– తెలంగాణపై మంత్రి అప్పలరాజు వ్యాఖ్యలతో వైసీపీ సంకటం
– తెలంగాణ వాళ్లు తెలివితక్కువ వాళ్లని వ్యాఖ్య
– బుర్రతక్కువ తెలంగాణ వాళ్లని వాచాలత
– ఆంధ్రావాళ్లు హైదరాబాద్ వెళ్లకపోతే అడుక్కుతింటారన్న పరుషపదజాలం
– సెంటిమంట రాజేసిన మంత్రి అప్పలరాజు
– అది పార్టీ అభిప్రాయమా? మంత్రి అభిప్రాయమా?
– ఇప్పటిదాకా ఖండించని పార్టీ నాయకత్వం
– మంత్రి వ్యాఖ్యలను ముఖ్యమంత్రి ఆమోదించినట్టేనా?
– నాయకత్వ మౌనంతో ఆత్మరక్షణలో వైసీపీ నేతలు
– జగన్ మౌనం వ్యూహాత్మకమా? రక్ష ణాత్మకమా?
– సెంటిమెంటు ర గిలించి బీఆర్‌ఎస్‌కు లబ్ధి కలిగించే ఎత్తుగడనా?
– అందుకే మంత్రి అప్పలరాజుపై చర్యల కొరడా ఝళిపించలేదా?
– హైదరాబాద్‌లో ఆస్తులున్న వైసీపీ అగ్రనేతల సంకటం
– మంత్రి వ్యాఖ్యలపై ఆంధ్రాలోనే ఆగ్రహం
– తెలంగాణ వచ్చినా ఇప్పటిదాకా ఎవరిపైనా దాడులు జరగని వైనం
– ఆంధ్రావారికి కార్పొరేటర్, ఎమ్మెల్యే సీట్లిచ్చిన కేసీఆర్
– విభజన తర్వాత కూడా హైదరాబాద్‌కు ఆగని వలసలు
– అన్ని రంగాల్లో ఆంధ్రా చతికిలపడటమే కారణమా?
– మంత్రిని బర్తరఫ్ చేయటంపైనే వైసీపీ చిత్తశుద్ధి
( మార్తి సుబ్రహ్మణ్యం)
తెలంగాణ వారిని బుర్రతక్కువాళ్లు, ఆంధ్రావాళ్లు హైదరాబాద్ వెళ్లకపోతే అడుక్కుతింటారన్న ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు ఇప్పుడు తమ పార్టీకి ‘చీదర అప్పలరాజు’గా మారారని వైసీపీ శ్రేణులు నెత్తిపట్టుకుంటున్నాయి. మంత్రి అప్పలరాజు వ్యాఖ్యలు వైసీపీ నేతలను ఆత్మరక్షణలో పడేయగా, నాయకత్వం మాత్రం ఇప్పటిదాకా మంత్రి వ్యాఖ్యలపై పెదవి విప్పకపోవడం విస్మయం కలిగిస్తోంది. అంటే ఆ ప్రకారంగా.. మంత్రి వ్యాఖ్యల వెనుక నాయకత్వం ఉందా? జగన్ మౌనం వ్యూహాత్మకమా?
రక్షణాత్మకమా? ఇవన్నీ కాకపోతే.. గత ఎన్నికల ముందు మాదిరి… తెలంగాణలో సెంటిమెంట్ రగిలించి, బీఆర్‌ఎస్‌కు లబ్థి కలిగించే ఎత్తుగడనా? లేకపోతే.. తెలంగాణ సర్కారుతో భుజం భుజం రాసుకుని తిరిగే వైసీపీ నాయకత్వం, మంత్రి వాచాలతను ఎందుకు క్షమిస్తోంది? అసలు ఇదంతా ఉత్తుత్తి యుద్ధమా? నువ్వు కొట్టినట్లు నటించు-నేను ఏడ్చినట్లు నటిస్తాననే మ్యాచ్‌ఫిక్సింగ్ వ్యవహారమా?.. ఇదీ ఇప్పుడు వైసీపీ నేతల గందరగోళం.
తెలంగాణ వారిపై ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు చేసిన, అహంకారపూరిత వ్యాఖ్యలపై తెలంగాణను అటుంచి.. ఆంధ్రాలోనే ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రధానంగా అధికార వైసీపీ వర్గాలే మంత్రి వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం-కేసీఆర్ కుటుంబంతో అత్యంత సన్నిహితంగా ఉంటూ, ఉమ్మడి రాజకీయాలు నడుపుతున్న నేపథ్యంలో, మంత్రి అప్పలరాజు తెలంగాణపై చేసిన పరుష వ్యాఖ్యలు ఎవరికి నష్టమన్న చర్చ జరగుతోంది. దానికంటే ముందు.. అసలు ఇదంతా ‘ఇద్దరూ జమిలిగా’ ఆడుతున్న రాజకీయ క్రీడనా? లేక మంత్రి సొంత తెలివితేటల నోటిదూలతో వచ్చిన సమస్యనా? అర్ధం కాక వైసీపీ నేతలు జుత్తు పీక్కుంటున్నారు.
తెలంగాణ వారిపై మంత్రి అప్పలరాజు చేసిన వ్యాఖ్యలపె, ై బీఆర్‌ఎస్ నేతలు మాత్రమే విరుచుకుపడుతుంటే… అటు ఆంధ్రా నుంచి ఆయనకు మద్దతుగా వైసీపీలోని ఒకరిద్దరి మాత్రమే మాట్లాడుతున్నారు. ఈ వ్యవహారంలో తెలంగాణ నుంచి బీజేపీ-కాంగ్రెస్, ఏపీలో టీడీపీ-బీజేపీ నేతలు కూడా మౌనంగా ఉండటం ప్రస్తావనార్హం. మాజీ మంత్రి పేర్ని నాని మధ్యలో ఈ వివాదంలోకి, తెలంగాణ మంత్రి హరీష్‌రావును తీసుకురావడం, దానిని బీఆర్‌ఎస్ నేతలు-మంత్రులు తిప్పికొట్టడం వంటి పరిణామాలు వేగ ంగా జరిగిపోయాయి.
విచిత్రంగా తమ మంత్రులు-నేతల ప్రకటనలను.. అటు బీఆర్‌ఎస్ గానీ, ఇటు వైసీపీ నాయకత్వం గానీ ఖండించకపోవడం- తమ నేతలను నియంత్రించకపోవడంపై, ఆశ్చర్యంతో కూడిన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నాయకత్వాల అనుమతి లేనిదే, మంత్రులు సొంతంగా మాట్లాడే పరిస్థితి లేని విషయాన్ని, పార్టీ వర్గాలు గుర్తు చేస్తున్నాయి.
తెలంగాణపై మంత్రి అప్పలరాజు చేసిన వ్యాఖ్యలపై , తెలంగాణలో నివసించే జగన్ అభిమానులు సైతం మండిపడుతున్నారు. ఇలాంటి ప్రకటనల వల్ల తెలంగాణలో నివసించే తమకు ఇబ్బందేననని స్పష్టం చేస్తున్నారు. రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి, ఇప్పటివరకూ హైదరాబాద్‌లోగానీ, తెలంగాణ రాష్ట్రంలోగానీ సెటిలర్లపై ఒక్క దాడి కూడా జరగని విషయాన్ని గుర్తు చేస్తున్నారు. పైగా ఇటీవల జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో.. సెటిలర్లు ఉన్న డివిజన్లలో బీఆర్‌ఎస్‌ను గెలిపించారంటున్నారు.
బీఆర్‌ఎస్ కూడా సెటిలర్లకు కార్పొరేటర్లు, ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ప్రధానంగా.. తెలంగాణ వచ్చినప్పటికీ, కీలక శాఖల్లో అన్ని కాంట్రాక్టులూ ఆంధ్రా వారికే పెద్దపీట వేస్తున్న వైనాన్ని విస్మరించకూడదంటున్నారు.
అటు ఏపీ వైసీపీ నేతలు కూడా, మంత్రి వ్యాఖ్యలను తప్పు పడుతున్నారు. మంత్రి దురహంకార వ్యాఖ్యల వల్ల.. హైదరాబాద్‌లో ఉంటున్న వైసీపీ అగ్రనేతలు ఇబ్బందిలోపడతారంటున్నారు. ఒక ప్రాంత ప్రజల అలవాట్లు, జీవన విధానాన్ని విమర్శించడం అహంకారానికి నిదర్శనమని స్పష్టం చేస్తున్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా , ఆంధ్రా నుంచి లక్షల సంఖ్యలో వలస వ స్తున్న విషయాన్ని, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఇటీవల వెల్లడించిన వైనాన్ని గుర్తు చేస్తున్నారు.
కరోనా బారిన పడ్డ మంంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు ఆంధ్రాలో కాకుండా.. హైదరాబాద్‌కు వచ్చి చికిత్స చేయించుకున్న విషయాన్ని, మంత్రి మర్చిపోయినట్లున్నారని వైసీపీ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. రాజధాని లేక, పనులు రాక, అన్ని రంగాలు చతికిలడిన ఆంధ్రాను.. ఇప్పుడు తెలంగాణ ఒక్కటే ఆదుకుంటున్న వాస్తవాన్ని విస్మరించకూడదంటున్నారు.
మంత్రి వ్యాఖ్యలు దుమారం సృష్టిస్తున్నప్పటికీ, పార్టీ అధినేత-సీఎం జగన్ ఇప్పటిదాకా స్పందించకపోవడమే వైసీపీ వర్గాలను విస్మయపరుస్తోంది. అప్పలరాజును సీఎం మందలించారన్న లీకు వార్తలు తప్ప.. అధికారికంగా ఇప్పటిదాకా ఒక్క అధికారిక ప్రకటన కూడా రాకపోవడంపై, విస్మయం ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఇరు రాష్ట్ర ప్రజల సంబంధాలు- తెలంగాణ ఆత్మగౌరవానికి సంబంధించిన ఈ అంశంపై, జగన్ స్పందించకపోవడం దారుణమంటున్నారు.
దీన్ని బట్టి.. మంత్రి అప్పలరాజు, కారుమూరి నాగేశ్వరరావు, మాజీ మంత్రి పేర్ని వ్యాఖ్యలకు సీఎం ఆమోదం ఉందన్న సంకేతాలు వెళుతున్నాయని, వైసీపీ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. అదే సమయంలో తెలంగాణ మంత్రుల ఎదురుదాడి వెనుక, సీఎం కేసీఆర్ గ్రీన్‌సిగ్నల్ ఉందన్న విషయం స్పష్టమవుతోందని విశ్లేషిస్తున్నారు. కేసీఆర్-జగన్ అనుమతి లేనిదే మంత్రులు-ఎమ్మెల్యేలకు ప్రెస్‌మీట్లు పెట్టే ధైర్యం లేదని గుర్తు చేస్తున్నారు.
నిజంగా జగన్ అనుమతి లేకుండానే.. మంత్రులు తెలంగాణపై విమర్శలు చేసి ఉంటే, ఈపాటికే అప్పలరాజు, కారుమూరిని మంత్రి పదవి నుంచి తొలగించి ఉండేవారని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కనీసం పార్టీ క్రమశిక్షణ కమిటీ కూడా స్పందించలేదంటే .. ఇదంతా ముందస్తు వూహ్యమేనన్న అనుమానాలు రావడం సహజమంటున్నారు.
సమస్యల్లో ఉన్న బీఆర్‌ఎస్‌ను గద్దెనెక్కించి, రుణం తీర్చుకుని, రిటర్న్ గిఫ్టు ఇచ్చేందుకే వైసీపీ ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకువచ్చిందన్న వ్యాఖ్యలు, రాజకీయ వ ర్గాల్లో వినిపిస్తున్నాయి. గత ఎన్నికల ముందు మాదిరిగా.. తెలంగాణ సెంటిమెంట్‌ను రాజేసి, బీఆర్‌ఎస్‌కు లబ్ధి కలిగించేందుకే, వైసీపీ వ్యూహాత్మకంగా మంత్రులను తెరపైకి తెచ్చిందన్న వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. గత ఎన్నికల్లో తనను గెలిపించిన కేసీఆర్ రుణం తీర్చుకునేందుకే, వైసీపీ సెంటి‘మంట’ పెడుతోందన్న అనుమానాలు కూడా ఏపీ ప్రజల్లో లేకపోలేదు.
అయితే.. ఇటు తెలంగాణ-అటు ఆంధ్రాలో బీఆర్‌ఎస్-వైసీపీ ఆశించిన పాత సెంటిమెంట్ రాజకీయ అస్ర్తాలు ఇప్పుడు పనిచేసే అవకాశాలు లేవంటున్నారు. ప్రాంతీయ పార్టీగా ఉన్న టీఆర్‌ఎస్‌ను, బీఆర్‌ఎస్ జాతీయ పార్టీగా మార్చిన తర్వాత… తెలంగాణ సెంటిమెంట్ రేపినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.