- మద్యం పాలసీని మార్చడం వల్ల ప్రభుత్వానికి రూ.18,860.51 కోట్లు నష్టం
- మద్యం తయారీ కంపెనీలను భయపెట్టి లాక్కున్నారు…మద్యం ఆదాయం వైసీపీ ఖాతాలోకి వెళ్లింది
- అక్రమాల కోసమే రైల్వే శాఖలో ఉన్న వాసుదేవరెడ్డిని ఏపీకి తీసుకొచ్చి ఎక్సైజ్ శాఖలో పెట్టారు
- నాణ్యతలేని మద్యంతో ప్రజల ప్రాణాలు తీశారు…ఎక్సైజ్ శాఖను త్వరలోనే ప్రక్షాళన చేస్తాంపాల
- న ఎలా ఉండకూడదో, పాలకుడు ఎలా ఉండకూడదో చెప్పడానికి జగన్ ఒక కేస్ స్టడీ
- రాజకీయాల్లో నేరస్తులుంటే రాజకీయాలు నేరమయం అవుతాయి
- ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
- ఎక్సైజ్ పై అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం
అమరావతి : ‘‘వైసీపీ ప్రభుత్వంలో ఎక్సైజ్ శాఖలో జరిగిన అక్రమాలను పూర్తి స్థాయిలో వెలికితీసేందుకు సీఐడీకి అప్పగిస్తాం. ఆన్ లైన్ లావాదేవీలు లేకుండా నగదు రూపంలో అమ్మకాలు సాగించినందున ఈడీ సపోర్టు కూడా తీసుకుంటాం. 2019లో వచ్చిన వైసీపీ ప్రభుత్వం మద్యం పాలసీని మార్చడం వల్ల ప్రభుత్వానికి రూ.18,860.51 కోట్ల నష్టం వాటిల్లింది. రాష్ట్ర ఆదాయానికి గండికొట్టినందున తప్పకుండా చర్యలు ఉంటాయి. నాసిరకం మద్యం సేవించి ఎంతమంది అనారోగ్యం పాలయ్యారో ఆరోగ్య శాఖ నుండి వివరాలు సేకరిస్తాం.’’ అని సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు.
శాసనసభలో బుధవారం ఎక్సైజ్ శాఖపై శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ…‘‘రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా భయకరంగా ఉంది…ఇంకా లోతుల్లోకి వెళ్లి పరిశీలించాల్సి ఉంది. బాగోలేని ఆర్థిక పరిస్థితి వల్ల పూర్తి స్థాయి బడ్జెట్ కూడా పెట్టుకోలేని పరిస్థితి. కేంద్ర బడ్జెట్ లో ఏపీకి ప్రత్యేకంగా నిధులు కేటాయించింది. కేంద్రం ఇచ్చిన వెసులు బాటు తాత్కాలికం. రాష్ట్రానికి ఆదాయాన్ని పెంచుకోగలిగితేనే శాశ్వత వెసులుబాటు లభిస్తుంది.
గత ఐదేళ్లు రాష్ట్రంలో ఏం జరిగింది…ఎంత నష్టం జరిగింది, కోలుకోలేని దెబ్బ ఏ విధంగా తగిలిందో వివరించడానికే శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. పోలవరం, అమరావతి, విద్యుత్, సహజ వనరుల దోపిడీపై ఇప్పటికే శ్వేతపత్రాలు విడుదల చేశాం. ప్రజలకు జావాబుదారీతనంగా ఉండాలనే శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. సంక్షేమం, అభివృద్ధి సమతుల్యతతో సంపద సృష్టించాల్సి ఉంది. కానీ ఐదేళ్ల పాటు జరిగిన విధ్వంసంతో 25 ఏళ్లకు కూడా కోలుకోలేని దెబ్బ తగిలింది.
పాలన ఎలా ఉండకూడదో గత ఐదేళ్ల పాలన ఒక కేస్ స్టడీ. పాలకుడు ఎలా ఉండకూడదో జగన్ కేస్ స్టడీగా ఉన్నారు. తక్షణ అవసరాల కోసం కొందరు తప్పులు చేస్తారు..కొంత మంది అత్యాశతో తప్పులు చేస్తారు. ఉన్మాదంతో మరికొంత మంది తప్పులు చేస్తారు…గత ఐదేళ్లు కేవలం ఉన్మాదంతో డబ్బు కోసం మాత్రమే తప్పులు చేశారు. ప్రజలు ఏమైనా పర్వాలేదు అన్న ఉద్దేశంతో వ్యవహరించారు.’’ అని సీఎం చంద్రబాబు అన్నారు.
నేరస్తులు రాజకీయాల్లో ఉంటే రాజకీయాలు నేరమయం అవుతాయి
‘‘మద్యంపై విడుదల చేసిన శ్వేతపత్రాన్ని సభలో సభ్యులే కాదు…రాష్ట్ర ప్రజలు కూడా అవగాహన చేసుకోవాలి. ఒక వ్యక్తి ఇన్ని తప్పులు చేసి కూడా మళ్లీ అడ్డగోలుగా మాట్లాడతారనే దానికి ఎక్సైజ్ శ్వేతపత్రం ఒక ఉదాహరణ. ఏ ముఖ్యమంత్రిగానీ, మంత్రిగానీ ఇలాంటి దుర్మార్గాలు చేయరు. మనకు ప్రజలు ఓట్లు వేశారంటే వారి ఆస్తులకు, భవిష్యత్తుకు భరోసా కల్పిస్తామని. మనం కూడా జరిగిన అన్యాయాన్ని విడమర్చి చెప్పకపోతే వారిలో కూడా అవగాహన రాదు.
దీంతో మనం కూడా వారికి అన్యాయం చేసిన వాళ్లమవుతాం. జగన్ కు ఆ 40 శాతం మంది కూడా ఓట్లు వేయడానికి కారణం ప్రజలు కాదు, చైతన్యం తీసుకురాకపోవడంతోనే ఆ ఓట్లు కూడా పడ్డాయి. నేరస్తులు రాజకీయాల్లో ఉంటే రాజకీయాలు నేరమయం అవుతాయి. నేరస్తుడే రాజకీయాలకు అధిపతి అయితే ఎలా ఉంటుందో చెప్పలేం.
నేరస్తుడే పాలకుడు అయితే ఏం జరుగుతుందో గత ఐదేళ్లు చూశాం. 7 శ్వేతపత్రాలు చదివితే రాష్ట్రానికి గత పాలకులు ఎంత ద్రోహం చేశారో తెలుస్తుంది. కేంద్ర బడ్జెట్ లో మనకు కేటాయింపులు వచ్చినందుకు ఆనందించడంతో పాటు రాష్ట్రంలో జరిగిన దోపిడీని కూడా ప్రజలకు చెప్పి చైతన్యం తీసుకొస్తాం.’’ అని సీఎం అన్నారు.
మద్య నిషేధం అని చెప్పి పాలసీలు మార్చి దోచేశారు
‘‘ఎన్నికల మేనిఫెస్టోలో మద్య నిషేధం చేస్తామని చెప్పారు. లిక్కర్ అమ్మకాలు తగ్గిస్తామని చెప్పారు. ఫైవ్ స్టార్ హోటళ్లకు మాత్రమే పరిమితం చేస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక 4,380 ఉన్న షాపులను కొత్త మురిపెంగా 2,934కు తగ్గించారు. తర్వాత యేడాది 3,392కు పెంచారు. బార్ లు 2019లో ఉన్ని ఉన్నాయో వాటినే కొనసాగించారు…తగ్గించలేదు. పేరకు మద్య నిషేధం అని చెప్పి వ్యక్తిగత స్వార్థం కోసం ఏకంగా పాలసీనే మార్చారు. దీని ద్వారా నేరాలు పెరగడం, బ్లాక్ మార్కెట్ పెరిగింది.
ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడారు. ధరలు పెంచుకుంటూ పోతే తాగేవాళ్లు తగ్గుతారని, జీవన ప్రమాణాలు పెరుగుతాయని చెప్పారు. కొత్తగా తెచ్చిన మద్యం పాలసీ వల్ల 72 శాతం అమ్మకాలు పెరిగాయి. విచ్చలవిడిగా అమ్మకాలు పెంచారు. జీవో నంబర్ 128 తీసుకొచ్చి 60/90 మిల్లీ లీటర్లకు దేశంలో తయారయ్యే ఫారిన్ లిక్కర్ రూ.10 ఉంటే అధికారంలోకి రాగానే దాన్ని రూ.20 చేశారు. రూ.20ది రూ.40,లకు, రూ.250ది రూ.480 లకు పెంచారు. మరుసటి రోజునే మళ్లీ జీవో నంబర్ 129 తెచ్చి ఉన్న ధరలు రెట్టింపు చేశారు. ఇది పిచ్చితనం కాకపోతే ఎవరన్నా చేస్తారా?
ఏం చేసినా నడిచిపోతుందని ప్రవర్తించారు. మద్యం పాలసీ కారణంగా కేసులు 321 శాతం, అరెస్టులు 466 శాతం, స్మగ్లింగ్ 2,012 శాతం పెరిగాయి. అక్రమంగా మద్యం తరలించే వాహనాల సీజ్ కూడా 636 శాతం పెరిగింది. తెలంగాణ, కర్నాటక, తమిళనాడు, ఒరిస్సాల నుండి మద్యం అక్రమంగా రాష్ట్రంలోకి తరలించారు.
మళ్లీ 2020 సెప్టెంబర్ లో 50/60/200/180 ఎమ్ఎల్ బాటిళ్ల ధరలను తగ్గించారు. 2019-24 మధ్య కిడ్నీలు పాడైనవారు 52 శాతం, ఊపిరితిత్తులు పాడైనవారు 54 శాతం పెరిగారు. సగటున మద్యం సేవించే వారి సంఖ్య 2019-2020 మధ్యన 5.55 నుండి 6.23 శాతానికి పెరిగింది. రేట్లు పెంచి లిక్కర్ అమ్మకాలు తగ్గిస్తామని చెప్పినప్పటికీ భారీగా వినియోగం పెరిగింది.’ అని సీఎం వివరించారు.
ప్రభుత్వానికి తగ్గిన ఆదాయం వైసీపీ ఖాతాలోకి చేరింది
‘‘అక్రమ మద్యం రవాణా, గంజాయి, నాటు సారా నివారణ కోసం జీవో నెంబరు 41 ద్వారా సెబ్ వ్యవస్థను తీసుకొచ్చారు. కానీ గంజాయి సీజ్ 27 శాతం, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ 66 శాతం, కేసుల సంఖ్య 64 శాతం, అరెస్టులు 161 శాతం మేర పెరిగాయి. అంత నివారణ జరిగితే ఎందుకు కేసులు పెరుగుతాయి. బేవరేజ్ కార్పొరేషన్ చైర్మన్ గా ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ నుండి వాసుదేవరెడ్డిని దోపిడీ కోసం రాష్ట్రానికి తీసుకొచ్చారు. వీళ్లు తీసుకొచ్చిన మద్యం విధానం వల్ల తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల ఆదాయం పెరిగింది…ఏపీ ఆదాయం తగ్గింది.
ఆ తగ్గిన ఆదాయమంతా గత పాలకుల జేబుల్లోకి చేరింది. మద్యం ఆదాయం ఏపీ తెలంగాణ మధ్య 2014 నుండి 2019 వరకు 4,186 కోట్లు తేడా ఉండగా 2019 నుండి 2024 వరకు 4,276.15 కోట్లు తేడా ఉంది. తెలంగాణలో పాత పాలసీయే కొనసాగినా ఆదాయం పెరిగింది. 2018-19 మధ్య ఐఎమ్ఎఫ్ఎల్ 384 లక్షల కేసులను విక్రయించగా 2023-24 మధ్య 346 లక్షల కేసులను మాత్రమే విక్రయించారు. 2018-19 మధ్య 40 నుండి 50 లక్షల కేసులు తెలంగాణ కంటే అధికంగా విక్రయించగా, 2023-24 మధ్య తెలంగాణ 15 లక్షల కేసులు ఏపీ కంటే అధికంగా విక్రయించింది.
కర్నాటకలో 2018-19 మధ్య 200 లక్షల కేసులు మాత్రమే అధికంగా ఉంటే…2023-24 మధ్య ఆ తేడా 350 లక్షలకు పెరిగింది. లిక్కర్ సప్లై విధానాన్ని కూడా గత పాలకులు వాళ్ల చేతుల్లోకే తీసుకున్నారు. తయారు చేయడం, హోల్ సేల్, రిటైల్, దొంగ వ్యాపారం కూడా వాళ్లే చేశారు. బెదిరించి లిక్కర్ ఫ్యాక్టరీలను లాక్కున్నారు. దేశంలో దొరికే లిక్కర్ బ్రాండ్లు ఏపీలో లేకుండా చేశారు. 2014-19 మధ్య ఉన్న డిమాండ్ ను బట్టి బేవరేజ్ కార్పొరేషన్ సప్లై చేసింది…కానీ 2019-24 మధ్య వారికి నచ్చిన వాటినే షాపులకు సప్లై చేశారు.
2014-19 మధ్య 31 బ్రాండ్ల లిక్కర్ బాటిల్ ధర రూ.50 నుండి రూ.70 మధ్యనే ఉండేది. ఆ 31 బ్రాండ్లకు సంబంధించి 2,69,71,788 కేసులు విక్రయం జరిగితే…2019-24 మధ్య ఆ బ్రాండ్లన్నీ రద్దు చేసి కేవలం 2 బ్రాండ్లకు సంబంధినవి 8,454 కేసులు విక్రయించారు. 20 రకాల ఐఎమ్ఎఫ్ఎల్ ను లాక్కున్నారు. ఆదాన్, గ్రేసన్, లీలా, జేఆర్ అసోసియేట్స్, పీవీ స్పిరిట్స్ ఇలా పలు కంపెనీలు 2 వేల లక్షల లీటర్లు విక్రయించి రూ.20,356 కోట్లు ఆర్జించాయి.
తక్కువ నాణ్యత గల లిక్కర్ ను సరఫరా చేశారు. దేశంలోనే టాప్ 5 బ్రాండ్స్ ఏపీలో 2023-24 మధ్య అమ్మకాలు లక్షల స్థాయి నుండి 0.91కి స్థాయికి పడిపోయాయి. టాప్ 5 ఫాస్ట్ మూవింగ్ బ్రాండ్స్ 2018-19 మధ్య 0 శాతం ఉంటే 2023-24 మధ్య విపరీతంగా పెరిగాయి.’’ అని అన్నారు.
ఎక్కడా లేని బ్రాండ్లు తెచ్చారు
టాప్-3 బీర్లు 2018-19 మధ్య పాపులర్ గా ఉంటే…వాటిని కూడా పూర్తిగా తగ్గించేశారు. లోకల్ బ్రాండ్స్ విక్రయం 0 నుండి 12 లక్షలకు పెరిగింది. ఈ బ్రాండ్లన్నీ చూస్తే గతంలో ఎక్కడున్నాయో తెలీదు. బూమ్ క్లాసిక్ బీరు, బూమ్ సూపర్ స్ట్రాంగ్, బూమ్ సుపీరియర్ స్ట్రాంగ్ బీర్ అంటూ రకరకాల బీర్లు తీసుకొచ్చారు. 2019లో మల్టీ నేషన్ కంపెనీలకు ఇవ్వాల్సిన రూ.127 కోట్లు బకాయిలను 2023 వరకూ చెల్లించలేదు. అన్ని విధాలా వారిని వేధించారు. షాపుల్లో మద్యం కొనుగోలు చేస్తే బిల్ ఇవ్వలేదు..ఆన్ లైన్ విధానం లేదు.
ఒక్కో మద్యం కేస్ సరఫరాకు అక్రమంగా రూ.200లు, బీర్ కేసుకు రూ.50లు వసూలు చేశారు. 2019-24 మధ్య ఐఎమ్ఎఫ్ఎల్ నుండి రూ.2,861 కోట్లు, బీర్లు నుండి రూ.252 కోట్లు కాగా మొత్తం రూ.3,113 కోట్లు అక్రమంగా వసూలు చేశారు. ఐదేళ్ల పాటు అమ్మిన మద్యానికి డిజిటల్ చెల్లింపుల్లో కాకుండా కేవలం నగదరు రూపంలో విక్రయించి రూ. 99,413.5 కోట్లు తీసుకున్నారు.
డిజిటల్ చెల్లింపుల రూపంలో కేవలం రూ.615 కోట్లు మాత్రమే తీసుకున్నారు. ఈ రోజుల్లో తోపుడు బండ్ల వాళ్లు కూడా ఆన్ లైన్ పేమెంట్ తీసుకుంటుంటే ఇక్కడ మాత్రం అసలు ఆన్ లైన్ పేమెంటు అనేదే లేకుండా చేశారు. బిల్లు ఇవ్వండని అడిగిన వారిని అరెస్టులు చేశారు.
మద్యం ఆదాయాన్ని చూపి అప్పులు
నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో గణాంకాల ప్రకారం మద్యానికి బానిసలై చనిపోయిన వారి సంఖ్య 2018తో పోల్చుకుంటే గత ఐదేళ్లలో 100 శాతం పెరిగాయి. మానసికంగా, లైంగిక వేధింపులు 76.40 శాతం పెరిగాయి. ఊపిరితిత్తులు పాడైనవారు 52 శాతం, కిడ్నీలు పాడైన వారు 54 శాతానికి పెరిగారు. ఒక్క గుంటూరు జనరల్ హాస్పిటల్ లోనే మద్యం, డ్రగ్ కు బానిసైనలై చేరిన వారి సంఖ్య 343 నుండి 4,913కు పెరిగింది. మద్యం ఆదాయాన్ని చూపి కూడా రూ.16,446.15 కోట్లు అప్పులు తీసుకొచ్చారు.
కమీషన్ కింద రూ.166 కోట్లు చెల్లించారు. పది ప్రభుత్వ సంస్థల విభాగాలకు సంబంధించిన రూ.250 కోట్లను మద్యంలో పెట్టుబడిగా పెట్టారు. మద్య నిషేధం పేరు చెప్పి 25 ఏళ్లు, 10 ఏళ్ల పాటు కాలపరిమితితో అప్పులు తీసుకొచ్చారు. దేశ చరిత్రలో ఇదొక పెద్ద మోసం. రానున్న రోజుల్లో ఎక్సైజ్ శాఖను ప్రక్షాళన చేస్తాం. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని నాసిరకం బ్రాండ్లన్నీ రూపుమాపుతాం. షాపులు, బార్ల పాలసీని కూడా కొత్తగా తీసుకురావాల్సి ఉంది.
డిజిటల్ పేమెంట్లు కూడా తీసుకొస్తాం. తప్పులు చేసిన వారిని వదిలేస్తే దొంగలు తప్పించుకుంటారు. ఐదేళ్ల పాటు మంత్రుల శాఖల్లో జరిగిన తప్పిదాలు బయటకు తీయండి..రాజకీయంగా వేధించే విధానం ఉండదు. లూటీ చేసి ఎదురుదాడి చేస్తే ఊరుకునేది లేదు. ప్రజాహితం కోసం మనం పని చేస్తున్నాం. తయారు చేసిన మద్యాన్ని డిస్టలరీలు రూ.16కు షాపులకు ఇస్తారు…దాన్ని రూ.200లకు అమ్మారు.
రూ.180 ప్రభుత్వానికి రావాల్సి ఉండగా రాలేదు. ఆ మిగిలిన డబ్బంతా వారి జేబుల్లోకి వెళ్లింది. మద్యం విక్రయాలకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తీసుకుని వారికి అందించే జీతాలపైనా బిల్లులు ఎక్కువ వేశారు. ఎక్కడ చూసినా గంజాయి ఇష్టానుసారంగా విక్రయించారు. ఆ మత్తులో దాడులకు తెగబడుతున్నారు. ఐదేళ్లో జరిగిన అక్రమాలు బయటపడతాయని ప్రభుత్వ కార్యాలయాలు తగలబెడుతున్నారు.’’ అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.