Suryaa.co.in

Andhra Pradesh

స్మార్ట్ బోర్డు వాడకం తెలియని ముఖ్యమంత్రి

-విద్యార్ధుల సమస్యలు పట్టని విద్యాశాఖ మంత్రి
-విద్యార్ధుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న ప్రభుత్వం
– కె.ఎస్.జవహర్

స్కూల్లోని స్మార్ట్ క్లాస్ బోర్డును ఎలా ఉపయోగించాలో కూడా తెలియని ముఖ్యమంత్రి, సాంకేతిక పరిజ్ఞానాన్ని తానే తెచ్చినట్లు గొప్పలు చెప్పుకోవడం హాస్యాస్పదం. స్మార్ట్ స్కూల్స్ విధానాన్ని ప్రవేశపెట్టిందే తెలుగుదేశం ప్రభుత్వం. విద్యార్ధులకు మెరుగైన విద్యను అందించాలనే లక్ష్యంతో సాంకేతిక పరిజ్ఞానాన్ని చేరువ చేస్తూ అధునాతన పద్దతుల్లో భోదన అందించడం జరిగింది.

విద్యాలయాలను రాజకీయాలకు కేంద్రాలుగా మార్చి విద్యా వ్యవస్థను నాశనం చేసిన ఘనత జగన్ రెడ్డిదే. సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో ముఖ్యమంత్రి గానీ, మంత్రులుగానీ ఒక్క రాత్రి బస చేసే పరిస్థితి ఉందా? విద్యార్ధులకు కనీస సదుపాయాలు లేక ఇబ్బంది పడుతున్నా.. ముఖ్యమంత్రి ఏనాడైనా స్పందించారా? నాశిరకమైన కిట్లు అందించి, అందులోనూ కమిషన్లు కొట్టేస్తూ.. విద్యా రంగాన్ని ఉద్దరించినట్లు ప్రచారం చేసుకోవడం జగన్ రెడ్డి వైఖరికి నిదర్శనం. 15వేల పాఠశాలల విలీనంతో పేద విద్యార్ధుల్ని చదువులకు దూరం చేశారు. ఏటా డీఎస్సీ హామీని తుంగలో తొక్కారు.

జగన్ రెడ్డి పాలనలో చదువులు.. నేతి బీరలో నెయ్యిలా తయారైంది. ఎయిడెడ్ వ్యవస్థను నిర్వీర్యం చేసింది, పీజీ విద్యార్ధులకు ఫీజు రీయింబర్స్ మెంట్ దూరం చేయడమే జగన్ రెడ్డి సాధించిన విజయాలు. దేశంలోనే అత్యధిక డ్రాపౌట్స్ ఏపీలో ఉండడం వాస్తవం కాదా? గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన పథకాలకే పేర్లు మార్చి, లబ్దిదారుల్ని కుదించిన ఘనత జగన్ రెడ్డిది.

టీడీపీ హయాంలో 130కి పైగా పథకాలను అమలు చేస్తే, ఒక్క సంక్షేమ పథకం కూడా అమలు చేయలేదని చెప్పడం జగన్ రెడ్డి అవగాహనా రాహిత్యానికి, అహంకారానికి నిదర్శనం. రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు గ్యారెంటీ.. తెలుగుదేశంతోనే. అన్నదాత సుఖీభవ, బీసీలకు రక్షణ చట్టం, ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మహాశక్తి వంటి పథకాల పట్ల మీ వైఖరేంటి?

LEAVE A RESPONSE