టాలనే ఇంగిత జ్ఞానం కూడా లేదా అని చంద్రబాబు, లోకేష్ లను అడుగుతున్నాను.
నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు విచ్చలవిడిగా మారి బరితెగిస్తున్నారు. సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇచ్చినా కమిషన్లు తీసుకుంటున్నారు. తిరుపతి దర్శనం లేఖలు అమ్ముకుంటున్నారు. నియోజకవర్గంలో అడిగితే ఖాళీ లేవని చెప్పేస్తున్నారు. మాట్లాడితే చంద్రబాబు తోలు తీస్తా అంటాడు. మేం ఒకటే అడుగుతున్నాం.. ఎవరి తోలు తీయాలో చంద్రబాబు చెప్పాలి. మీ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలు చేస్తున్న పనులకు ముందు వారి తోలు తీయాలి.
పేపర్లలో చంద్రబాబు నాయుడు ఎంపీ, ఎమ్మెల్యే మీద సీరియస్ అయ్యారు, కోపంగా ఉన్నారని రాసుకుంటారు. ఇప్పటివరకూ ఆయన 200 సార్లు సీరియస్ అయ్యారు. కానీ చర్యలు మాత్రం జీరో. వాళ్ల పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వివరణలు తీసుకోవడం తప్ప చేసిందేమీ లేదు. శ్రీకాకుళం జిల్లాలో విలేఖరి మీద ఎమ్మెల్యే బూతులు తిట్టినా చంద్రబాబు సీరియస్ అయ్యారు తప్ప ఎవరిపైనా యాక్షన్ తీసుకుంది లేదు. వైఎస్సార్సీపీ నాయకులు ఓ పోలీసును కానీ, అధికారిని కానీ ప్రశ్నిస్తే వాళ్ల విధులు అడ్డుకున్నారని కేసులు పెడుతున్నారు. అంబటి రాంబాబు ఘటనే ఇందుకు తాజా నిదర్శనం. ఆయన మీద మూడు నాలుగు కేసులు పెట్టారు.
గతంలో అంబటి రాంబాబు ఇంటి మీద దాడి చేస్తే పక్కనే ఉండి ఎస్పీ స్పందించలేదు. మా నాయకులు వెళ్లినా కలవలేదు. నరసరావుపేట ఎస్పీ కార్యాలయంలో ఎమ్మెల్యే హల్ చల్ చేస్తుంటే గుంటూరు నుంచి వచ్చి రాజీ చేస్తారా ? ఇదీ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పరిస్ధితి. ఇక ఏ విధంగా ప్రజలకు మీరు సమాధానం చెప్తారు?, చట్టాన్ని, ఈ రాష్ట్రాన్ని ఎలా కాపాడుతారో చంద్రబాబు చెప్పాలి. ఎస్పీలు, ఐజీలకే రక్షణ లేదని నరసరావుపేట ఎమ్మెల్యే ఉదంతం నిరూపిస్తోంది. ఇంత దారుణంగా వ్యవస్థ నడుస్తుంటే ఇంతవరకూ కేసు నమోదు చేయకపోవడం దారుణం.
పోలీసు సంఘాలు కూడా దీనిపై బయటికి వచ్చి స్పందించాలి, వాళ్ల వ్యక్తిత్వం కాపాడుకోవాలి. దేశంలో ఐపీఎస్ లకు ఉన్న గౌరవం కాపాడుకోవాలంటే మీరు మాట్లాడాలి. కార్యకర్త కోసం పని చేయించుకోవడానికి ఎంతదాకా అయినా వెళ్లే వ్యక్తి అని ఎమ్మెల్యే ప్రచారం చేయించుకుంటున్నారు. బాత్ రూమ్ లో కూర్చుని మరీ న్యాయం చేస్తారా ? మీరు అంతగా న్యాయం చేయాలంటే చంద్రబాబుకో, లోకేష్ కో చెప్పి చేయించుకోవచ్చుగా ? వ్యవస్థల్ని ఇంతగా దిగజార్చే కార్యక్రమాలు చేయొద్దు. ఇప్పటికైనా ఎమ్మెల్యే మీద పోలీసులు కేసు నమోదు చేయాలని, ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చూడాలని గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు.