ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి చెల్లి వైయస్ షర్మిల కీలక పాత్ర పోషించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. దానికి దారి తీసిన కారణాలు అనేకం. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ పదవి లేకపోవడం, తండ్రి ఆస్తిలో సరైన వాటా రాకపోవడం, అన్నతో విభేదాలు, కొప్పులు కొట్లాట, ఇలాంటివి ఎన్నో ఉన్నాయని ప్రజలు అనుకుంటున్నారు.
సాక్షి పేపర్లో నాకు వంతు, వాటా ఉంది. నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డనే అనే వరకు చాలా తీవ్రమైన పదజాలంతో మాట్లాడుతున్నారు. నీవు నేర్పిన విద్యనే నీరజాక్ష అన్నట్టు.. పవన్ కళ్యాణ్ ని ఇష్టమొచ్చినట్టు వ్యక్తిగత దూషణ ఏ విధంగా చేశాడో, చేయించాడో ఇప్పుడు అదే పరిస్థితి వారికి వచ్చేసింది.( పెద్దవారు అంటుంటారు ఈ చేత్తో చేసింది ఆ చేత్తో వస్తుందని )
వైసీపీ నాయకులు చివరకు ఆమె భర్త ఇంటి పేరు, కులం కూడా ప్రస్తావనకు రావడం దానిని వ్యంగంగా మాట్లాడడం.. మొదటిసారి ఆస్తులు, రాజకీయ పెత్తనం విషయాలలో గొడవలు మొదలై,రోడ్డు మీదకు వచ్చిన మహిళకు రాజకీయం తోడైతే పరిస్థితులు ఏ విధంగా దారితీస్తాయో కాలమే నిర్ణయిస్తుంది.
ఏది ఏమైనా రాష్ట్రంలో ప్రజలు మర్చిపోయిన కాంగ్రెస్ పార్టీ ని.. నేనూ రాజశేఖర్ రెడ్డి బిడ్డ నేననే పేరుతో ఆమె ఆంధ్ర రాజకీయాలలో ఆరంగేట్రం చేశారు. ఆమెకు రాజకీయంగా పెరగాలని.. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత కుటుంబ కలహాల వల్ల అన్నతో విభేదించి తల్లిని తీసుకొని రాజశేఖర్ రెడ్డి హైదరాబాదు ఇంటికి వచ్చేసింది. వైయస్సార్ టి పి పేరుతో .. నాకు తెలంగాణ అత్తగారిల్లు అని చెప్పి రాజకీయం మొదలుపెట్టి , 3000 కిలోమీటర్ల పైగా పాదయాత్ర చేసి ప్రజలలో నేనూ ఉన్నాను అనిపించుకున్నారు.
కానీ అక్కడ ఈమె ఆటలు, మాటలు సాగక కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడిన మాటలన్నీ మరిచిపోయి.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకపాత్ర వహించుటకు కంకణం కట్టుకొని ఏపీసీసీ ప్రెసిడెంట్ గా బాధ్యతలు తీసుకొని రాజకీయ మొదలుపెట్టారు. చుక్కాని, సరైన నాయకత్వ లేమితో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఒకరకంగా ఇది తియ్యటి వాతావరణమే.
ఇందులో ఆమె ఆంధ్ర రాజకీయాల్లోనైనా నాయకురాలిగా ఉండాలని వ్యక్తిగత స్వార్థం, కాంగ్రెస్ పార్టీ నాయకత్వలోపం తీర్చుకొనుటకు ఆనగలిగిన నాయకురాలు. రాజశేఖర్ రెడ్డి హావభావాలు, పోలికలు, వారిలాగా కొంత నటించడం, జగన్మోహన్ రెడ్డిని అన్ని విషయాలలో తూర్పుర పట్టగలిగిన చేవా, సత్తా ఉన్న నాయకురాలు దొరికారు. కాంగ్రెస్ పార్టీలో మిగిలిన పాత నాయకులందరూ జత కలుస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ ఆమెకు పూర్తి పగ్గాలు అప్పగించి.. రాష్ట్రంలో తిరిగి తన వైభవాన్ని నిలబెట్టుకొనుటకు ఎత్తుగడలు వేస్తూ, స్పెషల్ స్టేటస్ అంటే ఏమిటో తెలియని, దాని వల్ల ఉపయోగాలు తెలియని, ఎటువంటి రాష్ట్రాలకు ఇస్తారో తెలియక, కొంతమంది రాజకీయ నాయకులు మాట్లాడే మాటలకు అర్దం లేక, కాక 2016లో అన్నీ తెలుసుకొని నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా కంటే స్పెషల్ ప్యాకేజీ మేలని లెక్కలు వేసుకుని.. ఆనాటి ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జెట్లీ తో చర్చించి కేంద్రం దగ్గర హామీలు అమలు చేయించుకున్నారు.
ఒకవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం, స్పెషల్ స్టేటస్ ఇవ్వడానికి వీలుకాదు. స్పెషల్ స్టేటస్ ముగిసిన అధ్యాయం అని ఎన్నో వేదికల మీద చెబుతున్నప్పటికీ.. ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో బిజెపిని ఇరుకున,ఇబ్బంది పెట్టడానికి, రాజకీయంగా దెబ్బతీయడానికి అదొక స్లోగన్ గా తయారయింది.
షర్మిల వైఎస్ఆర్సిపి ని, ముఖ్యమంత్రి ని, వారి పాలనలో జరిగిన అవినీతిని, రాజశేఖర్ రెడ్డి మాట తప్పిన విధానాన్ని తూర్పార పట్టడం, మాట్లాడ్డం మొదలుపెట్టిన తర్వాత.. వైస్సార్సీపీ నాయకులు తిరిగి స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడుతున్నారు. కేంద్రం నుండి రాష్ట్రానికి 5 నెలల క్రితం వచ్చిన 10,340 కోట్ల రూపాయలు.. ఆనాటి చంద్రబాబు నాయుడు చేసుకున్న ఒప్పందంలో భాగమే. ఒకవైపు స్పెషల్ ప్యాకేజీ ఒప్పందాన్ని అమలు చేసుకుంటూ, తిరిగి స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడడం కేంద్ర ప్రభుత్వాన్ని తూలనాడడమే.
ఎన్నికల సమయం వచ్చేసరికి బిజెపి మీద అబాండాలు వేయుటకు.. ఎవరికంటే ఎవరు తీసుపోని విధంగా, స్పెషల్ స్టేటస్ గురించి,పోలవరం గురించి, విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి, విశాఖ రైల్వే జోన్ గురించి, వెనుకబడిన జిల్లాల స్పెషల్ గ్రాంట్ గురించి, మీ అన్న మీద అక్కసుతో బిజెపిని కూడా మాట్లాడుతున్నారు. ఇది తప్పు.
వాస్తవానికి పై చెప్పిన అన్ని విషయాలు బిజెపి ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద అభిమానంతో కచ్చితంగా అమలు చేసింది. మీరు వాస్తవ పరిస్థితి తెలుసుకోకుండా బిజెపిని కూడా విమర్శిస్తూ మాట్లాడుతున్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తి కాలేదంటే ఏపీ ప్రభుత్వ తప్పే తప్ప , బిజెపి ది కానే కాదు . దానికి మీరే లోతుగా ఆలోచించుకోండి.
ఈ మాట్లాడే మహా నాయకులంతా స్పెషల్ స్టేటస్ వల్ల ఏ విధమైన వనరులు వనగూరుతాయో, వివిధ రాజకీయ పార్టీ నాయకులు కానీ, విశ్లేషకులు గానీ చెప్పగలగాలి. రాహుల్ గాంధీ మేము గెలిస్తే మొట్టమొదటి సంతకం స్పెషల్ స్టేటస్ మీదనేనని మాట్లాడారు. కనీసం వారైనా వివరంగా చెప్పగలగాలి. వారి ప్రభావము వారి ఇండి అలయన్స్ ప్రభావము రాబోవు సార్వత్రిక ఎన్నికల్లో ఏ విధంగా ఉంటుందో ప్రత్యేకంగా నేను చెప్పనక్కర్లేదు. ఎన్డీఏ 400 సీట్లు పైగా గెలవబోతుంది.
ఈ పది సంవత్సరాలలో అవినీతి మరక అంటకుండా, దేశాన్ని అభివృద్ధి పథాన ముందుకు నడిపిస్తూ, స్వచ్ఛమైన పాలన అందిస్తూ, చెప్పిన హామీలు, వాగ్దానాలన్నీ అమలు చేస్తూ, ప్రపంచంలోనే భారతదేశాన్ని మొదటి స్థానంలో ఉంచాలని ప్రయత్నాలు చేస్తున్న, కేంద్ర ప్రభుత్వానికి, దేశానికి బాసటగా నిలవాల్సింది పోయి ..ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం, చెల్లని మాటలు మాట్లాడడం, బిజెపిని తూలనాడడం దేశ ప్రజలు సహించరు. మాట్లాడే మాటలకు విలువ, గౌరవం ఉండదు. ప్రజలు సహించరు. ఆంధ్ర రాష్ట్రంలో సైతం ఇప్పటికే ప్రధాని ఎవరు కావాలంటే 77% మోడీకే ఓటు పడుతున్నట్టు
సర్వేలు చెబుతున్నాయి .