75 మంది చిరు వ్యాపారులకు తోపుడు బండ్ల పంపిణీ
పెనుకొండ:సామాజిక సేవలో చేతన ఫౌండేషన్ అందిస్తున్న సేవలు అభినందనీయమని రాష్ట్ర బీసీ సంక్షేమ, ఈడబ్ల్యూఎస్, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత అన్నారు. పెనుకొండలోని తన క్యాంపు కార్యాలయంలో చేతన ఫౌండేషన్ సహకారంతో 75 మంది చిరు వ్యాపారులకు తోపుడు బండ్లను మంత్రి సవిత చేతుల మీదుగా పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సామాజిక సేవలో లభించే సంతృప్తి ఎన్ని పదవులు వచ్చినా రాదన్నారు. పెనుకొండ నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు చేపట్టాలని కోరిన వెంటనే గత సంవత్సరం కుట్టు మిషన్లు, తోపుడు బండ్లను చేతన ఫౌండేషన్ అందజేసిందని గుర్తుచేశారు. మానవ సేవే మాధవ సేవ అనే నమ్మకంతో చేతన ఫౌండేషన్ చైర్మన్ రవికుమార్ సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నారని ప్రశంసించారు.
గత ఐదేళ్లలో జగన్ ప్రభుత్వ అసమర్థత వల్ల విద్యా వ్యవస్థతో పాటు అనేక రంగాలు దెబ్బతిన్నాయని విమర్శించారు. 18 నెలల క్రితమే అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అన్ని వ్యవస్థలను గాడిలో పెట్టేందుకు చర్యలు తీసుకుంటోందన్నారు.
చేతన ఫౌండేషన్ చైర్మన్ రవికుమార్ మాట్లాడుతూ, తమ సంస్థ గత 20 ఏళ్లుగా నిరంతరంగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, భవిష్యత్తులో కూడా ఇదే సేవా భావనతో ముందుకు సాగుతామని తెలిపారు. అనంతరం 75 మంది లబ్ధిదారులకు తోపుడు బండ్లను మంత్రి సవిత పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సవిత దంపతులను చేతన ఫౌండేషన్ నిర్వాహకులు సత్కరించారు. అలాగే చేతన ఫౌండేషన్ చైర్మన్ రవికుమార్, జాయింట్ సెక్రటరీ సీతారామయ్యతో పాటు ఇతర సభ్యులను మంత్రి సన్మానించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, చేతన ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.