Suryaa.co.in

Andhra Pradesh

మోదీ, అశ్వినీ వైష్ణవ్‌తో సీఎం బాబు భేటీ

– బుడమేరు వరదలపై నివేదిక ఇచ్చాక తొలిసారి ప్రధానిని కలిసిన సీఎం
– రైల్వే జోన్, సెయిల్‌లో విశాఖ ఉక్కు విలీనం, వరద నిధులపై చర్చ

ఢిల్లీ: ముఖ్యమంత్రి చంద్రబాబు దిల్లీలో ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి చెందిన కీలక అంశాలపై దాదాపు గంటపాటు ఆయన ప్రధానికి వివరించారు. ఇటీవల భారీ వర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేయగా, బుడమేరు పొంగి విజయవాడను ముంచెత్తింది. బుడమేరు వరదలపై నివేదిక ఇచ్చిన తర్వాత తొలిసారి ప్రధానితో భేటీ అయిన సీఎం చంద్రబాబు వరదలకు నష్టపోయిన రాష్ట్రానికి మరిన్ని నిధులు ఇచ్చి ఆదుకోవాలని కోరారు.

అలాగే పోలవరం ప్రాజెక్ట్ పనులు తిరిగి ప్రారంభించాలని, మరో సీజన్ నష్టపోకుండా నవంబర్‌లో వరద తగ్గుముఖం పట్టగానే కొత్త డయాఫ్రంవాల్‌ నిర్మాణ పనులు ప్రారంభించి వేసవి కల్లా పూర్తిచేసేలా సహకరించాలని చంద్రబాబు ప్రధానికి విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. ప్రధానితో సమావేశం ముగిసిన వెంటనే చంద్రబాబు తన అధికార నివాసానికి వెళ్లిపోయారు.

అక్కడ రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో చంద్రబాబు భేటీ అయ్యారు. కేంద్ర ప్రాజెక్టులకు పెండింగ్‌ నిధులు మంజూరుతోపాటు విశాఖ రైల్వే జోన్‌ పురోగతిపైనా కేంద్రమంత్రితో చర్చిస్తున్నారు. అమరావతికి అనుసంధానమయ్యే రైల్వే ప్రాజెక్టుల గురించి చర్చించనున్నారు. రాష్ట్రంలోని పోర్టుల అభివృద్ధి, అనుసంధానంపైనా కేంద్రమంత్రితో భేటీలో చంద్రబాబు వివరించనున్నారు.

మంగళవారం కూడా పలువురు కేంద్రమంత్రులతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. రాత్రికి దిల్లీలోనే బస చేయనున్న చంద్రబాబు, మంగళవారం ఉదయం ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీని కలుస్తారు. అమరావతి ORR సహా జాతీయ రహదారుల అభివృద్ధికి నిధుల గురించి మాట్లాడతారు.

ఉదయం 11.30 గంటలకు కేంద్రమంత్రి గడ్కరీతో సమావేశం అయ్యాక, సాయంత్రం పీయూష్‌ గోయల్‌, హర్‌దీప్‌సింగ్ పురిని కలవనున్నారు. మంగళవారం రాత్రి 8 గంటలకు హోంమంత్రి అమిత్‌షాతో చంద్రబాబు భేటీ కానున్నారు. అనంతరం రాత్రి 11 గంటలకు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తోనూ చంద్రబాబు సమావేశం కానున్నారు.

LEAVE A RESPONSE