-దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ మత్స్యకారుల అభివృద్ది
-ఏ దళారీ ప్రమేయం లేదు..పూర్తి ఉచితంగా చేప పిల్లల పంపిణీ
-మత్స్యకారులను నేరుగా భాగస్వామ్యం చేసి వందల కోట్ల సంపద సృష్టి
-ఈ ఏడాది ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే 1043 చెరువుల్లో 4.85 కోట్ల చేప పిల్లలు విడుదల
– మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
-చేప పిల్లలు వదిలేటప్పుడు పక్కాగా పిల్లల కౌంట్ చేసే అదునాతన మిషన్ ను మంత్రి ప్రారంభించారు
బాల్కొండ:దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో మత్స్యకారుల అభివృద్ది జరిగిందని,ముఖ్యమంత్రి కేసిఆర్ నిర్ణయంతో వృత్తిదారు ప్రతి ఇంటా నేడు సంబురం నెలకొందని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.
శుక్రవారం నాడు బాల్కొండ నియోజకవర్గం ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ నాగపూర్ పాయింట్ వద్ద 62.86 లక్షల ఉచిత చేప పిల్లలను మంత్రి వదిలారు.చేప పిల్లలు విడుదల చేసే క్రమంలో నూతనంగా చేపపిల్లలు కౌంటింగ్ చేసే మిషన్ ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. చేప పిల్లల విడుదలలో అవకతవకలు జరగకుండా కచ్చితంగా విడుదల చేసిన చేపపిల్లలను ఈ మిషన్ లెక్కిస్తుందన్నారు.
ఏ దళారీ ప్రమేయం లేకుండా..పూర్తిగా ప్రభుత్వ ఖర్చుతో ఉచితంగా చేప పిల్లల పంపిణీ జరుగుతుందన్నారు.మత్స్యకారులనే ఇందులో భాగస్వామ్యం చేయడం వల్ల వందల కోట్ల సంపద సృష్టి జరిగి వృత్తి దారుల కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందాయని తెలిపారు. ముఖ్యమంత్రి కేసిఆర్ తీసుకున్న ఈ నిర్ణయంతో సంపద సృష్టి పట్ల దేశంలోని ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముఖులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. కేసిఆర్ సరికొత్త నీలి విప్లవానికి నాంది పలికారన్నారు. ఈ ఏడాది ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే 1043 చెరువుల్లో 4.85 కోట్ల చేప పిల్లలు విడుదలకు ప్రణాళిక చేశామన్నారు. వీటి ద్వారా సుమారు 500 కోట్ల సంపద సృష్టి జరగనుందని మంత్రి ఆశాభావం వ్యక్తంచేశారు.ఈ కార్యక్రమంలో వివిధ మత్స్యకార వృత్తి సంఘాల ప్రతినిధులు, అధికారులు,నాయకులు,తదితరులు పాల్గొన్నారు.