Suryaa.co.in

Andhra Pradesh

సోము వీర్రాజు అల్లుడిపై చీటింగ్ కేసు

మరొకరి ఆస్తులు చూపి బ్యాంకునుంచి 15 కోట్లు రుణం
బీజేపీని కుదిపేస్తున్న అల్లుడుగారి చీటింగ్ యవ్వారం
( మార్తి సుబ్రహ్మణ్యం)

బ్యాంకులను మోసం చేశారంటూ వైసీపీ, టీడీపీ నేతలపై ఇప్పటివరకూ విరుచుకుపడుతున్న ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సొంత అల్లుడే ఇప్పుడు బ్యాంకును మోసం చేసిన వైనం సంచలనం సృష్టిస్తోంది. గద్దె జయరామకృష్ణ ఆస్తి పత్రాలను ఫోర్జరీ చేసిన సోము అల్లుడు కవల వెంకట నరసింహం, వాటిని కొవ్వూరు ఎస్‌బీఐ బ్రాంచిలో గ్యారంటీగా పెట్టి రుణం 15 కోట్ల రూపాయలు తీసుకున్నారు.

ఈ విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న అసలు హక్కుదారయిన గద్దె జయరామకృష్ణ , గత నెల 4న కొవ్వూరు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే ఈ వ్యవహారం వెలుగుచూడకుండా అప్పట్లో కొంత మేనేజ్ చేసినప్పటికీ, ఎట్టకేలకు అది తాజాగా వెలుగులోకి వచ్చింది. కేసును విచారించిన పోలీసులు సోము వీర్రాజు అల్లుడు కవల వెంకట నరసింహంపై ఐపీసీ 406, 419, 420, 465 కేసులు నమోదు చేశారు.

అయితే సోము వీర్రాజు కూతురు మాత్రం, తన తండ్రి ప్రతిష్ఠను దెబ్బతీసే కుట్ర జరుగుతోందని, పెళ్లైన తర్వాత తమకు, తండ్రికి సంబంధాలు లేవని, ఆయనెప్పుడూ తమ ఇంటికి రాలేదని చెప్పారు. బిజినెస్‌లో భాగంగానే రుణం తీసుకున్నామని, డబ్బులకు సంబంధించి నిన్న రాజమండ్రిలో పెద్దమనుషులతో చర్చలు కూడా జరిగాయని సూర్యకుమారి మీడియాకు చెప్పారు. అయితే.. బాధితుడు జయరాం కుటుంబంతో గతంలో సన్నిహితంగా ఉన్న సోము అల్లుడు, దానిని అడ్డుపెట్టుకుని జయరాం ఆస్తి పత్రాలు చీటింగ్ చేసి, జయరాం, ఆయన భార్య శ్రీవాణి సంతకాలు ఫోర్జరీ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

తాజాగా వెలుగులోకి వచ్చిన సోము అల్లుడి చీటింగ్ వ్యవహారం బీజేపీని కుదిపేస్తోంది. ఇప్పటికే పలు వివాదాస్పద ప్రకటనలతో వార్తల్లో నానుతున్న వీర్రాజుకు, ఇది సహజంగానే శిరోభారంగా పరిణమించింది. ఇటీవల జరిగిన సభలు, ప్రెస్‌మీట్లలో టీడీపీ, వైసీపీ మాదిరిగా తామేమీ బ్యాంకులను మోసం చేయలేదని సోము ఎదురుదాడి చేశారు. కానీ విచిత్రంగా, ఆయన సొంత అల్లుడే చివరికి బ్యాంకును మోసం చేశారన్న ఆరోపణలపై కేసు ఎదుర్కోవడం నైతికంగా వీర్రాజును నైతికంగా, రాజకీయంగా ఇబ్బందిపాలు చేసింది.అయితే ఈ వ్యవహారంతో సోముకు సంబంధం లేకపోయినా, బ్యాంకును చీటింగు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు సొంత అల్లుడు కావడంతో, ఈ వ్యవహారం ఆయనకు రాజకీయంగా ఇబ్బంది కలిగించే అంశమేనని అటు పార్టీ వర్గాలు కూడా అంగీకరిస్తున్నాయి.

‘ఈ వ్యవహారంతో మా పార్టీ ప్రతిష్ఠకు ఇబ్బందే.. అందులో వీర్రాజుకు ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికీ, మేం వైసీపీ-టీడీపీ నేతల బ్యాంకు మోసాలపై విమర్శలు చేస్తున్నందున, ఇప్పుడు అదే అంశం మాకు సహజంగా ఇబ్బంది కలిగించకమానదు. అయితే మేం దీన్ని పార్టీ పరంగా ఖండించలేం. అది పూర్తిగా వీర్రాజు గారి వ్యక్తిగత, కుటుంబ వ్యవహారం’ అని కాకినాడ పార్లమెంటు బీజేపీ నేత ఒకరు వ్యాఖ్యానించారు.

అటు పార్టీ నేతలు వీర్రాజు అల్లుడిపై నమోదయిన కేసు వ్యవహారాన్ని ఖండించేందుకు ముందుకురావడం లేదు. బ్యాంకులు కేంద్రప్రభుత్వానివే కాబట్టి, ఒకవేళ తాము పార్టీ పరంగా ఈ కేసును ఖండిస్తే కేంద్రప్రభుత్వాన్ని విమర్శించినవాళ్లమవుతామని బీజేపీ అగ్రనేతలు చెబుతున్నారు.

‘మేం కావాలంటే వీర్రాజు గారికి నైతికంగా వ్యక్తిగత హోదాలో మద్దతునీయగలుగుతాం. ఆయనంటే మాకు గౌరవం. అంతేగానీ పార్టీ పరంగా ఆ కేసును ఖండించలేం. విచారణలో అన్నీ తేలతాయి. బ్యాంకుల చీటింగ్ వ్యవహారంలో దర్యాప్తు సంస్థలు కఠినంగానే ఉంటాయి. ఎంతటివారినయినా తప్పయితే ఉపేక్షించవు’ అని సీమకు చెందిన ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు. నేతల వ్యాఖ్యలు పరిశీలిస్తే, అల్లుడి బ్యాంకు చీటింగ్, ఫోర్జరీ కేసులో సోముకు పార్టీ దన్నుగా నిలిచే అవకాశం కనిపించడం లేదు.

సోము వీర్రాజు మౌనం
కాగా తన అల్లుడిపై చీటింగ్, ఫోర్జరీ కేసు నమోదయిన నేపథ్యంలో సోము వీర్రాజు ఈ ఘటనపై ఇప్పటిదాకా స్పందించలేదు. ఆయన ప్రస్తుతం ఆర్‌ఎస్‌ఎస్ నూతక్కిలో నిర్వహిస్తున్న వివిధ క్షేత్రాల కార్యక్రమంలో ఉన్నట్లు పార్టీ నేతలు చెప్పారు.

LEAVE A RESPONSE