Suryaa.co.in

Telangana

క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించాలి

-ఎల్బీ స్టేడియంలో నిర్వహించే విందుకు సీఎం హాజరు
-నియోజకవర్గానికి వెయ్యి మందికి చొప్పున గిఫ్ట్ ప్యాక్ ల పంపిణీ
-జిహెచ్ఎంసి పరిధిలో 200 ప్రాంతాల్లో 500 మందికి క్రిస్మస్ బహుమతుల పంపిణీ
-క్రిస్మస్ సెలబ్రేషన్స్ పై కమిటీ సభ్యులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష

ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు అధికారులను ఆదేశించారు.

శనివారం రాత్రి ప్రజాభవన్ కార్యాలయంలో క్రిస్మస్ వేడుకల నిర్వహణపై సెలబ్రేషన్ కమిటీ అధికారులతో డిప్యూటీ సీఎం సమీక్ష నిర్వహించారు. తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిర్వహిస్తున్న మొట్ట మొదటి పండుగ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగాలన్నారు. ప్రజల సంపద ప్రజలకు పంచడంలో భాగంగా పేద కుటుంబాలకు క్రిస్మస్ సందర్భంగా గిఫ్ట్ ప్యాక్ ల పంపిణీ, విందును ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని ఈనెల 22న ఎల్బీ స్టేడియంలో నిర్వహిస్తున్న విందు కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. క్రిస్మస్ ను పేదలు కూడా సంతోషంగా జరుపుకోవాలనే ఆలోచనతో పేదలకు ప్రభుత్వం గిఫ్ట్ ప్యాక్ లు (దుస్తులు) పంపిణీ చేస్తున్నదని ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు దశ దిశ నిర్దేశం చేశారు. జిహెచ్ఎంసి పరిధిలోని 200 ప్రాంతాల్లో 500 మందికి, 95 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వెయ్యి మందికి చొప్పున గిఫ్ట్ ప్యాక్ లను పంపిణీ చేయడంతో పాటు విందు ఏర్పాటు చేయాలని సూచించారు.

క్రిస్మస్ వేడుకలు నిర్వహణ యాక్షన్ ప్లాన్ గురించి మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు వివరించారు. పేద క్రైస్తవులకు పంపించేసి గిఫ్ట్ ప్యాక్ దుస్తుల నాణ్యతను ఆయన పరిశీలించారు. ఈ సమావేశంలో
ఎంసీహెచ్ఆర్ డి అడిషనల్ డైరెక్టర్ బి.ఎం ఎక్కా, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎం.డి కాంతి వెస్లీ, జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, సైబరాబాద్ సీపీ మహంతి, రాచకొండ సిపీ సుధీర్ బాబు తదితర ఉన్నత అధికారులు పాల్గొన్నారు

LEAVE A RESPONSE