Suryaa.co.in

Andhra Pradesh

టీడీపీ ఫోటో షూట్లతో చంద్రబాబు అవినీతికి మరింతగా ప్రచారం

ఎంపీ విజయసాయిరెడ్డి

అక్టోబర్ 17: స్కిల్ స్కాంలో అడ్డంగా దొరికిపోయి అరెస్టైన చంద్రబాబు నాయుడుకి మద్దత్తుగా ఆ పార్టీ నేతలు చేసే “సంకెళ్ల ఫోటో షూట్” లైట్లు ఆర్పేసి కొవ్వొత్తులు వెలిగించే “సెలబ్రేషన్స్” బాబు అవినీతికి మరింతగా ప్రచారం కల్పిస్తున్నాయని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి అన్నారు. సోషల్ మీడియా వేదికగా మంగళవారం పలు అంశాలపై ఆయన తనదైన శైలిలో స్పందించారు. నిరసన పేరుతో డ్రామాలు చేస్తున్న ప్రతిసారీ ఒక వర్గం వాళ్లు మాత్రమే తల్లడిల్లిపోతున్నారని అన్నారు. బాబు పుణ్యాన వీళ్ల అసలు రూపాలు బయటపడుతున్నాయని అన్నారు.

పరువు తీసుకున్న పచ్చ పార్టీ

హక్కుల కోసం పోరాడే పేదలను అణిచివేయాలని చూసినప్పుడు “స్వేఛ్చకు బేడీలు” అంటూ పౌర సంఘాలు నిరసన తెలపడం చూస్తుంటామని అయితే అందుకు భిన్నంగా చంద్రబాబు అనే అవినీతి తిమింగలాన్ని సాక్షాధారాలతో అరెస్టు చేస్తే చేతులకు తాళ్లు, గొలుసులు కట్టుకొని ప్రదర్శనలు చేసి పచ్చ పార్టీ పరువు తీసుకుందని విజయసాయి రెడ్డి అన్నారు. ఈ ఫోటో షూట్ ఐడియా చినబాబు లోకేష్ దేనని టీడీపీ వర్గాల సమాచారమని అన్నారు.

టీడీపీకి పార్టీ అభ్యర్థులు కరువు

తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేయదని, కేవలం 87 స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తుందని అక్కడి పార్టీ అధ్యక్షుడు ప్రకటించడం చూస్తే ఎన్నికల్లో పోటీ చేసేందుకు తెలుగుదేశం పార్టీకి అభ్యర్థులు కరువయ్యారని స్పష్టమవుతోందని విజయసాయి రెడ్డి అన్నారు. ఏపీలో పచ్చ పార్టీ పరిస్థితి ఇంకా దారుణంగా ఉందని విజయసాయి రెడ్డి అన్నారు.

తుపాకీతో బెదిరించి షేర్లు బదలాయించిన రామోజీ

మార్గదర్శి సహ వ్యవస్థాపకుడు జీజే రెడ్డిని తుపాకీతో బెదిరించి అతని షేర్లు శైలజా కిరణ్ పేరిట రామోజీరావు అక్రమంగా బదలాయించారని విజయసాయి రెడ్డి తెలిపారు. జీజే రెడ్డి వారసులపైనా దౌర్జన్యానికి పాల్పడ్డారని చెప్పారు. సంతకం చేస్తావా లేదా అంటూ భయపెట్టి రూ.1,59,69,600 మూలధన విలువైన 288 షేర్లు బదిలీ చేయించుకున్నారని అన్నారు. ఈ మేరకు నమోదు చేసిన కేసులో ఏ-1 గా రామోజీరావు, ఏ-2 గా శైలజా కిరణ్ ఉన్నారని అన్నారు.

LEAVE A RESPONSE