– మనం వాగులు, వంకలు, చెరువులు అనుసంధానం చేద్దాం
– ధర్మవరం టీడీపీ ఇన్ ఛార్జి పరిటాల శ్రీరామ్ పిలుపు
– గొట్లూరులో జలధార-నీటి భద్రత-సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమం ప్రారంభం
– ప్రతి నీటి బొట్టు విలువైనది.. కాపాడుకుందామన్న శ్రీరామ్
ధర్మవరం: ఆరోజు ప్రధానిగా ఉన్న వాజ్ పెయ్ నదుల అనుసంధానం చేయాలని కలలు కన్నారని.. దానిని ముఖ్యమంత్రి చంద్రబాబు సాధ్యం చేసి చూపించారని.. ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ ఛార్జి పరిటాల శ్రీరామ్ అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలధార-నీటి భద్రత-సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ధర్మవరం రూరల్ మండలం గొట్లూరు గ్రామంలో ఈ కార్యక్రమం వందల మంది రైతులు మధ్య ప్రారంభమైంది.
ఈ కార్యక్రమంలో సాగునీటి సంఘాల సభ్యులు, టిడిపి నాయకులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చెరువు వద్ద వంద రోజుల నీటి ప్రణాళిక పై చర్చించారు. ఈ సందర్భంగా శ్రీరామ్ మాట్లాడుతూ ఎక్కడో శ్రీశైలంలో ఉన్న కృష్ణా జలాలు ముదిగుబ్బ వరకు వస్తున్నాయంటే అది ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన కృషి అన్నారు. ఆరోజు ప్రధానిగా ఉన్న అటల్ బిహారీ వాజ్ పెయ్ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నదులన్నీ అనుసంధానం చేస్తే దేశంలో సాగునీటి సమస్యకు పరిష్కారం చూపించవచ్చని ఆలోచించారన్నారు.
అదే స్ఫూర్తితో ముఖ్యమంత్రి చంద్రబాబు నదులు అనుసంధానాన్ని చేశారన్నారు. పోలవరం దగ్గర పట్టిసీమ కట్టి డెల్టా ప్రాంతానికి గోదావరి జలాలను అందించారన్నారు. దీని ద్వారా కృష్ణాజలాల్ని సంపూర్ణంగా మనం వాడుకునే అవకాశం కల్పించారన్నారు. అదే స్ఫూర్తితో ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన ఇలాంటి కార్యక్రమాలు విజయవంతమయ్యాయన్నారు.
కృష్ణా జలాలు మన ప్రాంతానికి రావడానికి కోట్ల రూపాయల ఖర్చు చేస్తున్నారన్నారు. బిస్లరీ వాటర్ కంటే ఎక్కువగా ఇందుకు ఖర్చవుతోందన్నారు.
కాబట్టి ఈ నీటిని జాగ్రత్తగా వినియోగించుకునే విధంగా చూడాలని సూచించారు. వర్షపు నీరు కూడా అంతకంటే విలువైనదని.. ప్రతి నీటి బొట్టును భూమిలో ఇంకే విధంగా మనం చర్యలు తీసుకోవాలన్నారు. ఒక చెరువుకు నీరు రావాలంటే దానికి ఉన్న మార్గాలను అన్వేషించి మరింత మెరుగుపరుచుకోవాలన్నారు. వంకలు, వాగులు, చెరువులను అనుసంధానం చేసుకుంటే నీటి నష్టం ఉండదన్నారు. దీనిని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని ముందుకు నడవాలన్నారు.
ఎక్కడికక్కడ నీటిని నిలుపుకోవడానికి వర్షపు నీటిని నిలుపుకోవడానికి మనం పనులు చేపట్టాలన్నారు. రానున్న పది రోజుల్లో చెరువుల అభివృద్ధికి ఏం చేయాలన్నది ప్రణాళిక రచించాలని.. ఆ తర్వాత 90 రోజుల్లో ఈ పనులు పూర్తి చేయాలన్నారు. మొత్తం వంద రోజుల ప్రణాళికతో వచ్చే వర్షాకాలం నాటికి మంచి ఫలితాలు ఉండే విధంగా చూసుకుందామని.. శ్రీరామ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైతులు, సాగునీటి సంఘాలతో పాటు ప్రజలంతా భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేశారు…