– టన్నులకొద్దీ తూటుకాడ నీటి ప్రవాహానికి అడ్డు
– నిలువ చేయడం ద్వారా గుంటూరు నగరం తో పాటు పరిసర గ్రామాలకు తాగు, సాగునీరు గా ఉపయోగం
– వర్షపు నీటిని తొలగించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలి
– గుంటూరు జిల్లా కార్యదర్శి వై. నేతాజీ
– నీరుకొండ వద్ద కొండవీటి వాగు ప్రవాహాన్ని పరిశీలించిన సిపిఎం బృందం
గుంటూరు: కొండవీడు దగ్గర నుండి వస్తున్న వర్షపు నీరును మేడికొండూరు, ఫిరంగిపురం మండలాల పరిధిలో చెక్ డాములు నిర్మించి నీరు నిల్వ చేయడం ద్వారా గుంటూరు నగర ప్రజలకు, పరిసర గ్రామాలలో సాగుకు తాగు నీరుకు ఉపయోగించుకునే అవకాశం ఉంటుందని గుంటూరు జిల్లా సిపిఎం కార్యదర్శి వై. నేతాజీ అన్నారు.
పాలకుల నిర్లక్ష్యం వల్ల ప్రతి ఏటా వర్షాకాలంలో కొండవీటి వాగు ముంపు వలన పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. కాలవలలో దిట్టంగా పెరిగిన తూటుకాడను వర్షాకాలం ముందే ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకొని ప్రభుత్వం, అధికార యంత్రాంగము తొలగించి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితులు వచ్చేవి కావని, చేతులు కాలాక ఆకులు పట్టుకున్న సందంగా కొండవీటి వాగు పరవళ్ళు తొక్కుతున్న సమయంలో ఇప్పుడు తూటుకాడ తొలగించే పనుల లో అధికార యంత్రాంగం నిమగ్నం అవటం వారి నిర్లక్ష్యానికి నిదర్శనం అని అన్నారు.
టన్నులకొద్దీ తూటుకాడ నీటి ప్రవాహానికి అడ్డు గా ఉండటం, బైపాస్ రోడ్డు సందర్భంగా వేసిన మట్టి కుప్పలు తొలగించకపోవడం లాంటి కారణాలతో వరద ప్రభావం ఎక్కువగా కనిపిస్తుందని అన్నారు. ఇవే చర్యలు ముందస్తుగా చేపడితే ఆందోళనపడే పరిస్థితులు వచ్చేవి కావని అన్నారు.
దిగువకొచ్చే వర్షపు నీటిని రాజధాని మాస్టర్ ప్లాన్ లో ఉన్న స్టోరేజ్ ట్యాంకులు సత్వరమే పూర్తి చేయడం ద్వారా రాజధాని పనులు నిరాటంకంగా కొనసాగించేందుకు అంతరాయం లేకుండా, నిర్మాణాలు వేగంగా పూర్తి చేసేందుకు అవకాశం ఉండేదని అన్నారు. ప్రభుత్వం ముందస్తుగా వర్షపు నీటిని తొలగించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు
ఉన్న నీటిని తొలగించేందుకు ఇప్పుడు చేపట్టినటువంటి చర్యలను మరింత వేగవంతం చేయడం ద్వారా పనులు వెంటనే తిరిగి ప్రారంభించేందుకు వీలవుతుందని అన్నారు. ఇప్పటికైనా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా రాజధాని నిర్మాణ పనులు మరింత వేగవంతం చేసేందుకు అవకాశం ఉంటుందని సిపిఎం అభిప్రాయపడుతున్నట్లుగా నేతాజీ తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి డివిజన్ నాయకులు ఎం భాగ్యరాజు గైరబోయిన నాగేశ్వరరావు కుంపటి వీరయ్య తదితరులు పాల్గొన్నారు