– పేదలకు మంచి చేస్తుంటే బాబు అడ్డుకుంటున్నాడు
– చంద్రబాబు బినామీలే అమరావతి రాజధాని జపం చేస్తున్నారు
– సంక్షేమ రథసారథిగా జగన్ పరిపాలన
– రాజ్యసభ సభ్యుడు మోపిదేవి
– నమ్మిన అమరావతి రైతులను సైతం మోసం చేసిన మొదటి ముద్దాయి బాబే
– అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి విఘాతం కలిగిందన్నదే బాబు బాధ
– రాష్ట్రానికి రావాల్సిన నిధులపై బాబు ఏనాడైనా కేంద్రాన్ని అడిగాడా..?
– పేదలను అణగదొక్కడమే బాబు విధానం
– రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్
దేశంలో ఎక్కడా లేని సంక్షేమం ఒక్క ఏపీలోనే అమలు
– కొవిడ్ నేపథ్యంలో దేశంలోనే పారిశ్రామిక వృద్ధి పడిపోయింది
– ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి
న్యూఢిల్లీ : ఎంపీ మోపిదేవి వెంకట రమణ మాట్లాడుతూ.. ఏమన్నారంటే…
దేశంలోనే కనీవినీ ఎరుగని సంక్షేమ కార్యక్రమాల ద్వారా.. రాష్ట్రాన్ని అన్ని విధాలా ముందుకు తీసుకువెళుతూ.. జాతీయ స్థాయిలో మంచి పరిపాలనా దక్షుడిగా, సంక్షేమ రథసారథిగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిమన్ననలను పొందుతున్నారు.ఆంధ్ర రాష్ట్ర ప్రజల దురదృష్టమో తెలియదుగానీ.. చంద్రబాబు నాయుడు పోకడలు, ఆయన మాటలు చూస్తే.. అధికారం కోసం, ఆయన ఏ స్థాయికి అయినా దిగజారుతారని నిరూపిస్తున్నారు.
ప్రత్యేకమైన పరిస్థితుల్లో రాష్ట్రం విడిపోయి, ఆ తర్వాత ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ లో పదేళ్ళు చట్టబద్ధంగా ఉండే వెసులుబాటును కేంద్రం కల్పించినా.. దాన్ని కాదని, చంద్రబాబు సొంత ఎజెండాతో అమరావతి రాజధానిని చేసి, తన వందిమాగధులంతా పెద్దఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి తెరలేపారు. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను అస్తవ్యస్తం చేసి, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి చంద్రబాబు నెట్టారు. చంద్రబాబు అధికారం చేపట్టేనాటికి కేవలం రూ. 96 వేల కోట్లు అప్పులు ఉంటే.. ఆయన దిగిపోయేనాటికి రూ. 3.60 లక్షల కోట్లకు అప్పుల భారాన్ని మోపాడు. రాష్ట్రాన్ని అన్నివిధాలా సర్వనాశనం చేశాడు.
ఆ పరిస్థితుల్లో జగన్ మోహన్ రెడ్డి అధికారం చేపట్టారు. మొక్కవోని ధైర్యంతో ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేయడమే కాకుండా, కొవిడ్ లాంటి సమస్యలు ఎదురైనా, దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటూ, పేదల ఆరోగ్యానికి భరోసా ఇస్తూ పరిపాలన సాగిస్తున్నారు.ఈరోజు అమరావతి రాజధాని పరిరక్షణ పేరుతో యాత్రలు, సభలు నిర్వహిస్తున్నవారు పూర్తిగా చంద్రబాబు బినామీ వ్యక్తులు, ఆయన డైరెక్షన్ లో తెలుగుదేశం కార్యకర్తలు చేస్తున్నదేగానీ, అది రాష్ట్రం కోసం జరిగేది ఎంతమాత్రం కాదు.
గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని, ఒక ప్రాంతంలోనే అభివృద్ధి కేంద్రీకరించకూడదని, అన్ని ప్రాంతాల్లో సమాన అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతో, ముఖ్యమంత్రి గారు మూడు రాజధానుల నిర్ణయం తీసుకోవడం, అమరావతిని శాసన రాజధానిగా, ఎంతోకాలంగా రాయలసీమ ప్రజల చిరకాల డిమాండ్ అయిన ఆ ప్రాంతాన్ని న్యాయ రాజధానిగా, అన్నిరకాలుగా మౌలిక వసతులు ఉన్న విశాఖను పరిపాలనా రాజధానిగా నిర్ణయించారు.
రాయలసీమ ప్రాంతం అభివృద్ధి చెందటం చంద్రబాబుకు ఇష్టం లేదా.. విశాఖ పరిపాలనా రాజధానిగా అభివృద్ధి చెందటం ఇష్టం లేదా.. ? అమరావతే ఏకైక రాజధానిగా ఉండాలంటున్న చంద్రబాబు స్వార్థ రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయో ప్రజలు అర్థం చేసుకుంటున్నారు.ఆంధ్రప్రదేశ్ లో సామాజిక దాడి జరుగుతున్నటువంటి విచిత్రమైన పరిస్థితులు ఉన్నాయి. మరోవైపు ముఖ్యమంత్రి రాష్ట్రంలో సామాజిక మార్పు తీసుకురావడం కోసం, పేదల బాగు కోసం చేస్తున్న కార్యక్రమాలను చంద్రబాబు అడ్డుకుంటున్నారు.
లక్షలాది మంది పేదలకు ఇళ్ళ స్థలాలు, ఇంటి నిర్మాణం చేసి ఇస్తుంటే.. వాటి మీద కోర్టులకు వెళ్ళి ఛాలెంజ్ చేస్తున్నారు. ఎన్నో ఏళ్ళుగా ఎటువంటి హక్కులు లేకుండా ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ళల్లో ఉంటున్న పేదలకు ఓటీఎస్ పథకం ద్వారా న్యాయబద్ధంగా, చట్టపరంగా సంపూర్ణ హక్కులు కల్పిస్తుంటే.. దానికీ అడ్డంకులు సృష్టిస్తున్నారు.
మరోవైపు పేదవాళ్ళ పిల్లలు ఇంగ్లీషు చదువులు చదవకూడదని న్యాయస్థానాల్లో కేసులు వేసి ఛాలెంజ్ చేశారు. అణగారిన వర్గాలకు, సామాన్యులకు కనీస అవసరాలు తీర్చాలని ముఖ్యమంత్రి కృషి చేస్తుంటే.. చంద్రబాబు న్యాయస్థానాల ద్వారా అడ్డుకోవాలని చూడటం, పేదలపై చంద్రబాబు చేస్తున్న సామాజిక దాడిగా అభివర్ణిస్తున్నాం.
ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల గురించి జస్టిస్ చంద్రు మాట్లాడితే.. చంద్రబాబు ఆయననూ అవహేళన చేశారు. దీనినిబట్టి చంద్రబాబు ఎంత అహంభావంతో, కుట్ర పూరితంగా రాజకీయాలు చేస్తున్నారో అర్థమవుతుంది. ఒకవైపు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిగారు, ఎన్ని కష్టాలు ఉన్నా మొక్కవోని ధైర్యంతో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంటే… టీడీపీ ఎంపీలు ఆంధ్ర రాష్ట్రంలో నేరాలు-ఘోరాలు జరిగిపోతున్నాయన్నట్టుగా, కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఏ విధమైన సహాయ, సహకారాలు చేయడానికి వీల్లేదన్నట్టుగా, ఆంధ్ర రాష్ట్ర ప్రతిష్టను మంటగలిపే విధంగా ప్రవర్తిస్తున్న తీరు సభ్య సమాజం తలదించుకునేలా ఉంది.
బాధ్యతగల ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు కొనసాగగలిగితే మంచిది. ఇప్పటికే కుప్పంతో సహా రాష్ట్రం అంతా ప్రజలు ప్రతి ఎన్నికల్లో ఛీత్కరించారు. వాస్తవాలు తెలుసుకుని వ్యవహరించకపోతే, చంద్రబాబుకు, ఆయన పార్టీకి ఇక పుట్టగతులు ఉండవు.
ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ.. ఏమన్నారంటే..
14 ఏళ్ళు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన, సీనియర్ నాయకుడు చంద్రబాబు.. ఏనాడైనా రాష్ట్ర అభివృద్ధికి, పేదల సంక్షేమానికి సంబంధించి ఒక్క విలువైన సూచనగానీ, సలహాగానీ ఇచ్చాడా..
అమరావతి రాజధాని పరిధిలో 29 గ్రామాలపై చంద్రబాబుకు నిజంగా అభిమానం ఉంటే… వారికి నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత ఆయనపైనే ఉంది. అవసరం లేకుండా, 33 వేల ఎకరాలు సేకరించి, కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలన్నదే చంద్రబాబు ఉద్దేశం. తాతలు, తండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిన భూములను రైతుల దగ్గర లాక్కొని మోసం చేసిన మొట్టమొదటి ముద్దాయి ఎవరంటే చంద్రబాబే.
రైతుల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి, ఆ భూములను అమ్ముకోవాలనే దురుద్దేశం చంద్రబాబుకు ఉంది కాబట్టే, ఎక్కడ తన కుట్రలు బయటపడతాయని.. వారికి మేలు చేస్తున్నట్టు నటిస్తూ చిందులు వేస్తున్నాడు. చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకుంటే.. దానికి విఘాతం కలిగిందనేదే ఆయన బాధ.ఎవరినైనా, కొద్దిరోజులు కొంతమందిని మోసం చేయగలరేమోగానీ, అన్నిరోజులూ అందర్నీ మోసం చేయలేరు. ఈ విషయాన్ని చంద్రబాబు తెలుసుకుంటే మంచిది.
రాష్ట్రంలో అందరికీ సామాజిక న్యాయం జరగాలి, పరిపాలన వికేంద్రీకరణ జరిగితే అన్ని ప్రాంతాల వారికీ న్యాయం జరుగుతుందని రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. పరిపాలన వికేంద్రీకరణ చేస్తే..
భవిష్యత్తులో మరోసారి రాష్ట్ర విభజన జరగకుండా ఉంటుందనేది ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి భావన.
అమరావతి యాత్రలు ద్వారా.. ఆంధ్రప్రదేశ్ ప్రజలను మరోసారి రెచ్చగొట్టడానికి చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నాడు. కేవలం రాజకీయ కుట్రతోనే నాలుక ఎలా తిరిగితే అలా మాట్లాడుతున్నాడు.
రాష్ట్ర విభజన జరిగేటప్పుడు.. జనాభా దామాషా ప్రకారం 58 శాతం ఉద్యోగులను, అప్పులను ఆంధ్రప్రదేశ్ కు కేటాయించారు. కానీ, ఆదాయం మాత్రం 58 శాతం ఇవ్వలేదు. రెవెన్యూ లోటు కూడా ప్రతి ఏటా కేంద్ర బడ్జెట్ నుంచి విడుదల చేస్తామని చెప్పి, అదీ ఇవ్వటం లేదు, ఇది చాలా అన్యాయం.చంద్రబాబు హయాంలో చేసిన అప్పుల వల్ల ప్రతి ఏడాది రూ. 25 వేలకోట్లు వడ్డీగా చెల్లించాల్సిన భారాన్ని ఈ ప్రభుత్వంపై మోపాడు.
డ్వాక్రా సంఘాలు చంద్రబాబు పాలనలో పూర్తిగా కుప్పకూలిపోయాయి.
రాజకీయాల్లో కొత్త పోకడలు నేర్పించింది చంద్రబాబే. డబ్బు ప్రవాహం నుంచి.. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ను ప్రోత్సహించడం వరకు.. ఇవన్నీ బాబు తెచ్చినవే. చివరికి వాటికి ఆయనే బలి అవుతాడు.
ఏరోజు అయినా చంద్రబాబు ఢిల్లీ వచ్చి, ప్రత్యేక హోదా ఇవ్వండి, రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన నిధులు ఇవ్వండి, పోలవరం రివైజ్డ్ నిధులు ఇవ్వండి అని కేంద్రాన్ని ఏ ఒక్క రోజు అయినా అడిగారా.. బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకుడిగా ఆ పని చేయాలి. కానీ చంద్రబాబు ఏనాడూ బాధ్యత తీసుకోలేదు.
మాట్లాడేటప్పుడు మంచి భాష మాట్లాడండి. హూందాతనంతో రాజకీయాలు చేయండి. రాబోయే తరాల భవిష్యత్తు కోసం పనిచేసేది రాజనీతి. రాజనీతితో కూడిన ప్రజా పాలన జగన్ మోహన్ రెడ్డిగారు అందిస్తున్నారు.
పోలవరం ప్రాజెక్టుకు నిరుపేదలైన రైతులు సైతం భూములు ఇచ్చారు. వారు ఏ రోజు కూడా మేం త్యాగం చేశామని చెప్పుకోలేదు. ఈరోజు చంద్రబాబు డైరెక్షన్ లో అమరావతి ప్రాంతం వారు త్యాగం అంటూ యాత్రలు చేస్తున్నారు.అమరావతి రాజధాని ప్రాంతంలో దళితులకు, బీసీలకు ఇళ్ళ స్థలాలు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే.. అక్కడ పేదలకు ఇళ్ళ స్థలాలు ఇస్తే డెమోగ్రాఫిక్ ఇం బ్యాలెన్స్ వస్తుందని పిటిషన్ వేయడం ఎంతవరకు ధర్మం..?
మీ పొలాల్లో పనిచేయడానికి, మీ ఇళ్ళల్లో పనిచేయడానికి పేదలు కావాలా.. మీ వీధిలో, మీ గ్రామంలో, మీ ప్రాంతంలో పేదవాళ్ళు ఉండటానికి వీల్లేదా.. ఇదేనా మీ విజ్ఞత చంద్రబాబూ..పేదలను అణగదొక్కడమే బాబు విధానం అనటానికి ఇంతకంటే ఏం ఉదాహరణలు కావాలి.వెనుకబడిన తరగతులవారు న్యాయమూర్తులుగా పనికిరారని చంద్రబాబు అప్పట్లో కేంద్ర న్యాయ శాఖ మంత్రికి లేఖ రాశారు. అటువంటి మాటలు మాట్లాడిన చంద్రబాబును ఏం చేయాలి.
పైగా బీసీలను ఉద్ధరించామని చెబుతూ.. వెనుకబడిన వర్గాల ఓట్లు కోసం వేదికలెక్కి లెక్చర్లు ఇస్తాడు. నలుగురు రాజ్యసభ సభ్యుల ఖాళీలు వస్తే.. అందులో ఇద్దరిని జగన్ రాజ్యసభకు పంపారు. ఆంధ్రప్రదేశ్ లో సంపూర్ణంగా సామాజిక న్యాయం జరుగుతుంది. బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారంలో 60 శాతానికి పైగా వాటా ఇస్తున్నారు.
ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. ఏమన్నారంటే..
జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్ళు అయితే.. అందులో ఏడాదిన్నర కొవిడ్ ఉంది. మరోవైపు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రావడం లేదు. జీఎస్టీ బకాయిలు కూడా ఇవ్వడం లేదు. ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా.. సంక్షేమ పథకాలను ముందుకు తీసుకువెళుతున్నారు.
పారిశ్రామిక వృద్ధి ఒక్క మన రాష్ట్రంలోనే కాదు. యావత్తు దేశంలోనే తగ్గింది. కొవిడ్ సమయంలో పారిశ్రామికవేత్తలు వెనక్కి తగ్గుతున్నారు.పరిశ్రమలు వస్తే.. ఉద్యోగ అవకాశాలు వస్తాయి. దాంతో ఆదాయం పెరుగుతుంది.
కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, హక్కులపై సీనియర్ నేత అని చెప్పుకునే చంద్రబాబు ఎందుకు అడగరు.దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా జగన్ గారు పెద్దఎత్తున సంక్షేమ కార్యక్రమాలను ఎలా అమలు చేస్తున్నారని.. మిగతా రాష్ట్రాలకు చెందిన ఎంపీలు కూడా పార్లమెంటు హాలులో మమ్మల్ని అడుగుతున్నారు. జగన్ గారు సంక్షేమ పాలన అందిస్తూ, పేదవాడికి అండగా నిలబడ్డారు. మీడియా సమావేశంలో ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ కూడా పాల్గొన్నారు.