– అమరావతిలో మీ భూముల ధరలు పెరుగుతుంటే రాష్ట్రమంతా చప్పట్లు కొట్టాలా?
– హైదరాబాద్ నేర్పిన పాఠం చూశాక కూడా.. బాబుకు ఎందుకు అర్థంకావడం లేదు?
– విశాఖకు రాజధాని వద్దు అని బాబు అండ్ కో మాట్లాడటం చాలా పెద్ద తప్పు
– సంపద కొద్ది మంది చేతుల్లో ఉండాలన్నది మేం అంగీకరించం
– రాష్ట్ర భవిష్యత్తుకు ‘వికేంద్రీకరణే’ సరైన నిర్ణయం
-65 ఏళ్ళ పాటు ఉమ్మడిగా నిర్మించిన హైదరాబాద్ మనది కాకుండాపోయింది
– అమరావతిని రాష్ట్ర సమస్యగా సృష్టించాలన్నదే చంద్రబాబు ప్రయత్నం
– రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు
విశాఖ పరిపాలనా రాజధానిగా వద్దొంటూ మీరు పాదయాత్ర చేస్తుంటే.. మేం నోరు మూసుకుని కూర్చోవాలా..?, మీరు మా పొట్ట కొడుతుంటే.. వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రజలు ఎప్పటికీ కూలీలుగా, తాపీ మేస్త్రీలుగా, ఇళ్ళల్లో పనిమనుషులుగానే మిగిలిపోవాలా..? అని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు సూటిగా ప్రశ్నించారు. విశాఖకు పరిపాలన రాజధాని వద్దు అని… చంద్రబాబు అండ్ కో మాట్లాడటం చాలా పెద్ద తప్పు అని అన్నారు.
40 ఏళ్ళకు పైగా రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడుకు హైదరాబాద్ విషయంలో ఏం జరిగిందో తెలియదా అని ప్రశ్నించారు .రాష్ట్ర విభజనతో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని, పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ కోసం ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయం సరైనదని ధర్మాన ప్రసాదరావు అన్నారు. అమరావతి ప్రాంతంలో ఉన్నవారి భూములు, ఆస్తులు పెరుగుతుంటే దానికి రాష్ట్రమంతా చప్పట్లు కొట్టాలా..? అని ప్రశ్నించారు. చంద్రబాబు మాటలు విని అరసవెల్లి దేవుడ్ని దర్శనం చేసుకోండి తప్పులేదు కానీ, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజల పీకకోసే పనిచేస్తామంటే తప్పు అని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు.
మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. ఏమన్నారంటే…
అమరావతిని రాష్ట్ర సమస్యగా టీడీపీ చిత్రీకరించాలని చూస్తుంది
అమరావతి అనేది రాష్ట్రం మొత్తానికి సంబంధించిన సమస్యగా చిత్రించాలని రాష్ట్రంలోని టీడీపీ, ప్రతిపక్షనేత చంద్రబాబు, వారికి చెందిన ఓ వర్గం మీడియా అనేక ఎత్తుగడలు వేస్తున్నారు. రైతాంగం పోరాటం చేస్తున్నట్టుగా రాష్ట్రమంతా పాదయాత్ర చేసి మిగతా ప్రజలను మభ్యపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. రాజధాని మీద వైయస్ఆర్ సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత సుదీర్ఘమైన చర్చ అసెంబ్లీలో జరిగింది.
ఆ సభలో వైయస్ఆర్ సీపీ సభ్యుడిగా, ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తిగా, ఉమ్మడి రాష్ట్రంలో పనిచేసిన మంత్రిగా అనేక అనుభవాలు, వాస్తవాలను వివరించడం జరిగింది. అమరావతిని రాజధానిగా చేయడం వెనుక ఉన్న దురుద్దేశపూరితమైన అక్రమ సంపాదన కోసం చేస్తున్న పనిని, వారి అబద్ధాలు,అసత్యాలను శాసనసభలో సుదీర్ఘంగా వివరించడం జరిగింది.
హైదరాబాద్ నేర్పిన పాఠం చూశాక కూడానా..?
ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ రాజధానిగా ఉండేది. హైదరాబాద్‌ను విడిచి రాష్ట్రాన్ని విడదీస్తామంటే ఏకకంఠంతో వీల్లేదని, ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా చెప్పారు. హైదరాబాద్‌ను వదులుకోమని ఎందుకు చెప్పామో ప్రజలంతా ఆలోచన చేయాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత 65 సంవత్సరాల పెట్టుబడిని హైదరాబాద్‌లో పెట్టాం. అభివృద్ధి చేశాం. దేశ దృష్టిని ఆకర్షించే పట్టణంగా హైదరాబాద్ ఎదిగింది. అనేక ఉద్యోగాలు, రెవెన్యూ, ఇండస్ట్రీ అన్నీ హైదరాబాద్‌కు వచ్చాయి. తరువాత ఆ ప్రాంతంలో ఉన్నవారందరికీ ఆంధ్రప్రదేశ్ ను విభజిస్తే.. హైదరాబాద్ మనకే ఉంటుంది కదా.. ఫలాలు అన్నీ మనమే పొందొచ్చు కదా అనే స్వార్థం పెరిగింది. అది తప్పు అని నేను అనను. అందుకోసం ఉద్యమం పెద్ద ఎత్తున నడిపారు. ఏపీ మొత్తం వ్యతిరేకించింది.
ఉమ్మడి రాష్ట్రానికి లభించిన రెవెన్యూను అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందేట్టుగా ఆనాడే పెట్టుబడి పెట్టి ఉంటే.. మిగతా అనేక రాష్ట్రాలు చేసినట్టుగా మనం కూడా చేసి ఉంటే ఇలాంటి ప్రమాదం రాష్ట్రానికి జరిగి ఉండేది కాదు. ఇండస్ట్రీస్ రాష్ట్రం నలుమూలలా పెట్టి, నలుచోట్ల నగరాలు అభివృద్ధి చేసి ఉంటే ప్రత్యేక తెలంగాణ కోరేవారు ఉండేవారు కాదు. ఒకవేళ కోరితే ఇవ్వడానికి ఆవేదన చెందాల్సిన అవసరం కూడా ఉండేది కాదు. రాష్ట్రం విడిపోయిన తరువాత మనం పొరపాటు చేశామని అంతా గుర్తించాం. మళ్ళీ అటువంటి తప్పు జరగకూడదన్నదే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి లక్ష్యం.
అమరావతిలో లక్షల కోట్లు పెడితే మళ్ళీ పాత కథే..
అమరావతిలో 33 వేల ఎకరాలు తీసుకుని, అక్కడ నాలుగు ఐదు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడితో, మరో 60–70 సంవత్సరాలు దానిపై పెట్టుబడి పెడితే.. తెలంగాణలో జరిగిన పనే మళ్లీ జరగదని ఎవరైనా చెప్పగలరా..? మా ప్రాంతాన్ని విడిచివెళ్లండి అని భవిష్యత్తులో ఉత్తరాంధ్ర, రాయలసీమ వారు అంటే.. ఇప్పుడు నష్టపోయిన 65 సంవత్సరాలు కాకుండా.. మరో 60 సంవత్సరాలు నష్టపోయే అవకాశం ఉంది. అందుకోసమే ఈ మోడల్‌ను ప్రపంచంలో ఎక్కడా అంగీకరించడం లేదు. ఒకేచోట పెట్టుబడంతా పెట్టి.. అభివృద్ధి చేసే మోడల్ అంగీకారం కాదు.
అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందే మోడల్ ను బాబు ఎందుకు అంగీకరించడు?
రాజ్యాంగంలో ఏముందంటే.. ఒక రాష్ట్రానికి లభించిన వనరులు, నిధులు అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందడానికి వీలుగా నిర్ణయాలు చేయాలని సూచన ఉంది. కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రాజధాని ఏర్పాటుకు సంబంధించి శివరామకృష్ణన్ కమిటీ వేసింది. ఆ కమిటీ కూడా అదే సూచించింది. సారవంతమైన భూములు వద్దని, నిస్సారవంతమైన మెరక ప్రాంతాలకు వెళ్లాలని, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేసే మోడల్ ఉండాలని సూచన చేశారు. ఇవన్నీ ఎందుకు మరుగునపెట్టారు..? 40 ఏళ్లు రాజకీయాల్లో ఉండి, 14 సంవత్సరాలు అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు హైదరాబాద్‌ను వదులుకున్నందుకు జరిగిన నష్టాన్ని గ్రహించాలి కదా.. అయినా ఎందుకు చేస్తున్నారు అంటే అందులో స్వార్థం ఉంది. అన్ని ప్రాంతాలకు అవకాశం ఉండే మోడల్‌ను చంద్రబాబు ఎందుకు అంగీకరించడం లేదు..?
అమరావతి చుట్టూ బాబు సన్నిహితులు, శ్రేయోభిలాషులు, బంధువుల భూములే
33 వేల ఎకరాల అంచున ఉన్న భూములన్నింటినీ చంద్రబాబు స్నేహితులు, శ్రేయోభిలాషులు, బంధువులు, టీడీపీ నేతలతో కొనిపించారు. రాజధాని నిర్మాణం చేస్తాననే పేరుతో వారందరి ఆస్తుల విలువలు పెంచాలనే వ్యూహంలో, చంద్రబాబు స్వార్థం ఉంది. అందుకోసమని సింగపూర్‌తో గవర్నెంట్ టు గవర్నెంట్ ఒప్పందం అన్నారు.. అది కాదని తెలిసిపోయింది. ఎందుకు చంద్రబాబు అబద్ధం ఆడారు..?. సింగపూర్ పార్లమెంట్లో ఈశ్వరన్ అనే మంత్రి సభ్యుడు అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పాడు.. అవన్నీ అసెంబ్లీలో నేను మాట్లాడాను.
అమరావతి రాజధానిగా వద్దని మేము అనటం లేదే..
మొదట రాజధాని దొనకొండ అని, నూజివీడు అని చంద్రబాబు ఎందుకు ప్రచారం చేశారు. దీంట్లో పూర్తిగా స్వార్థం ఉందని తెలిసిపోతుంది. ప్రజలంతా గుడ్డిగా ఉన్నారా..? అసలు మా ప్రభుత్వం క్యాపిటల్ అమరావతిలో వద్దని చెప్పటంలేదు. సీఎం వైయస్ జగన్ , ప్రభుత్వం అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందే మోడల్ ఉండాలని చెబుతున్నాం. దానికి గానూ శాసన రాజధానిగా అమరావతి, పరిపాలన రాజధానిగా విశాఖపట్నం, న్యాయరాజధానిగా కర్నూలు ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ కమిటీ సూచనకు, రాజ్యాంగం చెప్పినదానికి, రాష్ట్ర ప్రజల కోరికకు ఈ ప్రతిపాదన అనుగుణంగా ఉంది.
విశాఖకు క్యాపిటల్ వద్దంటే ఉత్తరాంధ్ర ప్రజలు నోరుమూసుకుని కూర్చోరు
విశాఖపట్నానికి క్యాపిటల్ వద్దంటే ఉత్తరాంధ్ర ప్రజలు ఎందుకు ఊరుకోవాలి..? మీరు యాత్ర చేస్తే మేము నోరు మూసుకొని కూర్చోవాలా..? గడిచిన టీడీపీ ప్రభుత్వ కాలంలో కేంద్ర ప్రభుత్వం 23 సంస్థలు రాష్ట్రానికి ఇస్తే.. ఒక్క సంస్థ కూడా చంద్రబాబు శ్రీకాకుళం జిల్లాలో పెట్టలేదు. మేము నోరుమూసుకొని ఊరుకోవాలా..? రైతులను రెచ్చగొట్టి మా మీదకు పంపిస్తున్నాడు. రైతులతో మాకు ఎలాంటి వివాదం లేదు. 29 గ్రామాల్లోని రైతులకు న్యాయం జరగాలని వైయస్ఆర్ సీపీ కోరుకుంటుంది. రైతుల ముసుగులో ప్రజలందరి రాజ్యాంగ హక్కులను హరించడం, గడిచిన కాలంలో జరిగిన మోసం మళ్లీ జరగడానికి, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల వాసులకు అభివృద్ధి అక్కర్లేదని నోరు నొక్కడానికి చంద్రబాబు చేసే ప్రయత్నాన్ని మేము అంగీకరించం.
రాజధానిగా విశాఖకు అర్హత లేదని మీరు భావిస్తున్నారా?
రాజధానిగా విశాఖపట్నం అనర్హం అయ్యిందని మీరు గమనించి ఉంటే టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మొట్టమొదటి క్యాబినెట్ మీటింగ్ విశాఖలో ఎందుకు పెట్టారు..? విశాఖ రాజధానికి అర్హత ఉన్న సిటీ అని చంద్రబాబు గతంలో అంగీకరించారు. అలా అని అన్ని క్యాపిటల్స్ విశాఖలోనే పెట్టాలని చెప్పటం లేదు. పరిపాలన రాజధాని విశాఖలో, న్యాయరాజధాని కర్నూలులో, అమరావతిలో శాసన రాజధాని అని ప్రభుత్వం ప్రకటించింది కదా.. దాంట్లో మోసం ఏముంది..? ఈ ప్రభుత్వం ఏనాడూ ఒక్క మాట అబద్ధం చెప్పలేదు.
అమరావతి రాజధాని విషయంలో చంద్రబాబు కంటిన్యూస్‌గా అబద్ధాలు చెప్పారు. ఎక్కడెక్కడో అని ప్రచారం చేసి.. అందరి చేత భూములు కొనిపించి సడన్‌గా అమరావతి అని డిక్లేర్ చేశారు. కేంద్రం సారవంతమైన భూములు రాజధానికి వద్దని చెప్పినా పట్టించుకోలేదు. కేంద్ర కమిటీ సూచనను తుంగలో తొక్కారు చంద్రబాబు. సింగపూర్‌తో జీ2జీ ఒప్పందం అని అబద్ధం చెప్పారు. సింగపూర్ ప్రైవేట్ కంపెనీలతో చంద్రబాబు చేసుకున్న లోపాయకారి ఒప్పందాలను అమలు చేయడానికి ఈ మాయలన్నీ చేశాడు. ముఖ్యమంత్రి మాయ చేయాల్సిన అవసరం ఏంటీ..? సీఎం వైయస్ జగన్ గారు ఫెయిర్‌గా ఉన్నారు. పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ ప్రజల ఆకాంక్ష. హైదరాబాద్‌లో జరిగిన అన్యాయం మళ్లీ పునరావృతం కావొద్దని భావనతో సీఎం వైయస్ జగన్ ఉన్నారు.
ఎన్నేళ్ళపాటు రాష్ట్ర సంపదను అమరావతిలో పెట్టాలి..?
క్యాపిటల్ కోసం 33 వేల ఎకరాలు ఏంటీ..? ఇదంతా మోసం కాదా..? నాలుగు ఐదు లక్షల కోట్ల రూపాయలు అంటే ఎన్ని సంవత్సరాల సంపదను అమరావతిలో ఇన్వెస్ట్ చేయాలని చూస్తున్నావ్.. అంత వరకూ, మిగిలిన రాష్ట్రమంతా నోరుమూసుకొని కూర్చోవాలా..? అమరావతిలో అమాయక రైతుల డిమాండ్‌కు ప్రభుత్వం కూడా సానుకూలంగానే ఉంది. పరిపాలన రాజధాని విశాఖపట్నానికి వద్దు అని చెప్పడం చాలా తప్పు. ఇప్పటికే 70 సంవత్సరాలు నష్టపోయాం.. మళ్లీ నష్టం కలిగించే ప్రయత్నానికి వత్తాసు పలకడం ధర్మం కాదు. చంద్రబాబు చెప్పిన మాటలు నమ్మి మీరు రెచ్చిపోతే ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంత వాసులకు ఎంత ఆవేదన ఉంటుందో ఆలోచన చేయండి. మూడు రాజధానులు వద్దని చెప్పేవారు జీడీపీలో శ్రీకాకుళం వాటా ఎంత అనేది చెప్పగలరా..? ఎందుకు శ్రీకాకుళం తలసరి ఆదాయం తక్కువగా ఉంది..
రాజధానిలో కూలీలుగా, తాపీ మేస్త్రీలుగా, ఇంట్లో పనిచేసే మనుషులుగా శ్రీకాకుళం ప్రాంత వాసులు చేస్తుండాలా..? రాజధాని ప్రాంతంలో ఉన్నవారి భూములు, ఆస్తులు పెరుగుతుంటే దానికి మేము చప్పట్లు కొట్టాలా..? చంద్రబాబు మాటలు విని అరసవెల్లి దేవుడ్ని దర్శనం చేసుకోండి తప్పులేదు కానీ, మా పీకకోసే పనిచేస్తామంటే తప్పు. ఒక ప్రాంతం బాగా అభివృద్ధి చెంది.. ఇంకో ప్రాంతం వెనుకబడిన ప్రాంతంగా ఉండిపోతే.. అభివృద్ధి చెందిన ప్రాంతంలోని ప్రజలు దేశంలో, రాష్ట్రంలో ప్రభుత్వాలు ఇచ్చిన ఇన్సెన్ టీవ్స్, ఇనిస్టిట్యూషన్స్ ఫైనాన్స్ అన్నీ అందిపుచ్చుకొని అత్యంత వెనుకబడిన ప్రాంతాల ప్రజల ఆస్తులను, అవకాశాలను లాగేసుకుంటే, యజమానిగా ఉండే తన ప్రాంతంలోనే కూలీగా పనిచేయాల్సిన పరిస్థితులు ఉత్పన్నం అవుతాయి. అందుకోసం ఇలాంటి పనులను ఎంతమాత్రం అంగీకరించం. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనేది సరైన నిర్ణయం. దేశంలో కూడా ఇలాగే జరగాలి. రాజ్యాంగం చెప్పినట్టుగా వనరులన్నీ అందరికీ అందాలి… అని ధర్మాన ప్రసాదరావు వివరించారు.