Suryaa.co.in

Andhra Pradesh

రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై చంద్రబాబు సమీక్ష

– ప్రాజెక్టుల సత్వర పూర్తికి, భూసేకరణ సమస్యల పరిష్కారానికి రైల్వే, రెవెన్యూ, ఆర్ అండ్ బి అధికారులతో టాస్క్ ఫోర్స్ ఏర్పాటుకు సీఎం నిర్ణయం
– టెండర్ల ప్రక్రియ పూర్తి చేసుకుని పనులు జరుగుతున్న అన్ని ప్రాజెక్టులు మూడేళ్లలో పూర్తి చెయ్యాలన్న సిఎం
– డబ్లింగ్ సహా ఇతర ప్రాజెక్టు పనులన్నీ 4 ఏళ్లలో పూర్తి చెయ్యాలని లక్ష్యం నిర్థేశించిన ముఖ్యమంత్రి
– 72 రైల్వే స్టేషన్లలో జరుగుతున్న అభివృద్ది పనులు రెండేళ్లలో పూర్తి చేయాలని సిఎం ఆదేశం
– ప్రతి పాజెక్టుకు నిర్థేశిత సమయం పెట్టుకుని పూర్తి చెయ్యాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు

అమరావతి: రాష్ట్రంలో చేపట్టిన అన్ని రైల్వే ప్రాజెక్టులు నిర్థేశిత లక్ష్యంతో త్వరిత గతిన పూర్తి చెయ్యాలని సిఎం చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో మొత్తం రూ.72 వేల కోట్ల రైల్వే ప్రాజెక్టులు చేపట్టేందుకు తాము సిద్దంగా ఉన్నామని కేంద్ర రైల్వే మంత్రి తెలిపారని..దానికి అనుగుణంగా ప్రాజెక్టులు చేపట్టి, వేగవంతంగా పనులు పూర్తి చెయ్యాలని సీఎం అన్నారు.

. సచివాలయంలో జరిగిన సమీక్షలో రైల్వే లైన్ల పనులు, భూసేకరణ, ఆర్థిక అవసరాలు వంటి అంశాలపై రైల్వే అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సిఎం సమీక్షించారు. ప్రతి ప్రాజెక్టు పురోగతిపై ప్రత్యేకంగా చర్చించారు. ఆయా ప్రాజెక్టుల్లో జాప్యానికి కారణాలను తెలుసుకుని పరిష్కారంపై చర్చించారు. గత ప్రభుత్వ విధానాల కారణంగా రైల్వే ప్రాజెక్టులు పూర్తిగా పడకేశాయని….నేడు అన్ని ప్రాజెక్టులు వేగంగా పూర్తి చెయ్యాలని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ పరంగా భూసేకరణ సమస్యలు తొలగించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రాజెక్టుల సత్వర పూర్తికి, భూసేకరణ సమస్యల పరిష్కారానికి రైల్వే, రెవెన్యూ, ఆర్ అండ్ బి అధికారులతో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని సిఎం నిర్ణయం తీసుకున్నారు. కోటిపల్లి – నర్సాపూర్ రైల్వే లైన్ కు నాలుగు నెలల్లో భూసేకరణ పూర్తి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.

నడికుడి – శ్రీకాళహస్తి మార్గంలో 11 ఎకరాల భూసేకరణకు రూ.20 కోట్లు వెంటనే ఇచ్చేందుకు సిఎం అంగీకారం తెలిపారు. సత్తుపల్లి – కొవ్వూరు లైన్ కు భూ సేకరణ పూర్తి చేసి ప్రాజెక్ట్ పనులు చేపట్టాలని సిఎం ఆదేశించారు. కడప- బెంగుళూరు లైన్ అలైన్మెంట్లో మార్పులు జరిగాయని…దీనిపై మరింత చర్చించి నిర్ణయం తీసుకోవాలని సిఎం అభిప్రాయపడ్డారు. రేణిగుంట- గూడూరు 83 కి.మీ 3వ లైన్ పనులు రూ.884 కోట్లతో చేపట్టాలని అధికారులు తెలిపారు.

ఈ ప్రాజెక్టుకు 4 నెలల్లో భూ సేకరణ పూర్తి చేసి మూడు ఏళ్లలో ప్రాజెక్టు పనులు పూర్తిచెయ్యాలని సిఎం సూచించారు. రాష్ట్రంలో ఇప్పటికే మొదలై పనులు జరుగుతున్న అన్ని రైల్వే ప్రాజెక్టులు 3 ఏళ్లలో పూర్తిచెయ్యాలని సిఎం అధికారులకు సూచించారు. అలాగే డబ్లింగ్ పనులు నాలుగేళ్లలో పూర్తి చెయ్యాలని సిఎం తెలిపారు. గుంటూరు – గుంతకల్ డబ్లింగ్ పనుల కింద చేపట్టిన 401 కిలోమీటర్ల లైన్ పనులను 12 నెల్లలోనే పూర్తి చెయ్యాలన్నారు.

అమృత్ ప్రాజెక్టు కింద కుప్పం రైల్వే స్టేషన్ ను రూ.6.98 కోట్లతో అభివృద్ది చేస్తున్నామని అధికారులు తెలపగా…స్టేషన్ డిజైన్లు మెరుగుపరచాని సిఎం సూచించారు. రూ.433 కోట్లతో విశాఖపట్నం స్టేషన్, రూ.24 కోట్లతో విజయవాడ గుణదల స్టేషన్ పనులు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. గుణదల స్టేషన్ పనులను మార్చినాటికి పూర్తి చేయాలని సిఎం సూచించారు.

అలాగే, రూ.40 కోట్లతో జరగుతున్న గుంటూరు స్టేషన్ అభివృద్ది పనులు, కర్నూలు స్టేషన్ అభివృద్దిపనులు వెంటనే పూర్తి చెయ్యాలన్నారు. మొత్తం 72 స్టేషన్లలో రూ.3,170 కోట్లతో జరుగుతున్న అభివృద్ది పనులు రెండున్నరేళ్లలో పూర్తి చెయ్యాలని సిఎం లక్ష్యంగా నిర్థేసించారు. ఎర్రుపాలెం -అమరావతి – నంబూరు రైల్వే లైన్ కు రూ.2,239 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు సిఎంకు వివరించారు.

రాష్ట్రంలో మొత్తం 390 లెవల్ క్రాసింగ్ లు ఉండగా…..ప్రస్తుతం 83 ఆర్వోబీలు ఉన్నాయని అధికారులు వివరించారు. కొన్ని చోట్ల పనులు జరుగుతున్నాయని….285 ఆర్వోబీలు మంజూరు కావాల్సి ఉందని అధికారులు వివరించారు. అదే విధంగా పలు ఇతర కొత్త ప్రాజెక్టుల ప్రతిపాదనలను అధికారులు సిఎం ముందు ఉంచారు. ఆయా మార్గాలు ఏఏ ప్రాంతాల గుండా వెళుతున్నాయి అనేవిషయంలో సిఎం అధికారులతో చర్చించారు.

మరికొంత సమగ్ర సమాచారంతో కొత్తలైన్ల పై చర్చించాల్సి ఉందని సిఎం అన్నారు. రాష్ట్రంలో రోడ్, రైల్, ఛార్జీలు ఎయిర్ నెట్ వర్క్ లను అనుసంధానం చేస్తూ ప్రాజెక్టులు పూర్తి చేస్తే మంచి ఫలితాలు వస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబుఅన్నారు. దీనికి అనుగుణంగా అధికారులు ప్రాజెక్టుల ప్రణాళికలు సిద్దం చేయాలని సూచించారు. ఈ సమీక్షలో మంత్రి బి.సి. జనార్థన్ రెడ్డి, రైల్వే అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE