-
ఐదేళ్ల పాటు కనీస వసతులకు నోచుకోని పల్లెలకు మహర్దశ
-
పల్లె పండుగ ద్వారా అభివృద్ధి ఫలాలు గ్రామ స్థాయికి..
-
అధికారం లోనికి వచ్చిన నాలుగు నెలలకే అభివృద్ధి పర్వం మొదలైంది
-
గ్రామాలకు మౌలిక సదుపాయాలు కల్పించే విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు
-
పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి
-
ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుభవం, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పట్టుదలతో ఆంధ్రప్రదేశ్ లో పల్లెటూళ్ళు ప్రగతి పధంలో దూసుకు పోతున్నాయన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. కొడవలూరు మండలం మిక్కిలింపేట గ్రామంలో పల్లె పండుగ కార్యక్రమానికి విచ్చేసిన ఆమెకు టిడిపి కార్యకర్తలు అపూర్వ స్వాగతం పలికారు. మిక్కిలింపేట గ్రామ హరిజనవాడలో 5 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న సిసి రోడ్డును ఆమె శంఖుస్థాపన చేసి శిలా ఫలకం ఆవిష్కరించారు.
అనంతరం జరిగిన బహిరంగ సభలో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ గతంలో వీధి లైట్లకు కూడా బిల్లులు చెల్లించలేని గ్రామ పంచాయతీలలో టిడిపి కూటమి ప్రభుత్వం అధికారం లోనికి వచ్చాక లక్షల రూపాయలు వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నామంటే అది చంద్రబాబు నాయుడు సమర్ధతకు నిదర్శనమన్నారు.
గత ఐదేళ్లలో ఎటువంటి అభివృద్ధికి నోచుకోని గ్రామాలను దశల వారీగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమగ్ర ప్రణాళిక రూపొందించారన్నారు. స్థానికుల విజ్ఞప్తులు స్వీకరించిన అనంతరం ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ రెండో దశ అభివృద్ధి కార్యక్రమాల సందర్భంగా మిక్కిలింపేట గ్రామంలో డ్రైనేజ్ సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్తానని హామీ యిచ్చారు.
గుంతలు పడ్డ మిక్కిలింపేట లింక్ రోడ్డును పునర్ నిర్మించే వరకు ప్యాచ్ వర్కులు చేసి రాక పోకలకు యిబ్బంది లేకుండా చేస్తానన్నారు. ఏడాదికి ముందు పది ఉత్తమ పంచాయతీగా ఎంపికయిన మిక్కిలింపేటకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకంగా అందించే 1 కోటి రూపాయలను కూడా గ్రామాభివృద్ధికి వినియోగించకుండా పక్క దారి పట్టించడం దారుణమన్నారు.
కొడవలూరు మండల పరిధిలోని వివిధ గ్రామాల అభివృద్ధి కోసం పల్లెపండుగ కార్యక్రమంలో భాగంగా 82 లక్షల రూపాయలు మంజూరై ఉన్నాయని ఆ నిధులతో మండల పరిధిలోని వివిధ గ్రామాలలో అత్యవసర అభివృద్ధి పనులకు చేస్తున్నామన్నారు. అధికారం చేపట్టిన నాలుగు నెలలోనే ఓ వైపు సంక్షేమ పధకాలు కొనసాగిస్తూనే మరో వైపు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఆమె అభినందించారు. ఈ నెల 26 వ తేది జరగనున్న తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేసి పార్టీని బలోపేతం చేయవలసిందిగా స్థానిక నాయకులను కోరారు.
ఈ కార్యక్రమంలో కొడవలూరు మండల తహసీల్దార్ స్ఫూర్తి రెడ్డి, ఎంపిడిఓ సుబ్బారావు, కొడవలూరు టిడిపి మండల అధ్యక్షులు అమరేంద్ర రెడ్డి, మండల టిడిపి ఇంచార్జ్ ముంగమూరు శ్రీహరి రెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జి ఎన్ శేఖర్ రెడ్డి, స్థానిక సర్పంచ్ కోడూరు బుజ్జిరెడ్డి, మందపాటి ప్రవీణ్ రెడ్డి, కోడూరు సుధాకర్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, సుమంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.