– కొందరు కొత్త మంత్రుల పేషీలపై అవినీతి ఆరోపణలు
– బంధుమిత్రుల సౌజన్యంతో దందాలు?
– కొత్త మంత్రులను తప్పుదోవపట్టిస్తున్న పేషీ ఉద్యోగులు?
– అలాంటి వారిని గుర్తించి మార్చాలంటూ సెక్రటరీలకు ఆదేశాలు
– పీఎస్, ఓఎస్డీలపై వస్తున్న ఆరోపణలతో సర్కారు సీరియస్
– అవసరం లేకపోయినా డిప్యూటేషన్‌పై వచ్చిన వారిని పంపించాలని సూచనలు
(అన్వేష్)
అమరావతి: ఒకవైపు చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఆర్ధిక కష్టాలు ఎదుర్కొని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంటే.. మరోవైపు కొందరు మంత్రుల పేషీలు ప్రభుత్వానికి అప్రతిష్ఠ తెచ్చేలా అవినీతికి పాల్పడుతుండటంపై ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్నట్లు కనిపిస్తోంది.
కొందరు కొత్త మంత్రులు, ఒకరిద్దరు సీనియర్ మంత్రుల పేషీలు అవినీతికి ఆలవాలమయిన నేపథ్యంలో.. పేషీలను ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. తమకు వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో, ఆయా శాఖలకు చెందిన పేషీల్లో పనిచేసే ఉద్యోగులను తొలగించాలన్న ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది.
సచివాలయంలోని కొన్ని మంత్రుల శాఖలు అవినీతికి ఆలవాలమయ్యాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని శాఖల్లో జూనియర్ అసిస్టెంట్లు మొదలకుని, ఓఎస్డీ-పీఎస్‌ల వరకూ పీకల్లోతు అవినీతిలో మునిగిపోయారన్న నివేదికలు ఇప్పటికే నిఘా వర్గాలు ప్రభుత్వానికి అందించాయి. కొత్తగా వచ్చిన మంత్రులకు పాలనపై అనుభవం, అవగాహన లేకపోవడంతో కొన్ని పేషీల్లో పూర్తి స్థాయిలో పీఎస్,ఓఎస్డీలే మంత్రులను తప్పుదోవపట్టించి చక్రం తిప్పుతున్నారన్న ఆరోపణలపై నిఘా విభాగం కొద్ది నెలల నుంచి దృష్టి సారించి, ఆయా పేషీలపై ఫోకస్ పెట్టినట్లు చెబుతున్నారు.
కొందరు కొత్త మంత్రుల పేషీల్లో పనిచేసే పీఎస్‌లు.. మంత్రుల అనుభవరాహిత్యాన్ని అడ్డుపెట్టుకుని, మంత్రుల పేర్లతో ఆ శాఖ జిల్లా అధికారులకు ఫోన్లు చేసి, తమకు కావలసిన పనులు చేసుకుంటున్నారన్న ఫిర్యాదులపై ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి సారించినట్లు కనిపిస్తోంది.
చివరకు కొత్త మంత్రుల కుటుంబసభ్యుల్లో కూడా పేషీ ఉద్యోగులు చిచ్చు పెడుతున్నారని, మంత్రుల కుటుంబసభ్యులకు అవినీతి ఆదాయ మార్గాలు కూడా వారే చూపెడుతున్నారని, నిఘా వర్గాలు ఇప్పటికే ప్రభుత్వానికి నివేదికలిచ్చినట్లు సమాచారం. ఒక కొత్త మంత్రి పేషీలోనే ఈ తరహా దందా ఎక్కువగా జరుగుతున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో పేషీలను అవినీతి కేంద్రాలుగా మారుస్తున్న కొందరు పీఎస్, ఓఎస్డీ, ఉద్యోగులను వెనక్కి పంపించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ప్రధానంగా ఏడుగురు మంత్రుల పేషీపై విపరీతమైన అవినీతి ఆరోపణలు, నిఘా విభాగానికి అందినట్లు సమాచారం. దానితో వారి నియోజకవర్గాల నుంచి కూడా అదనపు సమాచారం తెప్పించుకున్న నిఘా విభాగం, అందులో పనిచేసే పీఎస్, పీఏ, ఓఎస్డీ, కీలకపాత్ర పోషిస్తున్న ఉద్యోగుల వివరాలు సేకరించి వాటిని ప్రభుత్వానికి నివేదించినట్లు తెలిసింది.
ముఖ్యంగా .. ఉత్తరాంధ్రకు చెందిన ఓ మంత్రి ఓఎస్డీ, ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన మరో మంత్రి పీఎస్, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక మంత్రి పీఎస్‌పై ఎక్కువ అవినీతి ఆరోపణలు ఉన్నట్లు నిఘా నివేదికలు వెల్లడించినట్లు సమాచారం. ఉత్తరాంధ్రకు చెందిన ఓ మంత్రి పీఎస్, ఓఎస్డీ బాగా ముదిరిపోయారన్న వ్యాఖ్యలు అటు సచివాలయ వర్గాల్లోనూ వినిపిస్తున్నాయ. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మరో మంత్రి పీఎస్ అయితే, తన పేషీలోని ఒక ఉద్యోగి ద్వారా దందాలు నడిపిస్తున్నారన్న సమాచారం నిఘా వర్గాలు సేకరించినట్లు చెబుతున్నారు.
అయితే పీఏల పాత్రపై పెద్దగా ఆరోపణలు లేవని, పీఎస్, ఓఎస్డీలపైనే ఆరోపణలు ఎక్కువగా వ స్తున్నట్లు గుర్తించారు. కొందరు మంత్రుల పేషీలో అధికారికంగా ఎలాంటి పని లేకపోయినా కేవలం కలెక్షన్ల కోసమే కొందరు ఉద్యోగులను, డిప్యూటేషన్‌పై తెచ్చుకున్నట్లు నిఘా విభాగం గుర్తించినట్లు సమాచారం. నిజానికి వారి అవసరం లేకపోయినా కేవలం ఈ లక్ష్యం కోసమే వారిని పేషీల్లో నియమించుకున్నట్లు గుర్తించారు. వారి వివరాలు కూడా తమ నివేదికలో రూపొందించారు.
గత నెలలో ఒక శాఖకు చెందిన పీఎస్ ఒకరు.. ఆశాఖకు అనుబంధంగా పనిచేసే సంస్థల నుంచి, మంత్రి పేరిట రెండు లక్షలు చొప్పున పంపించాలని ఫోన్లో ఒక పీఎస్ ఆదే శించినట్లు గుర్తించారు. దానితో కొండపల్లి ప్రాంతంలో అధికంగా ఉండే ఆ సంస్థలన్నీ కలిపి, పెద్ద మొత్తంలోనే పంపినట్లు నిఘా విభాగం గుర్తించింది. విశాఖలోనూ ఈ తరహా దందా జరుగుతున్నట్లు నిఘా తన నివే దికలో పేర్కొంది.
గత నెలలో జరిగిన బదిలీల వ్యవహారంలో కూడా రెండు శాఖలకు చెందిన మంత్రుల పేషీలో అడ్డగోలు అవినీతికి పాల్పడ్డారని, చివరకు మంత్రులు,ఎంపీ, ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలు కూడా పక్కనపెట్టి, యధేచ్చగా సంపాదించారన్న ఆరోపణలు కూడా లేకపోలేదు. ఒకశాఖలో ఓఎస్డీ ఒకరు చక్రం తిప్పగా, మరో మంత్రి పేషీలో పీఎస్ చక్రం తిప్పారన్న ఆరోపణలను నిఘా విభాగం పరిగణలోకి తీసుకుంది.
ఈ క్రమంలో తాజాగా మంత్రుల పేషీలో పనిచేసే వారిపై నివేదికలు రూపొందించాలని, అవినీతికి పాల్పడుతూ ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీస్తున్న ఆ పేషీ ఉద్యోగుల జాబితా రూపొందించాలని సెక్రటరీ, కమిషనర్లను ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.